తెలుగుదేశం-భాజపా పొత్తు కోసం రెండు బలిదానాలు తప్పలేదు. తెలంగాణలో తెలుగుదేశం సీమాంధ్రలో భాజపా బలైపోయాయి. ఈ విషయంలో చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి చాకచక్యంగా ప్రదర్ళించారు. సీమాంధ్రంలో పార్టీని గెలిపించుకోవడం కోసం తెలంగాణలో పార్టీని పణంగా పెట్టారు. అదే సమయంలో సీమాంధ్రలో తమ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం, వెంకయ్యనాయుడు, హరిబాబు, పురంధ్రీశ్వరి తదితరులు భాజపా ప్రయోజనాలను పణంగా పెట్టారు. అంటే సీమాంధ్రలో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం, అక్కడ భాజపాను, తెలంగాణలో తేదేపాను ముంచేసినట్లే.
తెలుగుదేశం సీమాంధ్రలో అధికారంలోకి రావడం కోసమే బిజేపితో పొత్తు కుదుర్చుకుంది అన్నది స్పష్టం.. రాష్ట్ర విభజన విషయంలో తాను అనుసరించిన రెండు కళ్ల సిద్దాంతం ఇప్పుడు కూడా ఫాలో అయితే నిండా మునుగుతానని గుర్తించారు. అందుకే దానిని వదులుకుని తెలంగాణ కన్నును తీసి గట్టుమీద పెట్టారు. నిజంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకుంటే, సగం సీట్ల వరకు భాజపాకు ఇచ్చేసేవారు కాదు. అధికారంలోకి రావాలంటే కనీసం 70 సీట్ల వరకు కావాలి. ఇప్పుడు తెలుగుదేశం వుంచుకున్న సీట్లు 60 లోపే. అవన్నీ గెలుచుకున్నా, ఇంకా భాజపా అండ కూడా కావాలి. పోనీ భాజపా తన వాటాకు వచ్చిన సీట్లన్నీ గెల్చుకుంటుందా అంటే, అదీ అనుమానమే. పైగా సగానికి పైగా పార్లమెంటు స్థానాలు వదిలేసుకున్నారు. మరి ఇన్నాళ్లూ ఆ పార్లమెంటు స్థానాలపై ఆశ పెట్టుకున్న తెలుగుదేశం నాయకుల పరిస్థితి ఏమిటి?
అయితే తాము ఎలాగూ అధికారం సంపాదించలేని తెలంగాణ ప్రాంత సీట్లను, భాజపాకు కావాల్సినన్ని ఇచ్చేసి, సీమాంధ్రలో మాత్రం, తమకు అనుకూలమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
సీమాంద్రలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలుంటే బిజేపికి కేవలం 15 స్థానాలు మాత్రమే కేటాయించారు. అంటే కేవలం పది శాతం మాత్రమే బిజేపికి ఇచ్చి 90 శాతం సీట్లు టిడిపికే ఉంచుకున్నారు. అంతే కాదు లోక్ సభ విషయంలోను అదే పాలసి. మొత్తం 25 లోక్ సభ స్థానాలుంటే బిజేపికి కేవలం 5 మాత్రమే ఇచ్చారు. పురంధ్రీశ్వరి, కృష్ణంరాజు, రఘురామకృష్ణం రాజు, హరిబాబు, ఇలా నలుగురైదుగురు పెద్దలు తమకు సరిపడా లోక్ సభ స్థానాలు తీసుకుని, మిగిలినవారిని గాలికి వదిలేసినట్లే. అదే విధంగా 15 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకున్నారు. నిజానికి మొదట డిమాండ్ చేసింది 25. లోక్ సభ స్ఢానానికి ఒక అసెంబ్లీ వంతున. కాని తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు దాదాపు 50 శాతం సీట్లు బిజేపికి ఇచ్చారు. అంటే చంద్రబాబు కేవలం సీమాంధ్రలో మాత్రమే అధికారం కోరుకుంటున్నారన్నది క్లియర్. అంతే కాదు సీమాంద్రలో బిజేపితో పొత్తును అటు సీమాంధ్ర బిజేపి, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వ్యతిరేకించడం లేదు.
