టాలీవుడ్ లో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. వందలాది సినిమాలు తీసే ఫీల్డ్ లో నిరుద్యోగం ఏమిటి అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఇది వాస్తవం. అయితే ఇది పర్టిక్యులర్ గా కేవలం ఒక్క దర్శకత్వం శాఖలోనే కావడం చిత్రం గా వుంది. ఏదో ఒక సినిమా చేసి దర్శకుడు అనిపించుకున్నావాళ్ల సంఖ్య తెలుగు సినిమా రంగంలో కనీసం రెండు వందలకు పైగా వుంటుందని అంచనా. వీరిలో చిన్నా చితకా సినిమాలు తీసిన వారిని సంఖ్య తీసేసినా కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు తీసిన వారి సంఖ్య యాభై నుంచి వంద వరకు వుంటుంది.
సినిమాలో దర్శకత్వ శాఖలో చేరిన దగ్గర నుంచి అసిస్టెంట్ దగ్గర మొదలై కో డైరక్టర్ వరకు ఏళ్ల తరబడి ప్రయాణాల సాగిస్తారు. దాని వల్ల అనుభవం తప్ప, ఆదాయం అంతంత మాత్రమే. జీవనానికి సరిపోతుంది. ఆపైన అవకాశం కోసం చూసి, చూసి దాన్ని దొరకపుచ్చుకుంటారు. ఆ సినిమాకు పెద్దగా పారితోషికం వుండదు. మహా అయితే అయిదు లక్షలో, పది లక్షలో వుంటుంది. సినిమాదొరికితే చాలని సరిపెట్టుకుంటారు. హిట్ అయినా, ఫ్లాప్ అయినా రెండో సినిమా చేయడం గగనమైపోతోంది. రెండో సినిమా చేస్తే కనీసం పాతిక ముఫై లక్షలు పారితోషికం వస్తుంది. అయిదారేళ్లు బతికేయచ్చు. కానీ మొదటి సినిమాతోనే కెరియర్ అలా వుండిపోతే ముందుకు వెళ్లలేక, వెనక్కు రాలేక ఇబ్బంది పడే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నవారు లెక్కకు మించే వున్నారు సినిమా పరిశ్రమలో.
మూడు క్లాస్ లు
సినిమా డైరక్టర్లు ఇప్పుడు మూడు క్లాసుల్లో వున్నారు. ఒకటి టాప్ క్లాస్..రాజమౌళి, వినాయక్, త్రివిక్రమ్, బోయపాటి, శ్రీను వైట్ల,పూరి జగన్నాధ్, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ అడ్డాల.. ఇంకా మరికొంత మంది.. వీరికి వచ్చిన నష్టం లేదు. అయిదేళ్లకు ఓ సినిమా చేసినా ఫరవాలేదు. ఎందుకంటే వీళ్ల పారితోషికం కోట్లలో వుంటుంది కాబట్టి. ఒకటి నుంచి రెండు మూడు హిట్ లు కొట్టిన వారు ఈ జాబితాలోకి వస్తారు. ఇంద్రగంటి మోహనకృష్ణ, శేఖర్ కమ్ముల, మారుతి, వీరభ్రదమ్ చౌదరి, గోపీచంద్ మలినేని, చంద్రశేఖర్ యేలేటి ఇలా కాస్త పెద్ద జాబితానే వుంది. వీరికి కూడా కాస్త ఆర్థికంగా ఫర్వాలేదు. కానీ నిరుద్యోగం అన్నది వీరికే సమస్యగా వుంటోంది. వీరు కిందికి దిగి చిన్నహీరొలతో సినిమా చేయలేరు. పెద్ద హీరోలు అంత సులువుగా అవకాశం ఇవ్వరు. ఈ మీడియం రేంజ్ హీరోల మార్కెట్ ఇప్పుడు అంతంత మాత్రంగా వుంది. ఈ రేంజ్ హీరోలు కూడా తక్కువే. కానీ ఈ విభాగంలోకి వచ్చే డైరక్టర్లు చాలా చాలా మంది వున్నారు. దాంతో నిరుద్యోగం అన్నది ఈ విభాగంలోనే ఎక్కువగా వుంది.
ఈ విభాగంలోకి వచ్చే చాలా మంది డైరక్టర్లు సినిమా చేసి ఏడాది పైనే అవుతోంది. ఏడాది అంటే ఫరవాలేదు తట్టకుంటారు. ఎందుకంటే యాభై నుంచి కోటి లోపు రెమ్యూనిరేషన్ తీసుకుని వుంటారు కాబట్టి, వాటితో నడిచిపోతుంది. కానీ మరీ రెండు మూడేళ్లు అంటే మరీ కష్టం. పైగా సినిమా ఫ్లాప్ అయిందంటే, మళ్లీ మొదటికి వచ్చినట్లే. మంచి కథ అల్లుకోవాలి, ఎవరో ఒక హీరోను ప్రసన్నం చేసుకోవాలి. ఒప్పించాలి..ట్రాక్ మీదకు రావాలి. దానికి చాలా సమయం పడుతుంది. షాడో తరువాత మెహర్ రమేష్..రభస తరువాత సంతోష్ శ్రీనివాస్, భాయ్ తరువాత వీరభద్రమ్ చౌదరి, చాలా ఫ్లాపుల తరువాత వైవిఎస్ చౌదరి, డమరుకం తరువాత శ్రీనివాసరెడ్డి, మసాలా సినిమా తరువాత విజయభాస్కర్, వన్ తరువాత సుకుమార్..ఇలా చాలా మంది ఇప్పుడు తరువాతి సినిమా ప్రారంభం కాక సైలంట్ గా వున్నారు. వీరందిరికీ ఇక అవకాశాలు రావని కాదు. వస్తాయి..కానీ టైం పడుతుంది. కానీ అంతవరకు ఎంత మెంటల్ టెన్షన్ పడాలో అంతా తప్పదు.
