నిన్నటికి నిన్న ఎన్ టీ వీ సర్వే..నేడు ఐబిఎన్ లైవ్ సర్వే. ఒకటి వైకాపాను భుజాన వేసుకుంది. మరొకటి టీడీపీని చంకనెత్తుకుంది,.
ఇక్కడే శ్రీశ్రీ అన్నమాటలు గుర్తుకొస్తాయి.
మన పెట్టుబడి దారులకు పుట్టిన విషపుత్రికలు..మన పత్రికలు
ఎన్టీవీలో కేవిపికి, జగన్ కేసులో జైలుకెళ్లొచ్చిన ప్రసాద్ కు వాటాలున్నాయట.
ఐబిఎన్ లోనూ, ఈనాడులోనూ రిలయన్స్ అనుబంధం వున్న కంపెనీ పెట్టుబడులున్నాయట.
ఇక ఎవర్ని నమ్మాలి?
ప్యాకేజీలు కావాలంటే తీసుకోండి..కానీ నా జోలికి వచ్చారో ఖబడ్దార్ అంటున్నారు చంద్రబాబు.
మీడియాలో ప్యాకేజీలు వున్నమాట వాస్తవమేనా?
వాస్తవమే.
అయితే సినిమాల వరకు అది ఓకె.
బాలీవుడ్ లో ఏడాదికి ఇంత అని పెద్ద హీరోలతో ముందే బడా మీడియాలు ఒప్పందం అధికారికంగానే కుదుర్చుకుంటాయి. దీనికోసం మీడియా అనుబంధ ఉద్యోగాలు కొన్ని వున్నాయి. వాటిలో కూడా జర్నలిస్టులనే నియమిస్తారు. షారూఖ్ లాంటి పెద్ద హీరో ఏడాది ప్యాకేజీ విలువ కోట్లలోనే వుంటుందట. ఆ మేరకు ఏడాదికి ఇన్ని కథనాలు, ఇన్ని ఇంటర్వూలు., అని ప్యాకేజీ మొత్తం ముందే డిజైన్ చేసి కళ్ల ముందు పెడతారు. ఇదే తీరును సినిమాలకు కూడా అన్వయిస్తున్నారు బాలీవుడ్ లో. సినిమా నిర్మాణం అయినపుడే, ప్రారంభం నుంచి విడుదల వరకు ఇన్ని కథనాలు, ఇన్ని ఫోటోలు, ఇన్ని విడియోలు అని లెక్క కట్టి ప్యాకేజీలు డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంస్కృతి మన తెలుగునేలకు కూడా వచ్చింది. అప్పుడే 'మనం'సినిమాకు కొన్ని లక్షలకు ప్యాకేజీని ఓ ఆంగ్ల పత్రిక కుదర్చుకున్నట్లు బోగట్టా.
గడచిన ఎన్నికల్లో తెలుగు పత్రికలు పెయిడ్ ఆర్టికల్స్ సంస్కృతిని ప్రవేశపెట్టాయి. అందుకోసం ముందుగానే డిజైన్ చేసిన డమ్మీ ఆర్టికల్స్, డిజైన్లతో అభ్యర్థులతో ఒప్పందాలు కుదర్చుకున్నాయి. అభ్యర్ధుల ప్రచార వార్తలు, చిత్రాలు, కవరేజీ ఏ మేరకు అన్నది ప్యాకేజీని బట్టి వుంటుంది. ఈ వైనం చిలికి చిలికి గాలివానై ఎన్నికల సంఘం వరకు వెళ్లింది.
ఈ సారి మరి ఆ తరహా ప్యాకేజీలు వుంటాయో, మరే విధమైన కొత్త రూపాన్ని సంతరించుకున్నాయో ఇంకా తెలియడం లేదు.
వీలయినంత వరకు పెట్టుబడిదారులు తమ స్వంత మీడియా దుకాణాలు పెట్టేసుకున్నారు. తెలుగునాట ఏ పార్టీకి అనుబంధం కాని, అభిమానాలు లేని మీడియా సంస్థలు దాదాపు లేనట్టే. ఆ సంగతి రాష్ట్రంలోని ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు.
