రాజధానికి వ్యవహారాలు చకచకా కదులుతున్నాయి. భూసేకరణ దిశగా ప్రభుత్వం ముందుడుగు వేస్తోంది. అందకు సంబంధించిన విధి విధానాలు ఈ నెలాఖరుకల్లా ఖరారు చేసి, ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ విధి విధానాలు ఎలా వుంటాయన్నది సూచాయిగా మీడియాలో వచ్చేసాయి. అదే విధంగా తొలి విడతగా భూ సేకరణ చేసే ప్రాంతాలు కూడా వెల్లడయ్యాయి.
అయితే ఇప్పటికీ కూడా రాజధాని ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వుంటుందన్నది మాత్రం ఇంకా స్పష్టం కాకపోవడం విచిత్రం. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు వుంటాయిట. ఛండీగడ్ మాదిరిగా సెక్టార్లుగా వుంటుందట. పారిశ్రామిక ప్రాంతాలు వుండవట..ఇలా రకరకాల 'ట' కబుర్లే తప్ప, అధికారికంగా….ఇవీ హద్దులు..ఈ ప్రాంతాల నడుమ రాజధాని వస్తుంది..ఈ సర్వే నెంబర్లే సరిహద్దులు. ఇదీ రాజధాని ప్రాంతం అని ఒక్క మాట ప్రభుత్వం నుంచి బయటకు రావడం లేదు. ప్రభుత్వం దగ్గర బ్లూ ప్రింట్ లేదా అంటే వున్నట్లే కనిపిస్తోంది.
ఎందుకంటే భూసేకరణపై కసరత్తు మొదలై ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం అని అన్నారు అంటే, అది ఒక పక్క హద్దు అయి వుండాలి. మరి మరో మూడు దిక్కుల హద్దులేమిటి అన్నది కూడా వెల్లడించాలి కదా. అప్పుడే జనం టెన్షన్ లో లేకుండా వుంటారు. తమ భూమి వుంటుందా..ప్రభుత్వం తీసుకుంటుందా అన్న అనుమానాలు ఇబ్బంది పెడుతూ వుంటాయి. ఇదే సమయంలో తెలివైనవాళ్లు తమ భూములు ఎలాగూ పోతాయి అని తెలిస్తే, ఎలాగోలా అమ్మే ప్రయత్నాలు చేసి, ఎవర్నో ఒకర్ని ముంచే అవకాశం వుంది.
ఇక్కడి దాకా వచ్చిన తరువాత కూడా ప్రభుత్వం రాజధాని ఫ్రాంతంపై ఇంకా ఎందుకు దాచాలని చూస్తోందో అర్థం కావడం లేదు. గుంటూరు కృష్ణ జిల్లాల నడుమ అన్నంతవరకుఓకె. అయితే అది ఏ ప్రాంతాలన్నది కూడా స్ఫష్టంగా తెలియచేయాల్సిన అవసరం వుంది. లేదంటే ప్రజలకు అక్కర్లేని ఇబ్బందులు, టెన్షన్లు వస్తాయి.
మరోపక్క ఇప్పటికే వున్న తెనాలి, గుంటూరు, ప్రాంత అభివృద్ధి బోర్డును రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే వందలాది లే అవుట్లు, కృష్ణ, గుంటూరు, తెనాలి ప్రాంతంలో వున్నాయి. వీటిలో అన్ని అనుమతులు పొంది, కొన్న వారికి రిజిస్ట్రేషన్ చేసినవి తక్కువ. డెవలప్ మెంట్ స్టేజ్ లో వున్నవి ఎక్కువ. వాటికి పరిస్థితి ఏమిటి? కొత్త బోర్డు ఏమైనా వస్తుందా..వచ్చేదాకా అనుమతులు వుండవా? లేదా ఇప్పుడు పెండింగ్ లో వున్నవాటికి అన్నింటినీ పరిశీలించి, పని అయ్యాకే బోర్డును రద్దు చేస్తారా? లేదా బోర్డుతో కాక వుడా తోనే వీటకి పని వుంటుందా? ఇలా అనేకానేక అనుమానాలు వున్నాయి.
భూసేకరణ ప్రారంభించే ముందే, రాజధాని హద్దులు స్పష్టం చేసి, ప్రజల అనుమానాలన్నీ తీర్చాలి. అన్నీ దాచి పెట్టి, ఒక్కో టీజర్ విడుదల చేయడానికి ఇదేం భారీ బడ్జెట్ సినిమా కాదు కదా..మెలమెల్లగా చిన్న చిన్న విషయాలు వెల్లడి చేస్తుంటాం..ఒకేసారి ఫుల్ సినిమా చూపిస్తాం..అదేంటి..అలా అన్నారు.,.ఇలా వుంది అంటే, మేం ఎక్కడ అన్నా..ఎవరి వార్తలు వారు రాసుకున్నారు. మేం చెప్పలేదు కాదా అనడానికి ఇది సినిమా కాదు..ప్రజల బతుకులు ముడిపడి వున్న విషయం.