సుబ్రహ్మణ్యస్వామికి ఏదో వివాదం లేవనెత్తి వార్తల్లో లేకపోతే నిద్ర పట్టదు. ఒకప్పుడు మేధావిగా, మరోప్పుడు పరమ మూర్ఖుడిగా మాట్లాడుతూ, స్థిరత్వం లేకుండా గౌరవించాలో నిరసించాలో తెలియని వ్యక్తిగా తేలాడీయన. ఈ మధ్య ఆయన చేసిన వింత వ్యాఖ్య – నెహ్రూ విధానాలను అభిమానించే చరిత్రకారులు రాసిన పుస్తకాలను తగలబెట్టాలట! జనసంఘ్/బిజెపి భాగస్వామిగా వున్న ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆరెస్సెస్ భావజాలానికి అనుగుణంగా చరిత్ర పుస్తకాలను తిరగరాయించే ప్రయత్నాలను చేస్తూనే వుంటుంది. ఆ క్రమంలో ఇప్పటికే చలామణీలో ఉన్న పుస్తకాలను దుయ్యబడుతుంది. సిలబస్‌లోంచి తొలగిస్తూ వుంటుంది. తర్వాత వచ్చిన ఇతర ప్రభుత్వాలు మళ్లీ వాటిని దిద్దుతూ వుంటాయి. ఇలా అసలైన చరిత్ర ఏదనేది తెలియకుండా భారతీయులు గందరగోళంలో పడుతూ వుంటారు. ఎవరేమన్నా బొత్తిగా పుస్తకం తగలబెట్టమని అనడం స్వామికే చెల్లింది. ఇంతకీ ఈ నెహ్రూవియన్ హిస్టారియన్స్ చేసిన పాపం ఏమిటి? సూక్ష్మంగా చెప్పాలంటే – భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అన్ని రకాల ప్రజలూ పాల్గొన్నారు. అందరిదీ ఒకటే భావజాలం కాదు. బ్రిటిషువారిని పారద్రోలడం వరకు అందరూ ఓకే అన్నారు కానీ తర్వాత వచ్చే రాజ్యం ఎలా ఉండాలి అనేదానిపై భిన్నాభిప్రాయాలు. బ్రిటిషు వారు స్వాధీనం చేసుకున్నపుడు ఎవరైతే నవాబులుగా, రాజులుగా వున్నారో వారి కుటుంబీకులేక ఆయా ప్రాంతాలు అప్పచెప్పాలని, వారు రాజరికం కొనసాగించాలని కొందరు, రామరాజ్యం తిరిగి రావాలని కొందరు, కమ్యూనిస్టుల కార్మిక రాజ్యం రావాలని కొందరు, బ్రిటిషు తరహా ప్రజాస్వామ్యం రావాలని కొందరు, అమెరికన్ తరహా కాపిటలిస్టు వ్యవస్థ రావాలని ఇంకొందరు, రష్యా తరహా సోషలిజం రావాలని మరికొందరు.
బ్రిటిషు వాళ్లు తమ పాలన సాగిస్తూనే స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించి, భారతీయులను పాలనలోకి తీసుకుని, ప్రజలకు ప్రజాస్వామ్యం రుచి చూపించారు. ఇక దానితో అందరూ ఇదే బాగుందనుకున్నారు. అయితే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి అన్నదానిపై చర్చ సాగుతూనే వుంది. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండాలని రైటిస్టులు, కాదు కార్మికులకు అనుకూలంగా వుండాలని, యాజమాన్యం ప్రభుత్వ అధీనంలో ఉండాలని సోషలిస్టులు వాదించసాగారు. కాంగ్రెసు పార్టీలోనే చీలికలు వచ్చాయి. అందరూ గొప్ప నాయకులే, మహోన్నతులే. అభిప్రాయాల్లోనే భేదాలు. వీరందరిలో నెహ్రూ విధానం చాలా మందికి ఆమోదయోగ్యంగా తోచింది. ఆయన అందరి ఆలోచనలూ కలుపుకుంటూ ప్రభుత్వరంగం, ప్రయివేటు రంగం కలిసి పనిచేస్తూ ఒకరితో మరొకరు పోటీ పడాలని ప్రతిపాదించాడు. కాపిటలిస్టు వ్యవస్థకు దూరంగా, సోషలిజంకు దగ్గరగా కాంగ్రెసు విధానాలను తీసుకుని వెళ్లాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాల్లో చాలా స్వల్పంగానే విజయం సాధించాడు. కానీ ఆశయం మాత్రం అందరికీ ఉన్నతంగా తోచింది. అలాగే పరిపాలనకు, మతానికి ముడిపెట్టకూడదని వాదించి అన్ని మతాలవారి అభిమానాన్ని చూరగొన్నాడు. సైన్సు, టెక్నాలజీపై ముందుచూపు ప్రదర్శించాడు. యువకుడు, విద్యాధికుడు, మంచి వక్త, మంచి రచయిత, గాంధీతో విభేదిస్తూనే ఆయన మాటను గౌరవించేవాడు. (వారిది తండ్రి-కొడుకుల అనుబంధం లాంటిది) నెహ్రూ విధానాలకు ముచ్చటపడి విదేశాల్లో స్థిరపడిన అనేకమంది భారతీయ మేధావులు భారతదేశానికి తిరిగి వచ్చారు. అలీన విధాన నిర్మాతలలో ఒకడిగా నెహ్రూ అంతర్జాతీయ సమాజం జేజేలు అందుకున్నాడు. వీటివలన నెహ్రూ అంటే ఆనాటి యువకులేక కాదు, మేధావులకు కూడా ఆరాధన పెరిగింది. ఆనాటి యువకులు చరిత్రకారులుగా, జర్నలిస్టులుగా, మేధావులుగా రూపొందినపుడు నెహ్రూ అంటే వల్లమాలిన అభిమానంతో పుస్తకాలు రాశారు. కొంతకాలానికి నెహ్రూ పాలనలో పొరపాట్లు జరిగినపుడు విమర్శించినవారూ వున్నారు. క్రమేపీ నెహ్రూ సిద్ధాంతాలపై నిష్పక్షపాతమైన సమీక్షలు జరిగాయి. భావప్రకటనా స్వేచ్ఛ కూడా మన దేశపు సంస్కృతిలో, రాజ్యాంగంలో అంతర్భాగం కాబట్టి ఈ రచనలన్నీ మనకు లభిస్తూనే వున్నాయి.
ఇప్పుడు బిజెపి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెసును సమూలంగా నిర్మూలించడానికి పూనుకుంది. కాంగ్రెసు పార్టీని ప్రస్తుతం ఏలుతున్నది నెహ్రూ కుటుంబీకులు కాబట్టి వారిని దుష్టులుగా చూపించాలంటే మూలపురుషుడైన నెహ్రూనే దిగజార్చాలి. కాంగ్రెసులో నెహ్రూను తప్ప తక్కిన ప్రముఖ నాయకులను సొంతం చేసుకోవాలి – ఇదీ వారి తంత్రం. నెహ్రూపై, మోతీలాల్ నెహ్రూపై వ్యక్తిగతమైన వ్యాఖ్యలతో మొదలుపెట్టి దేశంలోని సర్వ అనర్థాలకు నెహ్రూ విధానాలే కారణమని నిందించడం ఈనాటి సోషల్ మీడియాలో ఒక ఉద్యమంగా సాగుతోంది. ఇక తక్కినవారిలో గాంధీని కూడా బిజెపి సొంతం చేసుకోవడానికి 1980ల్లోనే ప్రయత్నించింది. వాజపేయిగారు ‘గాంధీయన్ సోషలిజం మా లక్ష్యం’ అన్నారు. అదేమిటో ఎవరికీ తెలియలేదు. అంబ పలకలేదు. ఆ తర్వాత గాంధీగారు నెహ్రూని కాకుండా పటేల్‌ను ప్రధానిగా చేసి వుంటే దేశం ఇంకోలా వుండేది అనే ప్రచారానికి వూపు పెట్టారు. అడ్వాణీగారిని ‘ఈ కాలపు ఉక్కుమనిషి’ అన్నారు. ఇప్పుడాయన ఉక్కుకు చెద పట్టింది. ఈనాటి ఉక్కుమనిషిగా మోదీని తెచ్చారు. ఇప్పుడు పటేల్ భజన సాగుతోంది. మధ్యలో బోస్‌ను కూడా లాక్కుని వచ్చారు. తమాషా ఏమిటంటే – వీళ్లెవరూ బిజెపికి మౌలికమైన హిందూత్వ భావజాలాన్ని సమర్థించలేదు. పటేల్ ఆరెస్సెస్‌ను కొంతకాలం నిషేధించారు కూడా. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన జనసంఘ్/బిజెపి నాయకులు ఎవరూ లేకపోవడంతో బిజెపి పాపం ఇలాగ కాంగ్రెసు నాయకుల మీదనే తన ముద్ర కొడుతోంది. ఎంత లేవనెత్తినా వీళ్లు నెహ్రూ అంత పాప్యులారిటీ పొందటం లేదన్న బాధతో, భయంతో ఇప్పుడు నెహ్రూని సమర్థించే చరిత్రకారుల పుస్తకాలే తగలబెట్టమని పిలుపు నిచ్చారు మన ప్రొఫెసర్ గారు!
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2014)