ఎమ్బీయస్‌ : తెలంగాణ మేధావులెక్కడ? – 3

గతంలో విభజన మాట వచ్చినప్పుడల్లా ఆంధ్రా నాయకులు 'పెట్టుబడులన్నీ హైదరాబాదులోనే పెట్టారు. మాకు ఏమీ లేకుండా చేసి, వట్టి చేతులతో పొమ్మంటే ఎలా?' అని వాదించేవారు. 'మీరు అభివృద్ధి పేరుతో హైదరాబాదును కలుషితం చేసేశారు.…

గతంలో విభజన మాట వచ్చినప్పుడల్లా ఆంధ్రా నాయకులు 'పెట్టుబడులన్నీ హైదరాబాదులోనే పెట్టారు. మాకు ఏమీ లేకుండా చేసి, వట్టి చేతులతో పొమ్మంటే ఎలా?' అని వాదించేవారు. 'మీరు అభివృద్ధి పేరుతో హైదరాబాదును కలుషితం చేసేశారు. ఒకప్పుడు పచ్చని తోటలతో అలరారేది. మీరు వచ్చి పర్యావరణం నాశనం చేసేశారు. హైదరాబాదు తహజీబ్‌ను ధ్వంసం చేసేశారు. ఇదివరకు ఎన్నో ఇరానీ హోటళ్లు వుండేవి, అర్ధరాత్రి దాటినా ముషాయిరాలు జరిగేవి. మీరు వచ్చాక త్యాగరాయ గానసభలో, రవీంద్రభారతిలో అన్నీ మీ సంస్కృతి ప్రతిబింబించే తెలుగు పాటలే, తెలుగు కార్యక్రమాలే.' అని అనేక మంది మేధావులు వాదిస్తూండేవారు. రాష్ట్రం ఏర్పడి ఐదు నెలలైంది. ముషాయిరాలు ఎన్ని పెరిగాయి? ఉమ్మడి రాష్ట్రంలో ముషాయిరాలు జరవద్దన్న నిషేధం ఏమైనా వుండిందా? ఓపికున్న వాళ్లు కార్యక్రమాలు చేసుకున్నారు, లేనివాళ్లు మానుకున్నారు. అన్నిటినీ ఆంధ్రుల నెత్తిన రుద్దేస్తే ఎలా? అభివృద్ధి జరిగితే పర్యావరణం దెబ్బతింటోంది. రెండింటినీ బాలన్స్‌ చేయలేకపోవడం విశ్వవ్యాప్తంగా కనబడుతోంది. దాన్నీ ఆంధ్రుల నెత్తినే రుద్దారు. మరి యిప్పుడు హుస్సేన్‌ సాగర్‌ విషయంలో జరుగుతున్న దేమిటి? ఐమాక్స్‌ గురించి అంత గోల పెట్టినవారు సంజీవయ్య పార్కులో ప్రపంచంలో కల్లా ఎత్తయిన టవరు కడతానంటే నోరు మెదపరేం? 

