ఎన్టీయార్ బతికున్నంతకాలం కేంద్రం ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారు. రాష్ట్రానికైతే ఏలుకోవడానికి కొంత ప్రాంతం అంటూ వుంది. కేంద్రానికి ఏముంది? రాష్ట్రం సత్యం, కేంద్రం మిథ్య – అనేవారు. ఏవో విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి శాఖలు తమ వద్ద పెట్టుకుని తక్కిన అధికారాలన్నీ కేంద్రం రాష్ట్రాలకు బదిలీ చేయాలని వాదించేవారు.
అదే కేంద్రం ఆర్టికల్ 3ను వినియోగించి తన మరణానంతరం తన తెలుగురాష్ట్రాన్ని ముక్కలు చేసిందని వింటే ఆయన హృదయం ముక్కలయ్యేది. తన అధికారాలను దుర్వినియోగం చేసి యిరు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలను తన చేతిలోనే పెట్టుకుని, వాటిపై పెత్తనం చలాయిస్తోందని తెలిస్తే మరీ బాధపడేవారు.
ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి
కానీ ఆయన పేరు విషయంలో అదే కేంద్రం యిప్పుడు అక్కరకు వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్ టెర్మినల్‌కు పేరు విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏ తీర్మానం చేసినా పట్టించుకోకుండా 'లేదు, పేరు మార్పు జరిగిపోయింది. తీసేసే ప్రసక్తే లేదు' అని అరుణ్ జైట్లీ కరాఖండీగా పార్లమెంటులో చెప్పేశారు. తెరాస, కాంగ్రెసు సభ్యులు గోల చేసినా ఖాతరు చేయలేదు. అదేమంటే కేంద్రానికి వున్న అధికారాలు వుపయోగించాం అన్నారు.
ఎమ్బీయస్ ప్రసాద్