మెట్రోలు అవసరమా?

విజయవాడ మెట్రో రైల్ కు కేంద్రం అభ్యంతరం చెప్పినట్లు వార్తలు వచ్చేసాయి. విజయవాడ జనాభా 20 లక్షలుకూడా లేదని అందువల్ల ఆర్థికంగా వేయబుల్ కాదన్నది ఆ అభ్యంతరం. అయితే మెట్రో ప్రాజెక్టు సాధన కోసం…

విజయవాడ మెట్రో రైల్ కు కేంద్రం అభ్యంతరం చెప్పినట్లు వార్తలు వచ్చేసాయి. విజయవాడ జనాభా 20 లక్షలుకూడా లేదని అందువల్ల ఆర్థికంగా వేయబుల్ కాదన్నది ఆ అభ్యంతరం. అయితే మెట్రో ప్రాజెక్టు సాధన కోసం చుట్టుపక్కల ప్రాంతాలను కలిపేస్తామని, పైగా భవిష్యత్ లో రాజధాని కారణంగా చాలా జనాభా పెరుగుతుందని కేంద్రానికి వివరిస్తామని అధికారులు చెబుతున్నారు. సరే, దీనివల్ల మెట్రోకు అనుమతి వస్తుందా? రాదా? అన్నది పక్కన పెట్టి పరిశీలించాల్సిన అంశాలువేరే వున్నాయి.

అసలు విజయవాడకు మెట్రో ఏ మేరకు అవసరం. హైదరాబాద్, చెన్నయ్ లాంటి నగరాలతో పోల్చుకుంటే విజయవాడ నగరం ఎంత? ఎంత లెక్క పెట్టినా, పది నుంచి పదిహేను కిలోమీటర్ల పరిథికి మించదు. భవిష్యత్ విస్తరణ చూసుకున్నా మరో అయిదు కిలోమీటర్లు. విజయవాడకు మెట్రో అందించాం అని చెప్పుకోవడానికి తప్ప, అంత అవసరం అయితే కనిపించదు. ఎందుకంటే ఇప్పటికే పబ్లిక్ సిటీ ట్రాన్స్ పోర్టు పూర్తి స్థాయిలో విస్తరించలేదు. అలాగే ప్రయివేటు ట్రాన్స్ పోర్టు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోలేదు. ప్రయివేటు, పబ్లిక్ రవాణా విస్తరణకు సరిపడా వ్యాపారం లేదన్నది అక్కడి వ్యాపారుల అభిప్రాయం. ఇప్పటికే పిడబ్ల్యుడి గ్రౌండ్స్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు కమ్యూనిటీ రవాణా లేదా, ప్రయివేటు పూలింగ్ రవాణా ద్వారా పది రూపాయిల ఖర్చుతో చేరిపోయే సదుపాయం వుంది. మెట్రో రవాణా మెరుగైనదే కావచ్చు కానీ, ఇంత తక్కువ ఖర్చుతో అయితే సాధ్యం కాదు.

పైగా ఇప్పుడు మెట్రో అన్నది విజయవాడ రహదారి వ్యవస్థను, నిత్య రవాణా వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. అలా అనుకుంటే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది అని అనోచ్చు. ముందుగా చేయాల్సింది. విజయవాడ రోడ్లను మెరుగుపర్చడం. సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపర్చడం, ఫుట్ పాత్ లను మెరుగుపర్చడం, ప్రధాన రహదారులకు అనుసంధానమైన ప్రత్యామ్నాయ మార్గాలను మెరుగుపర్చడం, రహదారి ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగించడం. ఇవి చేసిన తరువాత పబ్లిక్ రవాణా వ్యవస్థను మెరుగు పర్చాలి. అప్పుడు అవసరం అనిపిస్తే, మెట్రోకు వెళ్లడంలో తప్పులేదు. అంతే కానీ, మేం విజయవాడకు మెట్రో తెచ్చాం అనేందుకు మాత్రమే అంటే ప్రజా జీవనాన్ని అస్తవ్యస్థం చేయడమే అవుతుంది.

విశాఖ సంగతేమిటి?

విజయవాడతో పాటు బాగుండదని విశాఖ మెట్రో కూడా ప్రకటించారు. కానీ విజయవాడ మెట్రో వ్యవహారాలు కదిలినంత స్పీడుగా విశాఖ మెట్రో కదలలేదు. దీనికి చాలా కారణాలు వున్నాయి. ప్రధాన కారణం, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. మెట్రో ఈ ఎన్నికలు ఇటు అనుకూలంగానూ, ప్రతికూలంగానూ ప్రభావం చూపే అవకాశం వుంది. పైగా ఒకేసారి రెండు మెట్రోలు అంటే ఇటు ముందుకు వచ్చే సంస్థలు, ఇటు ప్రభుత్వం కూడా కాస్త ఇబ్బంది పడతాయి. అందుకే విశాఖ మెట్రోను సాగదీస్తున్నారు.

విజయవాడతో పోల్చుకుంటే విశాఖకు మెట్రో అవసరం కాస్త ఎక్కువే. ఎందుకంటే ఇక్కడ నగరం బహుముఖంగా విస్తరించింది. పైగా ప్రత్యామ్నాయ రహదారుల విస్తరణకు అవకాశం తక్కువ. ఎందుకంటే ఒకవైపు సముద్రం, మరో వైపు కొండలు అవరోథాలుగా వున్నాయి. అదీ కాక, అటు స్టీల్ ప్లాంట్ నుంచి ఇటు మధురవాడ ఐటి జోన్ వరకు, అలాగే అటు పెందుర్తి నివాస ప్రాంతాల నుంచి ఇటు బీచ్ రోడ్ వరకు రవాణా ఇబ్బడిముబ్బడిగా వుంది. పైగా గ్రోత్ రేట్ కూడా రాజధాని వచ్చిన తరువాత ఎలా వుంటుందో కానీ, ఇప్పుడయితే మాత్రం విజయవాడ కన్నా విశాఖే ముందంజలో వుంది. అయినా కూడా జనాభా, వేయబుల్ వంటివి లెక్కలు కడితే విశాఖ కూడా మెట్రోకి అర్హత సంపాదిస్తుందో లేదో చూడాలి. 

అందువల్ల ఎప్పుడో వచ్చే మెట్రో కోసం చూడకుండా రహదారుల వ్యవహారంపై దృష్టి సారించాలి. విజయవాడతో పోల్చితే విశాఖలో రహదారుల విస్తరణ, ఆక్రమణ రెండూ ఎక్కువే. ఎంత విస్తరించినా, ఆక్రమణలు వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు ఓట్లు కోసం ఈ చిల్లర వ్యాపారుల ఆక్రమణలను చూసీ చూడకుండా వదిలేస్తున్నారు. విశాఖలో మెయిన్ వ్యాపారం దుకాణాల్లో ఎంత సాగుతుందో, ఫుట్ పాత్ ల మీద అంతే సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో మెట్రో మొదలు పెడితే జన రవాణా కష్టాలు ఓ లెక్కలో వుంటాయి. కాంప్లెక్స్ ప్రాంతంలో ఒక్క ఫ్లయ్ ఓవర్ నిర్మిస్తేనే, జనం అయిదేళ్ల పాటు నానా కష్టాలు పడ్డారు. అలాంటిది మెట్రో మొదలుపెడితే నరకం చూడాల్సిందే. 

అందువల్ల మెట్రో అంటూ అంగలార్చే కన్నా, కనీస రవాణా సదుపాయాలకు అవసరమైన అన్ని చర్యలు నిర్మొహమాటంగా తీసుకోవడం అత్యవసరం.

ఆర్వీ