మనబోటి సామాన్యులం దానికే నివ్వెరపోతూ వుంటే మరో బాంబు పేల్చారు. హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ 40 ఆకాశహర్మ్యాలు కడతారట! ఇంకెక్కడి పర్యావరణం? అక్కడే ఎందుకు కట్టాలి? జనావాసాలు కావాలంటే శివార్లలో శాటిలైట్‌ టౌన్లు కట్టవచ్చుగా. ఊరి మధ్యలో అన్ని కట్టి వేడి పెంచడం దేనికి? ఆ పేరు చెప్పి కమ్మర్షియల్‌ స్పేస్‌ అమ్మి నిధులు సంపాదించడానికా? ఈ ప్లానుకు కేంద్రం, కోర్టులు ఒప్పుకుంటాయా? ఫోరం ఫర్‌ బెటర్‌ హైదరాబాదు అనే సంస్థ పార్కుల దుర్వినియోగంపై కోర్టుల్లో పోరాడుతోంది. 1996లో చెన్నారెడ్డి అంత్యక్రియలు ఇందిరా పార్కులో చేసినపుడు, సాగరతీరంలో ఎన్టీయార్‌ అంత్యక్రియలు జరిగినపుడు కోర్టుకి వెళితే పార్కులను మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని హైకోర్టు తీర్పు యిచ్చింది. ఐ మాక్స్‌, ఈట్‌ స్ట్రీట్‌, జలవిహార్‌, సంజీవయ్య పార్కు రైల్వే స్టేషన్‌ల పైనా కోర్టులో కేసులు వేశారు. సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తే వాళ్లు రైల్వే స్టేషన్‌ మినహా అన్నీ ఆక్రమిత కట్టడాలే అని తేల్చారు. తుది తీర్పు వచ్చేవరకూ ఏ నిర్మాణాలూ చేపట్టరాదని సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు యిచ్చింది. సాగర్‌ పరిసరాల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని హై కోర్టు స్పష్టమైన తీర్పు వుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుండి కొనుగోలు చేయడానికి అడ్వాన్సులు యిచ్చిన వారు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తే వాళ్ల గతి ఏమిటి? స్వచ్ఛభారత్‌ అంటూ హోరెత్తిస్తున్న కేంద్రం యిలాటి ఉల్లంఘనల పై మౌనంగా వుంటుందా? ఒక నిపుణుల కమిటీ వేసి, యిలాటి సందేహాలు నివృత్తి చేయవద్దా? 

ఈ కట్టడాలు ఒకవైపు ప్లాన్‌ చేస్తూనే మరోవైపు హుస్సేన్‌ సాగర్‌ శుద్ధి కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం 100 కోట్ల రూ.ల ఖర్చట. దీనికీ, ఆ బిల్డింగులకు బజెట్‌లో ఎలాట్‌మెంట్‌ వుందా? సాగర్‌ పరిరక్షించాలంటే కొన్నేళ్లపాటు సాగవలసిన కార్యక్రమం. నెలలో ముగియదు. ముందుగా క్యాచ్‌మెంట్‌ ఏరియాను క్లీన్‌గా మార్చాలి. దానిలోకి వస్తున్న నాలాలను డైవర్ట్‌ చేయాలి. నీళ్లు వుండగానే ట్రీట్‌మెంట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేయాలి. ఉస్మానియా యూనివర్శిటీ పర్యావరణ శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్‌ రూ. 100 కోట్ల ఖర్చుతో కెమికల్స్‌తో 15 రోజుల్లో చేస్తానని ముందుకు వచ్చారట. కొంత ప్రాంతాన్ని విడగొట్టి చిన్న స్థాయిలో ప్రయోగం చేసి చూపమనవచ్చు. ఇప్పుడున్న ప్లాను ప్రకారం చేస్తే అనర్థాలేమిటో ఆయన చెప్తున్నారు – 'సాగర్‌ నీటిని బయటకు వదిలితే లోతట్టు ప్రాంతాలు కొట్టుకుపోతాయి. నీటి అడుగున మిగిలిన మడ్డి దుర్గంధం సుమారు 5 కి.మీ. వరకు విస్తరిస్తుంది. సమీపంలో నివసించే ప్రజలు రోగాల బారిన పడతారు.' అని. నాలుగేళ్లు పరిశోధన చేసిన ప్రొఫెసర్‌ కాబట్టి ఆయన మాటల్లో వాస్తవం వుండవచ్చు. నా మట్టుకు నాకు అసలు అన్ని నీళ్లు ఎలా తోడతారో వూహించడానికే వింతగా వుంది.   తోడి ఎక్కడ పోస్తారు? చండీయాగం లాటిది ఏదో చేసి అగస్త్యుడిని రప్పించి పుక్కిట పట్టమంటారేమో! 