వీరి పరిస్థితి అలా వుంటే ఒక్క సినిమాతోనే ఆగిపోయిన బళ్లు అనేకం వున్నాయి. వారందరూ అలా అలా కృష్ణనగర్లోనో, గణపతి కాంప్లెక్స్ దగ్గరలో చక్కర్లు కొట్టడం మినహా చేసేదేమీ వుండదు. మళ్లీ తెగించి అసిస్టెంట్ గానో, అసోసియేట్ గానో వెనక్కు వెళ్లేవాళ్ల శాతం చాలా చాలా తక్కువ వుంటుంది. సీనియర్ దర్శకుడితో వున్న అనుబంధంతో వెళ్లాలి తప్ప వేరు కాదు.
రెండుమూడు హిట్ లు కొట్టి కాస్త సంపాదించిన వాళ్లు, ఫ్లాప్ వచ్చిన తరువాత అవకాశాలు ఆగిపోతే తెగించి, మళ్లీ తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు స్వంత సినిమా ప్రయత్నాలు చేసి మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన సంఘటనలు వున్నాయి, కరుణాకరన్, భీమనేని తదితరులు ఈ జాబితాలోకి వస్తారు. ఇప్పుడు గుణశేఖర్ చేస్తున్నదీ అదే. అలాగే అదే ప్రయత్నంలో వున్నది పోగొట్టుకున్నవారు కూడా వున్నారు.
వీళ్లంతా అలా వుంటే సీనియర్లుగా మంచి పేరు తెచ్చుకుని కాలానుగుణంగా ఫేడవుట్ అయ్యేవాళ్లు వున్నారు. వాళ్లని ఈ నిరుద్యోగుల జాబితాలో చేర్చలేం. రిటైర్ అయ్యారని భావించడమే. వంశీ లాంటి వాళ్లు ఈ జాబితాలోకి వస్తారు.
ఏదైనా రాను రాను దర్శకత్వ శాఖలో జనాలు పెరుగుతున్నారు. ఎందుకంటే సినిమాకు కనీసం అరడజను మంది వరకు దర్శకత్వ శాఖలో వుంటారు. కనీసం ఇలాంటి బ్యాచ్ లు, నలభై, యాభై వుంటాయి. అంటే రెండు వందల మంది అప్రంటీస్ లు. వీరు డైరక్టర్లు గా మారితే..వీళ్లకు సరిపడా నిర్మాతలు, హీరోలు ఎక్కడి నుంచి వస్తారు. దాంతో అందరికీ అవకాశాలు రావడం లేదు. చాలా మంది దర్శకత్వం జోలికి రావడం లేదు,. అసోసియేట్ దాకా వచ్చి, అలాగే కొనసాగి,రిటైర్ అయిపోయిన వాళ్లు వున్నారు. ఇది కేవలం తమ మీద నమ్మకం లేక కాదు, ఈ ఫీల్ట్ లో రాజకీయాలు, గ్రూపులు, వివిధ ఈక్వేషన్ల మీద ఆధారపడి లభించే అవకాశల పోటీ తట్టుకోలేక కూడా.
ఇక అసిస్టెంట్ డైరక్టర్ అనే ప్రారంభ విభాగం మరీ ఇబ్బంది కరం. పెద్ద డైరక్టర్ల దగ్గర కుదిరిపోతే ఓకె,. లైఫ్ హ్యపీగా సాగిపోతుంది. లేది మిడిల్ రేంజ్ డైరక్టర్ల దగ్గర వుండిపోతే వీరికీ నిరుద్యోగమే. పైగా సినిమాకు వీరికి వచ్చే ప్యాకేజీని నెలల వారి విభజించి చూసుకుంటే ఇరవై, ముఫై వేలు కూడా వుండదు. అది బతకడానికే బొటాబొటి. పైగా అసిస్టెంట్ గా చేరాలంటే రికమండేషన్లు, సవాలక్ష ఈక్వేషన్లు వుంటాయి.
మొత్తం మీద ఇప్పుడు టాలీవుడ్ లోని దర్శకత్వ శాఖలో కాస్త నిరుద్యోగం ఎక్కువగానేవుంది.
'చిత్ర'గుప్త