వహీదా రహమాన్ – కాస్ట్యూమ్స్

నస్రీన్ మునీమ్ కబీర్ రాసిన ‘‘కాన్వర్సేషన్స్ విత్ వహీదా రహమాన్’’ పుస్తకం వెలువడింది. దానిలోని కొన్ని భాగాలు మచ్చుగా పత్రికల్లో వచ్చాయి. ‘‘జయసింహ’’ సినిమాలో వహీదా రెండో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాకు సంబంధించిన…

నస్రీన్ మునీమ్ కబీర్ రాసిన ‘‘కాన్వర్సేషన్స్ విత్ వహీదా రహమాన్’’ పుస్తకం వెలువడింది. దానిలోని కొన్ని భాగాలు మచ్చుగా పత్రికల్లో వచ్చాయి. ‘‘జయసింహ’’ సినిమాలో వహీదా రెండో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాకు సంబంధించిన విజయోత్సవం హైదరాబాదులో జరుగుతోంది. రోడ్డు మీద సినీతారలు వెళుతూంటే ప్రజలు హర్షధ్వానాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఆ రోడ్డు మీద వున్న సినిమా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో గురుదత్ కూర్చుని వున్నాడు. అప్పటికే అతను హిందీలో సినిమాలు నిర్మించి, డైరక్ట్ చేసి వున్నాడు. ‘‘సిఐడి’’ సినిమాకై కొత్త హీరోయిన్ గురించి వెతుకుతున్నాడు. ఈ కోలాహలం విని సంగతేమిటని డిస్ట్రిబ్యూటర్‌ను అడిగితే అతను సంగతి చెప్పి, ‘‘సినిమాలో వహీదా రహమాన్ అనే కొత్త హీరోయిన్ చూడడానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు’’ అని చెప్పాడు. పేరు వినగానే గురుదత్ ఆశ్చర్యంతో ‘‘ముస్లిమ్ అన్నమాట. ఉర్దూ వచ్చా?’’ అని అడిగాడు. ‘‘వాళ్లు తమిళనాడుకి చెందిన ముస్లిములు. తండ్రి విజయవాడలో పనిచేయడం వలన తెలుగు వచ్చు. ఉర్దూ సంగతి తెలియదు.’’ అని డిస్ట్రిబ్యూటరు చెప్పాడు. ‘‘రేపు ఒకసారి కలవమని చెప్తావా?’’ అన్నాడు గురుదత్. 

అప్పటికి సినిమా మ్యాగజైన్లు చాలా తక్కువగా వుండటం చేత వహీదాకు కాని, వాళ్ల తల్లికి గాని గురుదత్ పేరు తెలియదు. మధ్యవర్తి మాట కొట్టేయలేక మర్నాడు డిస్ట్రిబ్యూటర్ ఆఫీసులో గురుదత్‌ను కలిశారు. ఒక అరగంట సమావేశంలో గురుదత్ ఆమెతో చాలా కొద్దిగా మాట్లాడాడు. మీ వూరెక్కడ లాంటి నాలుగైదు ప్రశ్నలు హిందీలో వేసి పంపించివేశాడు. వీళ్లు మద్రాసు వెళ్లిపోయారు. ఆ తర్వాత మూణ్నెళ్లకు అంటే 1955 చివర్లో బొంబాయి నుండి ఒక మనిషి వచ్చి ‘‘గురుదత్‌గారు మిమ్మల్ని సినిమాలోకి తీసుకుంటారట. రమ్మన్నారు.’’ అని చెప్పాడు. వీళ్లు బొంబాయి వెళ్లి గురుదత్ ఆఫీసులో అతన్ని కలిశారు. వహీదా వయసు 1 కంటె తక్కువ కాబట్టి మూడేళ్ల కాంట్రాక్టుపై ఆమె తల్లిని సంతకం చేయమన్నారు. అంతలో వహీదా ‘‘నేను ఒక షరతు పెట్టదలచుకున్నాను.’’ అంది. సిఐడి సినిమా డైరక్టర్ రాజ్ ఖోస్లా కూడా అక్కడే వున్నాడు. అతను ఆశ్చర్యపడుతూ ‘‘కొత్తగా వచ్చినవాళ్లు షరతులు పెట్టరు.’’ అన్నాడు. ‘‘ఏదైనా కాస్ట్యూమ్ ఇష్టం లేకపోతే నేను వేసుకోను. అది ఒప్పందంలో రాయండి.’’ అంది వహీదా. గురుదత్ ‘‘నేను అలాంటి సినిమాలు తీయను. నా సినిమాలేవైనా చూశావా?’’ అని అడిగాడు. ‘‘లేదు.’’ అంది వహీదా. ‘‘అయితే ఊళ్లో మిస్టర్ అండ్ మిసెస్ 55 ఆడుతోంది. ఇవిగో టిక్కెట్లు వెళ్లి చూసి రండి.’’ అన్నాడు. 