సాగర్‌ ఖాళీ చేశాక వాననీటితో దాన్ని నింపుతామంటున్నారు. అంత ఉధృతంగా వానలు పడతాయా? ఒకప్పుడైతే పడేవేమో, యిప్పుడు చుట్టూ కాంక్రీట్‌ జంగిలే. పగలంతా వేడి పీల్చుకుని రాత్రి వదులుతున్నాయి. చెట్లు నశించాయి. వానలు ఊళ్లో పడడం తగ్గిపోయింది. వాన పడినా సాగర్‌దాకా చేరాలంటే మధ్యలో ఎన్నో వీధులు, సందులు, సిమెంటు చప్టా చేసిన రోడ్లు. ఎలా ప్రవహిస్తుంది? ఎలా భూమిలో యింకుతుంది? బుద్ధ విగ్రహం మునిగిపోయినప్పుడు బయటకు తీయడానికే బృహత్‌ప్రయత్నం జరిగింది. మాస్కులు గీస్కులు వేసుకుని బయటకు లాగారు. అది జరిగి 20 ఏళ్లు దాటింది. ఈ మధ్యలో మరింత కలుషితం అయి వుంటుంది. సాగర్‌లో ఖాళీ చేసిన నీటిని శుభ్రం చేసి ఇందిరా పార్కులో వినాయక సాగర్‌ నిర్మిస్తారట. అనేక ఏళ్లగా దీనిలో దాగుని వున్న కెమికల్‌ వేస్ట్‌ను, బ్యాక్టీరియాను తీసేయడం సాధ్యమా? కాకపోతే ఆ వినాయకసాగర్‌లో మరో హుస్సేన్‌ సాగర్‌ తయారవుతుందా? సాగర్‌లో పక్కన వున్న ట్రీట్‌మెంట్‌ ప్లాంటులో శుద్ధి చేసిన నీటిని పక్కనే వున్న సెక్రటేరియట్‌లో గార్డెనింగ్‌కు, టాయిలెట్లకు వుపయోగించవచ్చ కదాని సలహా వస్తే అక్కడి అధికారులు వులిక్కిపడ్డారట – అమ్మో అని. అలాటి నీటిని ఎలా శుద్ధి చేసి, ఎక్కడకు పారిస్తారో, ఆ భూమి ఎలాటి మార్పులకు లోనవుతుందో నాకైతే తెలియదు. 

సాగర్‌లోకి మురికిని తెచ్చి వదులుతున్న పికెట్‌ నాలా, బంజారా నాలా, బల్కాపూర్‌ నాలా, కూకట్‌పల్లి నాలాల ముఖద్వారాల వద్ద పేరుకుపోయిన పూడికలను  18 నెలల్లో తొలగించడానికి రెండేళ్ల క్రితం పని మొదలుపెడితే యిప్పటికి మూడోవంతు పని కూడా కాలేదట. నాలా ముఖద్వారాల వద్ద మడ్డి విషయమే యిలా వుంటే సాగర్‌ వ్యాపించి వున్న 2500-3000 హెక్టార్ల ప్రాంతంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన మడ్డి డ్రెడ్జింగ్‌కు ఎన్నేళ్లు పడుతుందో వూహించండి. కూకట్‌పల్లి నాలా మళ్లింపుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మారియట్‌ వద్ద కలిపి కాలువకు కలిపి శుద్ధి చేసి మూసీలోకి మళ్లిస్తే చాలనుకుంటున్నారు. తక్కిన మూడు నాలాల సంగతేమిటో తెలియదు. ఇలాటి ప్రణాళికలకు ఫీజిబిలిటీ రిపోర్టులు అవీ జరిగాయో లేదో! పర్యావరణ రక్షణ పేరుతో అంతర్జాతీయ సంస్థలేవైనా ఉదారంగా ఋణాలు యిస్తాయేమో! అవేమీ లేకుండా గబగబా కార్యాచరణలోకి దిగిపోతున్నారు. మధ్యలో మానేస్తే ఎటూ కాకుండా పోతాం. 

ఇలాటి అనేక విషయాలపై టి-మేధావులు నోరు విప్పినట్లు కనబడటం లేదు. గతంలో కమ్యూనిస్టులు అన్నిటికీ సామాజిక స్పృహ అంటూండేవారు. వాళ్లకది ఊతపదం అయిపోయింది. టి-ఉద్యమసమయంలో మేధావులు అలాటి వూతపదం ఒకటి తెగ వాడారు – అస్తిత్వపోరాటం అంటూ. ఇప్పుడు వాళ్లు తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన తరుణం వచ్చింది. దీని గురించి వ్యవస్థతో పోరాటం చేస్తారో, దాసోహం చేస్తారో వాళ్లే నిర్ణయించుకోవాలి. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2