రైతుల రుణ మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ. బాబు కు అధికారం అందిరావడానికి కీలకమైన రెండువరాలు. ఈ రెండు వరాలను బాబు విస్మరిస్తారని అనుకోవడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే ఇంత కీలకమైన వరాల విషయంలో మడమ తిప్పితే అంతకన్నా అవమానకరమైన పరిస్థితి మరొకటి వుండదు. కానీ ఇంకా అధికారం చేపట్టడానికి బాబుకు మరో రెండు వారాల వరకు సమయం వుంది. అంతవరకు ఆయన చేయగలిగిందీ, చేసేదీ ఏమీ లేదు. కావాలంటే విధివిధానాలను ఆలోచించి పెట్టుకోవచ్చు. అసలు ఏ మేరకు ఖర్చు అవుతుందో అన్నది లెక్కలు చూసుకోవచ్చు.
కానీ ఈ లోగానే జనాల నుంచి వత్తిడి మొదలైంది. జనాలంటే మామూలు జనాలు కాదు, రాజకీయ జనాలు. త్వరగా రైతు మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్షానికి చెందిన రాజకీయ నాయకులు. అంటే ఆ విధంగా వారు రుణమాఫీ అనేది బాబుకు ఇబ్బంది కలిగిస్తుందని అనుకుంటున్నారనే అనుకోవాలి. పదే పదే ఈ తరహా ప్రకటనలు వినిపిస్తు్న్నాయి. కానీ బాబు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఈ దిశగా ఓ ప్రకటన ఏదీ చేయడంలేదు. బాబు ఇంకా అధికారం చేపట్టలేదని, తొలి సంతంకం రుణమాఫీ పైనే అని వారు ఓ ప్రకటన చేస్తే బాగుండేది. కానీ బాబు ఈ సంగతేమీ పట్టించుకొవడం లేదు. ఆయన ప్రణాళికలు, ఆయన కసరత్తులు ఆయనవి.
ముఖ్యంగా కొత్త రాజధానిపైనే బాబు తన దృష్టి, సమాలోచనలు అన్నీ కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే రాజధాని అన్నది ఆయన ఫిక్సయిపోయినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన అక్కడ ఓ నగరాన్నిఎలా నిర్మించాలన్న ఆలోచనలో వున్నారని బోగట్టా. సీమాంధ్ర రాజధాని ఎలా వుండాలన్నదానిపై నాకు ఓ విజన్ వుంది అని ఆయన అనడం ఇక్కడ గమనార్హం.
కావచ్చు. రాజధాని అన్నది కీలకమే. కానీ నిజానికి సీమాంధ్ర రాజధాని తరలిపోవడానికి ఇంకా పదేళ్ల సమయం వుంది. కాని బాబు ఎందుకో, మూడు నాలుగేళ్లలోనే హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్లాలనే అభిప్రాయంతో వున్నారు. కొత్త రాజధానితోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్నిది ఆయన ఆలోచన. ఆ విధంగా జనానికి తానేమిటో రుజువు చేసుకోవచ్చని ఆయన యోచిస్తున్నారు. కానీ అంత హర్రీ అవసరమా? ముందు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి. విభజన అనంతరం కార్యాలయాలను చక్కదిద్దాలి. ఈ లోగా ఎన్నికల వరాల సంగతి చూడాలి. కానీ బాబు నేరుగా రాజధాని, సీమాంధ్ర ప్యాకేజీలపైనే ఆలోచిస్తున్నారు. ఈ మేరకు మోడీతో కూడా మాట్లాడినట్లు సమాచారం.
అందుకే మోడీ 26లోగా విభజన ప్రక్రియ పూర్తి చేయించి, ఆ రోజే ప్యాకేజీ వ్యవహారాలు ప్రకటించాలని యోచిస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. అదే నిజమైతే, బాబు ప్రమాణ స్వీకారానికి ముందే మాంచి ప్యాకేజీ సంపాదించిన క్రెడిట్ కొట్టేస్తారు. కానీ మళ్లీ అదే ప్రశ్న. రుణమాఫీ సంగతేమిటి? కేంద్రం ద్వారా దీన్ని ప్రకటింపచేయడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నారా? సీమాంధ్ర కు ఇచ్చే ప్యాకేజీలో ఇదేమన్నా చేర్చడానికి వీలవుతుందని ఆలోచిస్తున్నారా? అలాంటిది ఏమీ సాధ్యం అయ్యే అవకాశాలు తక్కువ. అలా కాకుండా ఆర్థికంగా సహాయం అందిస్తే, దాన్ని ఇటు వాడుకునే ఆలోచన చేయచ్చు.
బాబుకు ఇలాంటివి అలవాటే కూడా. గతంలో కిరోసిన్ కోటా తగ్గిస్తాం..కావాలంటే అందుకు బదులుగా ఇన్ని గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం అని కేంద్రం అంటే, బాబు దాన్ని చటుక్కున అందిపుచ్చుకుని, దీపం పథకాన్ని ఫ్రకటించేసారు. ఇచ్చింది కేంద్రం. ఓట్లు అందుకున్నది బాబు. అదీ బాబు తెలివి. కానీ పర్యవసానం కూడా వేరే వుంది. కిరోసిన్ కోటా తగ్గిపోయి, ఓపెన్ మార్కెట్ లో దాని రేటు భయంకరంగా పెరిగా సామాన్య జనం ఇబ్బందులు పడ్డారు. ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ వచ్చిందనుకున్నారు. ఇప్పుడు దాని ధర ఇబ్బడి ముబ్బడైంది.
సరే, ఆ విధంగా కేంద్రం నుంచి ఏదైనా, ఏ రూపంలోనైనా సహాయం అందుకుని, ఆపైన దాన్ని రుణమాఫీకి వాడుకోవాలన్న ఆలోచనలో బాబు వున్నారన్నదే అనుమానం.అందుకనే 26 దాటే వరకు బాబు ఈ విషయమై ఎటువంటి మాట ఇవ్వకపోవచ్చు. ప్రమాణ స్వీకారం నాటికి ఏదో విధంగా దీనికి స్పష్టత తెచ్చుకుంటారు. ఎందుకంటే తప్పదు కనుక.
ఆ వేళ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా తొలి సంతకం చేసే అవకాశం కూడా వుంది. అయితే,. అది ఎలా? ఎన్ని మెలికలు వుంటాయి. ఆ తరువాత ఇంతకీ కొత్త రుణాలు పుడతాయా అన్నదే చూడాలి. ఏది ఏమైనా, బాబుకు అయిదేళ్ల సమయం వుంది. అంతవరకు ఎలాగైనా ఫరవాలేదు. పంచాయితీ, మండల, మున్సిపల్, కార్పొరేషన్, ఎమ్మెల్య, ఎంపీ ఎన్నికలు అన్నీ అయిపోయాయి. అయిదేళ్ల దాకా ఎన్నిక అన్నదే లేదు. ఇంత అదృష్టం చాలా రేర్ గా వస్తుంది ఎవరికైనా.. ఆ విధంగా బాబు అదృష్టవంతుడు. మరి రైతులు, మహిళలు ఎప్పుడు అదృష్టవంతులు అవుతారో?
చాణక్య