పార్టీ అనుబంధాలు, పత్రికలకు ఆరంభంలో ఇంతగా లేవు. విశాలాంధ్ర, ప్రజాశక్తి మాత్రం పార్టీ పత్రికలుగా వున్నాయి. డెక్కన్ క్రానికల్ అధినేత చంద్రశేఖర రెడ్టి కాంగ్రెస్ ఎంపీ అయినప్పటి నుంచి ఆ సంస్థ కాంగ్రెస్ వర్గంగా పేరు పడింది. ఎన్టీఆర్ వచ్చేవరకు ఎన్నో విజయాలు సాధించిన ఈనాడుకు చిన్న మచ్చ కూడా లేదు. కానీ ఆ తరువాత అది తెలుగుదేశం అనుబంధంగా ముద్రపడింది. ఎన్టీఆర్-నాదెండ్ల వ్యవహారంలో ఆ పత్రిక ఎన్టీఆర్ కు అనుబంధంగా కీలక పాత్ర నిర్వహించింది. ఆ తరువాత వచ్చిన వార్త దినపత్రిక అధినేత కూడా కాంగ్రెస్ ఎంపీగా మారారు. సూర్య దినపత్రిక వైఎస్ అనుబంధంతో పెరిగి ఆపై చంద్రబాబు పక్కకు చేరింది. ఒకప్పుడు స్వతంత్రంగా వున్న ఆంధ్రప్రభ కూడా ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలోనే వుంది. తెలంగాణ ఉద్యమనేపథ్యంలోనే నమస్తే తెలంగాణ, పత్రిక, ఛానెల్ పుట్టుకొచ్చాయి. వెంకటస్వామి తనయులు వివేక్, వినోద్ లు వి-6 చానెల్ ను ప్రారంభించారు. సాక్షి సంగతి కొత్తగా చెప్పనక్కరలేదు. రాజశేఖర రెడ్టి తరచు ఆ రెండు పత్రికలు అంటూ ఆంధ్రజ్యోతి-ఈనాడు గురించి ప్రస్తావించేవారు. ఆ విధంగా ఆయన ఆ రెండూ తమకు వ్యతిరేకం అన్న సందేశాన్ని జనంలోకి బలంగా పంపగలిగారు. చిత్రమేమిటంటే, ఆంధ్రజ్యోతి ఒకప్పటి యాజమాన్యం కాంగ్రెస్ అనుబంధమే. కెఎల్ఎన్ ప్రసాద్ ఎంపీగా వున్నారు. అయితే ఇప్పటి యాజమాన్యం వ్యతిరేకమయింది.
నిజానికి ఈ వ్యతిరేకతలు అన్నీ పార్టీ వ్యతిరేకతల కన్నా వ్యక్తిగత వ్యతిరేకతలు అనడం సబబు. ఇవి కొన్ని కాలానికి నిలుస్తాయి. కొన్ని మారతాయి.
ఒకప్పుడు ఈనాడు రామోజీకి, దర్శకుడు దాసరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. దాసరి వార్తలు, ఫొటోలు కనిపించేవి కావు. సినిమా సమీక్షలు తప్పదు కాబట్టి అవి వుండేవి. కానీ చీల్చి చెండాడేవారు,. దాసరి జీవితాన్ని పోలిన నవలను 'బదనిక' పేరుతో రాసి అచ్చువేసారు చతురలో ఓసారి. దాంతో రామోజీ అంటే పడని ఎబికె అండతొ ఉదయం పత్రికకు అంకురార్పణ చేసారు దాసరి. కానీ ఇప్పుడు దాసరి-రామోజీ మిత్రులే. కానీ దాసరి దగ్గర ఉదయం కొన్న నెల్లూరు రెడ్ల మద్యం వ్యాపారం వ్యతిరేకం అయింది. అదంతా వేరే గొడవ. ఈనాడు – రామారావు అనుబంధం తరువాత చంద్రబాబుతో మారింది. ఎన్టీఆర్ ను మొదట గద్దె దింపినపుడు చూపిన చొరవ, పోషించిన క్రియాశీలక పాత్ర రెండోసారి గద్దె దింపినపుడు కరువైంది. అంటే అర్థమయ్యేది ఓక్కటే. వ్యక్తిగత వైరాలు పత్రికల సిద్ధాంతాలు అవుతున్నాయి. సూర్య వైఎస్ అనుబంధంగా వున్ననాళ్లు తెలుగుదేశం వ్యతిరేక కథనాలు వండి వార్చింది. బాబు అనుబంధంగా మారిన తరువాత ఆ కథనాలు అటు నుంచి ఇటు మారాయి.
ఈ స్వంత లేదా అనుకూల మీడియా అన్న వ్యవహారం ఎంతలా ముదిరిదంటే, ప్రతి ఒక్కరు తప్పని సరిగా తమకో మైక్ లాంటి మీడియా వుండాలని చూసేంత. కిరణ్ ముఖ్యమంత్రిగా వుండగా ఐ న్యూస్ ను తన వేదికగా చేసుకున్నారు. బొత్స సత్యనారాయణ జీ 24గంటలు లీజుకు తీసుకున్నారు. చిరంజీవి పెట్టుబడలు మా టీవీలో వున్న సంగతి తెలిసిందే.