తెలంగాణను వదులుకున్నప్పడు, తెలంగాణలో టిబిజేపి పొత్తును అంతగా వ్యతిరేకిస్తున్నప్పుడు అక్కడ పొత్తు మానేసి, సీమాంధ్రలోనే పొత్తును ఖరారు చేసుకోవచ్చుకదా అన్న సందేహం రావడం సహజమే. అలా చేస్తే అధికారం కోసం చంద్రబాబు ఇప్పుడు కూడా ప్రాంతానికో తీరు డబుల్ గేమ్ ఆడుతున్నారు అంటారు. పార్టీ స్టాండు ఒకే విధంగా ఉన్నది అని చెప్పడానికి రెండు ప్రాంతాల్లోను పొత్తు కుదుర్చుకున్నారన్న మాట.
పైగా తెలంగాణలో టిడిపి పతనావస్తకు చేరుకుందని వార్తలే కాదు, సర్వేలు చెబుతున్నాయి. అక్కడ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, సాధించిన టిఆర్ఎస్ లు చాలా బలంగా ఉన్నాయి. వాటిని ఎదిరించి అధికారంలోకి రావడం చాలా కష్టమన్నది కూడా బాబుకు తెలుసు. సీమాంద్రలో అలా కాదు, రాష్ట్ర విభజనను ఆపేందుకు చివరలో చాలా కీలకంగా వ్యవహరించారు చంద్రబాబు.
బిజేపి పై ఒత్తిడి తెచ్చి లాస్ట్ మినట్ లో కూడా రాజ్యసభలో విభజన విషయాన్ని ప్రశ్నార్థకం చేసారు. అంతే కాదు బిజేపితో కలిసి సీమాంద్రకు ప్రయోజనాలు రాబట్టారు అన్న పేరు కూడా వచ్చింది. దీంతో సీమాంద్రలో టిడిపి బలాన్ని కూడా పుంజుకుంది. అదంతా బిజేపి టిడిపికి సహకరించడం వల్లనే. అంతే కాదు ఇక రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు కొత్త సీమాంద్ర రాష్ట్రం ఎవరితో అభివృద్ది చెందుతుంది అన్న అంశమే ఇప్పుడు సీమాంద్రలో బలంగా ఉంది.
కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతోనే సయోధ్య ఉన్న వారితోనే అది సాద్యం అన్న భావన ఉంది. కాంగ్రెస్ సీమాంధ్రలో కనపడకుండా పోయింది. ఉన్నది వైకాపా, దాని అధినేతపై అవినీతి ముద్ర బలంగా వేసే ప్రయత్నం నిరంతంరంగా కొనసాగుతోంది. రాజకీయాలకు కొత్త, అనుభవం లేదు, పైగా ఒంటరిగా పోతున్నారు. ఏపార్టీతోను ఆయన పొత్తు పెట్టుకోలేదు. అటు కాంగ్రెస్ కు దూరం అయ్యారు. ఉన్న బిజేపితో టిడిపి దోస్తానా చేసింది కాబట్టి జగన్ కు ఆ అవకాశం లేదు.
అంటే బిజేపితో పొత్తు సీమాంద్రలో టిడిపికి బాగా కలసి వస్తుందన్నది ఆ పార్టీల ఆశ. . ఒకటి సీమాంద్ర ప్రయోజనాలకోసం పోరాడిన పార్టీగా బిజేపికి పేరు తెచ్చుకుంది. టిడిపికి కూడా అదే పేరు వచ్చింది. ఈ దశలో బిజేపితో పొత్తు సీమాంధ్రలో టిడిపికి అధికారం దక్కడానికి దగ్గర దారి. అందుకే తెలంగాణ లో నష్టమని తెలిసినా దానిని వదిలేసుకుని సీమాంద్రలో పవర్ కోసమే తెలుగుదేశం బిజేపితో పొత్తు కుదుర్చుకుందన్నది సుస్పష్టం. అదే సమయంలో కొందరు నాయకుల కోసం భాజపాను సీమాంధ్రలో బలి చేసారన్నది స్పష్టం అవుతోంది.
కొసమెరుపు…అన్నట్లు ఈ రోజు ఈనాడులో కార్టూన్…బలమైన భాజపా గుర్రాన్ని చంద్రబాబు నాయుడు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు. దీని అర్థమేమిటి? భాజపా కెేవలం చంద్రబాబు ఎక్కి స్వారీ చేయడానికి, అతగాడిని అధికార గమ్యం చేర్చడానికి మాత్రం ఉపయోగపడుతుందని. కరెక్ట్ గానే వుంది.
చాణక్య