ఒక్కో నిర్మాత కుదేలైపోతున్నారు

పండగ చేస్తో సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో నిర్మాత పరుచూరి ప్రసాద్ ఓ మాట చెప్పారు.  టాలీవుడ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుందని, తాను సినిమా చేస్తానంటే, పెద్దలు వద్దని వారించారని అన్నాడు. నిజమే, అసలే…

పండగ చేస్తో సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో నిర్మాత పరుచూరి ప్రసాద్ ఓ మాట చెప్పారు.  టాలీవుడ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుందని, తాను సినిమా చేస్తానంటే, పెద్దలు వద్దని వారించారని అన్నాడు. నిజమే, అసలే షాడో దెబ్బతిని సుమారు 11 కోట్ల ప్రాపర్టీ అమ్మేసుకోవాల్సి వచ్చిందని వినికిడి. సరే, ప్రసాద్ సంగతి అలా వుంచితే, చాలా మంది నిర్మాతలు టాలీవుడ్ లో కుదేలైపోతున్నారు. నిన్నటికి నిన్న ఆదితో 'ప్యార్ మే పడిపోయానే' తీసిన రాధామోహన్ ఏం బావుకున్నట్లు. ఇంకా శాటిలైట్ కూడా కాలేదు. 

అమృతం చందమామలో తీసిన గుణ్ణం గంగరాజు ది అదే పరిస్థితి. సినిమా నిర్మాణం అతి కష్టం మీద గట్టెక్కించారు. అత్తారింటికి దారేది లాంటి హిట్ కొట్టినా, భోగవిల్లి ప్రసాద్ నుంచి ఇంత వరకు మరో సినిమా విడుదల కాలేదు. అంతకు ముందు ఆయన తట్టకుని అమోఘమైన ప్లాపులెన్నో. బాద్ షా తరువాత బండ్ల గణేష్ కిందా మీదా అవుతున్నాడు. మొదలెట్టక, మొదలెట్టక, రచయిత త్రిపురనేని మహారథి వారసులు, లడ్డూబాబు అంటూ సినిమా తీస్తే, నష్టమే మిగిలింది. భారీ సినిమాలు వరసపెట్టి తీసే దిల్ రాజు, ఇప్పుడు ఆచి తూచి అడుగేసే పరిస్థితిలో వున్నారు. మొన్నటికి మొన్న ఆర్ ఆర్ మూవీస్ దుకాణం ఎత్తేసిన సంగతి గుర్తున్నదే.

పైకి హీరోలకు భజన చేస్తున్నా. ఆప్ ది రికార్డు గా మాత్రం, హీరోలను, దర్శకులను పోషించడానికే నిర్మాతలు పనికి వస్తున్నారని, పది సినిమాలు హిట్ కొట్టనా, ఒక్క సినిమా ఫట్ మంటే నిర్మాత కుదేలైపోతున్నాడని టాలీవుడ్ లో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రెండు సినిమాలు హిట్ కొడితే డైరక్టర్ రేంజ్ మూడు నుంచి అయిదు కోట్లకు చేరుకుంటోంది. చిన్న హీరోలతో, చిన్న సినిమా తీస్తే, ఓపెనింగ్స్ వుండడం లేదు. వారం పాటు ధియేటర్లో వుంటే మౌత్ టాక్ వస్తే, అప్పుడు జనం చూస్తున్నారు. 

పెద్ద హీరోలతో సినిమా తీస్తే కలెక్షన్లు కనిపిస్తున్నాయి కానీ, లాభాలు రావడం లేదు. లెజెండ్ సినిమాకు 42 కోట్ల వరకు బడ్జెట్ అయిందని వినికిడి. యాభై రోజులకు కానీ ఆ మేరకు వసూళ్లు చేరలేదు. ఇంకెక్కడి లాభాలు. మోహన్ బాబు ఫ్యామిలీ వరసపెట్టి సినిమాలు తీసి ఇప్పుడు అలసి,గ్యాప్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ తక్కువ బడ్జెట్ లో తీసి ఇస్తానన్నా, రౌడీని తమ సన్నిహితులతో చేసారు. 

బ్రహ్మానందం కొడుకుతో బసంతి సినిమా దర్శక నిర్మాతలు కలిసి తీసి, చేతులు చివరంటా కాల్చుకున్నారు.  వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఇంత హిట్, అంత హిట్ అని, ప్రచారం సాగింది. కానీ డైరక్టర్ కు ఇంతవరకు సినిమా లేదు. నిర్మాత మళ్లీ సినిమా సంగతి ఎత్తడం లేదు. ఒకప్పుడు మంచి సినిమాలకు మారు పేరుగా నిలిచిన సూపర్ గుడ్ ఫిలింస్ సినిమా వచ్చి ఎన్నాళ్లయింది. భారీ చిత్రాల నిర్మాత ఎఎమ్ రత్నం పరిస్థితి ఏమిటి? సక్సెస్ కు మారుపేరు అనుకున్న సుమంత్ ఎమ్ ఎస్ రాజు సినిమా తీసి ఎన్నాళ్లయింది. 

ఇలా జాబితా రాసుకుంటూపోతే, టాలీవుడ్ లో కోట్లు కుమ్మరించి, కనుమరుగైన నిర్మాతలు, నిర్మాణ సంస్థల జాబితా ఇంతా అంతా కాదు. మూడు సినిమాలు పోయినా, ఏదో విధంగా ఒక్క సినిమాతో హీరో గట్టేక్కేస్తున్నాడు. కానీ ఒక్క సినిమాతోనే నిర్మాత బకెట్ తన్నేస్తున్నాడు. హీరోల ఆదాయం మూడు సినిమాలు పదిహేను కోట్లు అన్నట్లు వుంది. నిర్మాతలు మాత్రం, జరుగు..జరుగు, ఇంకోడొస్తున్నాడు..అన్న బాఫు కార్డూన్ లా పక్కకు తప్పకుంటున్నారు.

చాణక్య

[email protected]