మర్నాడు ఆఫీసుకి వచ్చి వహీదా ‘‘కాస్ట్యూమ్స్‌లో అభ్యంతర పెట్టదగినది ఏదీ లేదు. అయినా నేను చెప్పిన షరతు ఒప్పందంలో పెట్టండి.’’ అంది. రాజ్ ఖోస్లా మండిపడ్డాడు – ‘‘కాస్ట్యూమ్ సీనుపై ఆధారపడి వుంటుంది. నటిపై కాదు.’’ అని. వహీదా నెమ్మదిగానే అయినా స్థిరంగా చెప్పింది – ‘‘నాకు వయసు వచ్చిన తర్వాత స్విమ్‌సూట్ కూడా వేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే నాకు సిగ్గు ఎక్కువ కాబట్టి అలాంటి డ్రస్సు వేసుకోను.’’ అని. ‘‘అంత సిగ్గయితే సినిమాల్లోకి వేయడానికి ఎందుకు వచ్చావ్?’’ అని వెక్కిరించాడు రాజ్ ఖోస్లా. ‘‘నేను రాలేదు. మీరే రప్పించారు.’’ అంది వహీదా. గురుదత్ ఈ సంభాషణ అంతా వింటూ కూర్చున్నాడు. ఏమీ పలకలేదు. కానీ వహీదా వెళ్లిపోయాక అగ్రిమెంటు మార్పించి, మర్నాడు వహీదాను రప్పించి సంతకం పెట్టించాడు.

కాస్ట్యూమ్ గురించిన గొడవ వహీదా, రాజ్ ఖోస్లాల మధ్య మళ్లీ వచ్చింది. ‘‘సిఐడి’’ సూపర్ హిట్ కావడంతో వహీదా దేవ్ ఆనంద్-గురుదత్‌లకు చాలా ఆత్మీయురాలైంది. రాజ్ ఖోస్లా దర్శకత్వంలో దేవ్, వహీదాలు హీరోహీరోయిన్లుగా తీసిన ‘‘సోల్వా సాల్’’ సినిమాలో ఒక బ్లౌజ్ వేసుకోవడానికి వహీదా అభ్యంతరపెట్టింది. రాజ్ ఖోస్లాకు కోపం వచ్చి షూటింగు ఆపేశాడు. మర్నాడు వేరే బ్లౌజ్‌తో వహీదా నటించింది. కానీ ఆమె మనసులో అతనిపై కోపం పోలేదు. ‘‘గైడ్’’ సినిమాను రాజ్ ఖోస్లా దర్శకత్వంలో తీయడానికి దేవ్ ఆనంద్ నిశ్చయించుకుని హీరోయిన్‌గా చేయమని వహీదాను అడిగితే ‘‘అతని డైరక్షన్‌లో చేయను. మా ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంచుకో.’’ అందిట. (ఈ విషయం పుస్తకంలో లేదు లెండి, అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా రాస్తున్నాను. ఈవిడ చెప్పినదేమిటంటే – ‘నేను అతని పేరుకి అభ్యంతరం చెప్పగానే దేవ్ ఆనంద్ ‘అప్పటికీ ఇప్పటికీ రాజ్ చాలా మారాడులే’ అని నచ్చచెప్పాడు కానీ ఎందుకో ఆయనే రాజ్‌ను మార్చేశాడు’ అని) ఆ కథలో హీరోయిన్ నృత్యకళాకారిణి. వహీదా తప్ప వేరేవాళ్లు ఆ పాత్రకు సరిపోరని అనుకున్న దేవ్ వహీదాను ఎంచుకుని రాజ్‌ను తప్పించి తన తమ్ముడు విజయ్ ఆనంద్‌కు దర్శకత్వం అప్పగించాడు. ‘‘గైడ్’’ కళాత్మక చిత్రంగా, ఆల్‌టైమ్ హిట్‌గా మిగిలింది. బ్లౌజ్ వివాదం కారణంగా దాన్ని దర్శకత్వం చేసే అవకాశాన్ని రాజ్ ఖోస్లా జారవిడుచుకున్నాడు.

-ఎమ్బీయస్ ప్రసాద్ 

[email protected]