'..రెండు పార్టీల నాయకులకు ఎక్కడో చిన్న అనుమానం. ఏదో జరిగింది. ఏం జరిగిందన్నది తెలియదు. అది మాత్రం కౌంటింగ్ తరువాతే అంచనాకు అందుతుంది. అలా ఏదో జరిగింది అన్నది వాస్తవమైతే, వచ్చే సీట్లు సంఖ్య ఎవరికైనా 115దాటిపోతాయి. ఏం జరిగింది, ఎందుకు జరిగింది..ఎలా జరిగిందన్నది 16 తరువాతే తేలుతుంది. అంటే జగన్ కు అనుకూలం అన్న ప్రచారం ఏ మేరకు నిజం అన్నది కూడా అప్పడే తెలిసేది…'
ఎన్నికల అనంతరం రాసిన ఓ విశ్లేషణలో నా అభిప్రాయం ఇది. ఎన్నికలు అయిన తరువాత చాలా మంది అడిగారు. బొటాబొటీ సీట్లే వస్తాయా లేక అధికంగా వచ్చే అవకాశం వుందా అని. అలా అడిగిన వారందరికీ చెప్పింది ఒకటే, అంతర్గత వేవ్ వుంది. అయితే అది ఎటన్నది కౌంటింగ్ నాడు తప్ప తెలిసే విధంగా లేదు. నాకే కాదు ఎవరికీ అందలేదు. తెలుగుదేశం పార్టీ పైకి ఎన్ని చెప్పినా, లోలోపల తమకు వచ్చే సీట్ల సంఖ్య 85 నుంచి 95 మధ్యలో అని అంచనా వేసుకుంది అని వినికిడి. అంటే ప్రజల నాడి అందకేగా. వైకాపా తనకు 115 నుంచి 130 వస్తాయని, కెరటంలా ఫలితాలు వుంటాయని అంచనా వేసింది. అంటే జనం నాడి అందకేగా. అయితే ఇప్పుడు జనం నాడి అందేసినట్లేనా? 16న జరిగే కౌంటింగ్ లో 115 సీట్ల మేరకు తెలుగుదేశం చేరువ కాబోతోందా అన్నది చూడాలి.
ఇక్కడ రెండు పాయింట్లు వున్నాయి. ఒకటి వైకాపాకు అనుకూలం, రెండవది వ్యతిరేకం.
ఒకటి. ఈ స్థానిక ఎన్నికలను జగన్ సీరియస్ గా తీసుకోలేదు. ఇది వైకాపాను సమర్థిస్తూ అంటున్నా మాట,. కాదు. నూటికి నూరుపాళ్లు జగన్ తప్పిదం. పార్టీలో తనకంటూ నమ్మకైన నాయకులను తయారు చేసుకోలేకపోవడం. నమ్మిన వాళ్లంతా డబ్బులు తినేసి, నమ్మకాన్నే నమ్మడం మానేసాలా జగన్ ను తయారుచేయడం. ఇది కూడా నిజం. జగన్ తన అనుకున్నవాళ్లెందరో, ఎన్నికలు సుదూరంగా వుండగానే, అతగాడు జైల్లో వుండగానే టికెట్ల పేరిట చాలా మంది దగ్గర డబ్బులు నొక్కేసారు.నొల్లేసారన్నది వైకాపా జనాలకు తెలిసిన నిజం. దాంతో జగన్ మరెవరికీ కాస్తంత కూడా అధికారం కట్టబెట్టడం మానేసాడు. కానీ ఇది కరెక్టు కాదు. రాజకీయాల్లో ఇవన్నీ తప్పవు. సరైన వారిని ఎంచుకోవడం, వారిపై నమ్మకం పెంచుకోవడం, వారిని తన అదుపాజ్ఞలో వుంచుకోవడం అన్నది నాయకుడి లక్షణం,. ఆ లక్షణాలు జగన్ లో లోపించాయి. చంద్రబాబుకు వైఎస్ చౌదరి, నామా, సిఎమ్ రమేష్, గారపాటి ఇలా కనీసం అరడజను మంది నమ్మిన బంట్లు వున్నారు. జగన్ కు లోటు ఇదే. దాంతో జగన్ తన మానాన తాను ప్రచారం చేసుకోవడం, అసెంబ్లీపై గురిపెట్టడం తప్ప, స్థానిక ఎన్నికలను ఎవరికీ అప్పగించలేదు. తాను స్వీకరించలేదు. ఈ పాటి సీట్లు, ఇంత పోటీ వచ్చిందంటే, అది ప్రజల చలువ తప్ప వైకాపా గొప్పదనం కాదు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి జగన్ తో పాటు పోటీ చేసిన అభ్యర్థులు కూడా చావో రేవో అన్నట్లు పోరాడారు. అందువల్ల ఆ మేరకు అసెంబ్లీ ఫలితాలపై తేడా చూపే ప్రభావం వుంటుంది.
