సినిమాహిట్ అయితే మాట్లాడుకోవడానికి బోలెడు, కానీ ఫ్లాప్ అయితే గమ్మున వుండాల్సిందే. ఆగడు తరువాత శ్రీనువైట్ల లాంటి దర్శకుడే మళ్లీ సినిమా పట్టుకోవడానికి కిందా మీదా పడాల్సి వచ్చింది. కిందకు దిగాల్సి వచ్చింది. తనకు నచ్చినా నచ్చకున్నా, కోన వెంకట్ అండ్ కో తో జతకట్టాల్సి వచ్చింది. ప్రకాష్ రాజ్ ఇంటకి తానే వెళ్లాల్సి వచ్చింది. ముఫై మూడు కండిషన్లకు తలొగ్గి రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. ఆగడు కు ముందు మాట ఇచ్చాడు కాబట్టి, రామ్ చరణ్ మాట మీద నిలబడి, తనకు కావాల్సినట్లు సినిమా చేయించుకుంటున్నాడు.
ఇప్పుడు సురేందర్ రెడ్డిది అదే పరిస్థితి. కిక్ 2 కు ముందు మాట ఇచ్చాడు రామ్ చరణ్. మరి ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి. కానీ కిక్ 2 వైఫల్యం కన్నా దాన్ని తీయడంలో దర్శకుడి నిర్లక్ష్యం కథను వివిధ సినిమాలనుంచి కొట్టుకొచ్చి, మిక్సీలో రుబ్బిన వైనం, రేసుగుర్రం విషయంలో కూడా అరవింద్ జాగ్రత్తపడడం ఇవన్నీ కలిపి రామ్ చరణ్ ను ఆలోచింప చేస్తున్నాయి. అయితే మెగా క్యాంప్ జాగ్రత్తలు ఓ లెక్కలో వుంటాయి కాబట్టి సురేందర్ రెడ్డికి చాన్స్ ఇచ్చినా ఇవ్వొచ్చు. అయితే సురేందర్ రెడ్డి తానేదో ఫుల్ బిజీ అన్నట్లు స్టేట్ మెంట్లు ఇస్తున్నాడు.
కిక్ 2 సీక్వెల్ గా త్రీ తీస్తానని, రేసుగుర్రం 2 తీస్తానని అంటున్నాడు. ఆయన తీస్తాడు సరే, తీసేవాళ్లు, వేసేవాళ్లు వుండాలిగా? ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రవితేజ మరి చాన్సివ్వకపోవచ్చు. బన్నీ సమస్యేలేదు..ఫుల్ బిజీ. మహేష్ దగ్గరకు కిక్ 2 కథ పట్టుకుని వెళ్లి వెనక్కు వచ్చాడు. అయినా అతిథి దెబ్బను మహేష్ అంత సులువుగా మరిచిపోతాడా? మిగిలిన ఏకైక ఆప్షన్ రామ్ చరణ్ నే. ఎందుకంటే కమిట్ మెంట్ లు, ప్రీ ప్లాన్ లు ఏవీ లేకుండా, వున్నాడు అతను. ఎవరు మంచి స్టోరీతో వచ్చినా రెడీ. అందువల్ల సురేందర్ రెడ్డి తన అదృష్టం అక్కడే వెదుక్కోవాల్సి వుంటుంది.