ఆవు చేలో మేస్తే దూడలు గట్టున మేయవు. అందుకే ఎమ్మెల్యేలు కూడా తమ తమ ప్రాంతాలో లోకల్ చానెళ్లు, లోకల్ పత్రికలు పుట్టించేసారు. ఇందుకు విశాఖ బహు చక్కని ఉదాహరణ. అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరికి అనుబంధంగా లోకల్ దినపత్రిక వుంది. అది చాలదని మరోదాన్ని కొనుగోలు చేసారు. దాంతో గంటా గారు కూడా ఓ లోకల్ కొత్త దినపత్రికలో తన పెట్టుబడులు భారీగా పెట్టారని వినికిడి. ఈ స్థానికి 'అనుబంధాలు' ఇంకా చాలా జిల్లాల్లో బాగానే పుట్టుకొచ్చాయి.
యాజమాన్యాలు, పార్టీలు ఒకటైపోతుంటే, ఆవేశపడి కలం విదిలించిన పాత్రికేయలు బలైపోతున్నారు. దీంతో ఇంక తమకెందుకు అక్కర్లేని ఆవేశమని, వాళ్లూ రాజీ పడుతున్నారు. ఏదో ఒక పార్టీ వైపు జారుకుంటున్నారు. ప్రముఖ సంపాదకుడు ఎబికె రామోజీకి, బాబుకు వ్యతిరేకంగా సాక్షిలో ఎన్నో కథనాలు వండి వార్చారు. జర్నలిస్టు నాయకుడు అమర్ ఏకంగా సాక్షిలో ఏంకర్ అవతారం ఎత్తారు. ఈనాడు రిపోర్టర్ కన్నబాబు ప్రజారాజ్యం ఎమ్మెల్యే అయిపోయారు. మరో రిపోర్టరు తేదేపా తరపున సీమ నుంచి ఎన్నికైపోయారు. ఏ పాలసీ లేని చోట ఎడిటర్ పాలసీనే ఎడిటోరియల్ పాలసీగా వున్న వైనాలూ వున్నాయి. ఆరెస్సెస్ భావజాలాన్ని వంటినిండా పూసుకున్న ఓ సంపాదకుడు, తన ప్రతికను ఆ దిశగానే నడిపుతున్న వ్యవహారమూ వుంది.
నిజానికి ఇది మన రాష్ట్రానికే పట్టిన జాఢ్యం కాదు. పక్కన తమిళనాట కూడా ఇదే తీరు.
మీడియా, మీడియా ప్రతినిధులు ఇలా రాజకీయ పార్టీలతో చెట్టా పట్టాలేసుకుంటూ వుంటే, తెలిసినా, తెలియకున్నా, ఇంకా పత్రికలు రాసేవన్నీ నిజాలే అనే అనుకునే అమాయక పాఠకుల సంఖ్య తక్కువేమీ కాదు. విశాఖే రాజధాని అని క్వశ్చను మార్కు పెడితే, ఆ వైనాన్ని గమనించకుండా, అదే నిజం అని నమ్మేత అమాయక పాఠకులు. ఇదే అలుసుగా తీసుకుని, వార్తకు, వ్యాఖ్యకు నడుమ వున్న గోడను బద్దలు కొట్టేసారు మన మీడియా మొగళ్లు. తమ చిత్తానికి కథనాలు వండి వార్చేయడమే పనిగా పెట్టుకున్నారు. తమకు అనుకూల కథనం వస్తే సంబంరం లేకుంటే కంపరం అన్నది రాజకీయ నాయకుల పాలసీ.
అందుకే ఎన్టీవీ సర్వే రాగానే,. ఆ చానెల్ పుట్టు పూర్వోత్తరాలు ఇవీ అంటూ ఏకరవు పెట్టారు తెలుగుదేశం వారు. ఇప్పుడు ఐబిఎన్ సర్వే రాగానే దాని వైనం ఇదీ అంటూ మైకందుకున్నారు వైకాపా మైసూరా రెడ్డిగారు.
మరి జనం దేన్ని నమ్మాలి? ఏ పత్రిక వార్తను? ఏ పత్రిక సర్వేను?
పోనీ ఎన్నికల తరువాత తమ సర్వే నిజమైతే,…'మేం ముందే చెప్పాం'' అని గర్వంగా ప్రకటించే మీడియా, ఒకవేళ రివర్స్ అయితే లెంపలు వేసుకునేంత సహృదయం వుందా? అబ్బే అంత సీన్ లేదు.
మరి అంత సీన్ లేనపుడు ఓటర్లయినా ప్రజలూ..మీరు మాత్రం ఎందుకు పత్రికల వార్తలను, సర్వేలను సీరియస్ గా తీసుకోవడం?
చాణక్య