కానీ..
అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు జరిగాయి స్థానిక ఎన్నికలు. అప్పటికి తెలుగుదేశానికి అదనపు శక్తులు సమకూరలేదు. మోడీ, పవన్ జోడవ్వలేదు. ఎన్నికలు వారం రోజులు వున్నాయనగా వచ్చిన జోష్ ఆనాడు లేదు. అంటే ఇదంతా మళ్లీ తెలుగుదేశానికి అదనపు లాభం అవతుంది.
అంటే
జగన్ అండ్ అభ్యర్థుల కృషి ప్లస్ వైకాపా ఇప్పటి ఫలితాలు, తేదేపాకు పవన్, మోడీ జోడీ ఇచ్చిన బలం ప్లస్ ఇప్పటి తేదేపా ఫలితాలు ఈజీక్వల్టు..16న రాబోయే ఫలితాలు. ఇక్కడ మరొక్క సంగతి ఏమిటంటే, ప్రజల ఆసక్తి. స్థానిక ఎన్నికలకు వైకాపా కృషి చేసినా చేయకున్నా, తేదేపా కృషి ఎలా వున్నా, ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల ప్రాంతాలతో సంబంధం లేకుండా మొగ్గు చూపారు. అది కడప అయినా కడపటి ఇచ్చాపురమైనా. ఎక్కడో స్థానిక నాయకులు (పార్టీ కాదు) బలంగా వున్న చోట్ల ఫలితాలు తేడాగా వుండి వుండోచ్చు. ఇదే ఆసక్తి జనరల్ ఎన్నికలపై చూపిస్తే, కూడా తెలుగుదేశం వేవ్ వుంటుందని అనుకోవాలి. అక్కడే తెలుగుదేశం పార్టీకి ఓ మైనస్ కూడా వుంది. అది మోడీతో మైత్రి కారణంగా పూర్తిగా దూరమైన మైనారిటీ, క్రిస్టియానిటీ ఓట్లు.
అయితే
ఇప్పడు వార్డుల్లో చూసుకుంటే 60శాతం 40 శాతంగా వుంది తేదేపా(1451)-వైకాపా (850)పరిస్థితి. కానీ అదే మున్సిపాల్టీల్లో అధికారం సంగతి చూసుకుంటే తేదేపాకు (63), వైకాపాకు (23) వున్న బలం చాలా దూరంగా వుంది. పైగా 11 చోట్ల హంగ్. ఇప్పుడు ఇంకా వివరాలు అందడం లేదు కానీ ఓట్లు శాతం, మార్జిన్ లో ఓడిపోయిన సీట్ల సంగతి కూడా తెలియాల్సి వుంది. ఓట్ల శాతంలో వేవ్ కనుక స్పష్టంగా కనిపిస్తే, ఇక సందేహం లేదు తెలుగుదేశం అధికారం చేపట్టబోతోందని డిసైడ్ అయిపోవచ్చు. వైకాపా తనను తాను సమర్థించుకోవడానికి కావచ్చు, నాలుగేళ్లయింది పార్టీ పెట్టి, ఓ సారి కూడా అధికారంలో లేదు, అందువల్ల సంస్థాగతంగా బలం లేదు అని చెప్పుకుంటోంది. ఇది సాకు అయితే అయివుండొచ్చు కానీ, క్షంతవ్యం మాత్రం కాదు. యుద్దానికి దిగే ముందు కవచం ధరించలేదు అంటే అది మొండి ధైర్యమే కాదు తప్పు కూడా అవుతుంది. కానీ అదే సమయంలో ఈ 'సాకు'ను కూడా విశ్లేషణలోకి తీసుకుంటే, ఒకటి లేదా రెండు శాతం మేరకు తేడా చేస్తే చేయచ్చు.
మొత్తానికి ఈ రోజు వచ్చిన ఫలితాలు,. రాబోయే అసెంబ్లీ ఫలితాలపై 60శాతం అంచనా వేసుకునేందుకు వీలు కల్పించాయి. రేపటి ఎంపీటీసీ ఫలితాలు కూడా ఇలాగే వుండే అవకాశం అయితే వుంది. అదే నిజమైతే 80శాతం మేరకు అంచనా అందేస్తుంది. మిగిలిన 20శాతం అందేది మాత్రం 16నే.
చాణక్య