అనుభవం అయితే గానీ తత్వం బోధపడదన్నది సామెత. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చంద్రబాబు తత్వం బోధపడిన దశకు చేరుకుంది. భాజపా కు అలాంటి అవకాశం ఎలాగూ లేదు. తత్వం బోధపడినా, నేతలు అడ్డం పడినా, చక్రం అడ్డేసి, పొత్తు ముడేయడానికి వెంకయ్య నాయుడు లాంటి సామాజిక సన్నిహిత పురోహితులు సదా సిద్ధంగా వుంటారు. అయితే ఇప్పుడు ఇంతకీ విషయం ఏమిటంటే, చంద్రబాబు, రామోజీ వంటి వాళ్ల దన్ను చూసుకుని, వారిచ్చిన మద్దతు చూసుకుని, జగన్ ను ఎంత యాగీచేయాలో అంతా చేసింది. తండ్రి హయాంలో వ్యాపార విస్తృతికి జగన్ చూపించిన అత్యుత్సాహం కాంగ్రెస్ కు అందివచ్చిన ఆయుధం మారింది. చంద్రబాబు ప్రభుత్వ పల్లకీ కొమ్ము కాస్తుంటే, రామోజీ కిరణ్ తరపును మీడియా మేనేజ్మెంట్ చూసుకుంటే, ఇంతకన్నా హాయి ఎక్కడుంటుంది అనుకుంటూ, కలలు కంటూ కమ్మగా నిద్రపోయింది కాంగ్రెస్ పార్టీ. తీరా అంతా అయ్యాక చంద్రబాబు పల్లకీ పఠీల్న పడేయడం, రామోజీ రాతలు మారిపోవడం చూసి కాంగ్రెస్ కళ్లు తేలేయాల్సి వచ్చింది.
ఇప్పుడు సోనియా పూర్తిగా చంద్రబాబును టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ వర్గాల బోగట్టా. మోడీ-చంద్రబాబు జోడీలను అధికారం దగ్గరకు రానివ్వకుండా వుండడానికి వీలయినన్ని ప్రయత్నాలు చేయాలని యుపిఎ అప్పుడే సంకల్పించింది. ఢిల్లీ నేతల మాటలు ఈ సూచనలను ధృవీకరిస్తున్నాయి. అవసరమైతే థర్డ్ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వడం లేదా మద్దతు తీసుకోవడం అన్నది ఇప్పుడు యుపిఎ కీలక ఆలోచనల్లో ఒకటిగా మారింది.
ఈసారి నరేంద్రమోడీ, చంద్రబాబులను అధికారానికి ఎలాగైనా దూరంగా వుంచాలని, మతతత్వశక్తులకు అధికారం అందకుండా చూడాలని కాంగ్రెస్ అధిష్ఠానం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి యుపిఎ కు ఇది కొత్త విషయం కావచ్చు. థర్డ్ ఫ్రంట్ కు ఇది పాత విషయమే. ఇందుకోసం యూపీఏ, థర్డ్ ఫ్రంట్‌లు ఒకరికొకరు సహక రించుకునేందుకు సిద్ధమవుతున్నాయన్నిది కొత్త విషయం. కేంద్రమంత్రి సల్మాన్‌ఖుర్షీద్ ఫరూకాబాద్‌లో ఒకటి రెండు రోజుల క్రితం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసారు. థర్డ్‌ఫ్రంట్‌కు మద్దతివ్వడం అన్నది ఆయన వ్యాఖ్యల్లోని కీలక అంశం. ఇక మంత్రి జైరాం రమేష్ నోటి వెంట కూడా ఈ తరహా అభిప్రాయం వినవచ్చిన సంగతి తెలిసిందే. జయలలిత, మమత బెనర్జీ, ములాయం సింగ్, నితీస్ కుమార్, వామపక్షాలు మోడీకి దూరమే కానీ దగ్గర కాదన్నది తెలిసిన సంగతే. నిజానికి ఒకప్పుడు చంద్రబాబు వీళ్లతోనే వుండేవారు. కానీ సమయానికి ఏ వాహనం ఎక్కితే, గమ్యం సులువుగా చేరుకుంటామో అన్నది బాబుకు తెలిసినంతగా మిగిలినవారికి తెలియదని కాదు.
కానీ ఆ విషయంలో బాబుకు మొహమాటాలు, పాత మాటల జ్ఞాపకాలు వుండవు. తాను మోడీని, భాజపాను తిట్టానే అన్న విషయాన్ని చాలా ఉద్దేశ పూర్వకంగా మరిచిపోతారు. కెసిఆర్ తొ జట్టుకట్టిన వైనాన్ని గుర్తుంచుకోరు. అందుకే ఈసారి అధికారం అందకుంటే తెలుగుదేశం పార్టీకి తెరదించాల్సి వస్తుందని తెలిసి, మూడో ఫ్రంట్ ను గాలికి వదిలి మోడీ దగ్గరకు పరుగెత్తారు. నిజంగా మోడీ అన్నారో లేదో తెలియదు కానీ, బాబు తరపున ప్రచారం కాంటాక్టు తీసుకున్న ఈనాడు పత్రిక అయితే, తాము అధికారంలోకి వస్తే, అవినీతిపై విచారణ జరిపిస్తామని అన్నారంటూ, జగన్ విషయాలను దృష్టిలో వుంచుకుని అన్నారంటూ రాసేసింది. బహుశా ఆయన అది సహజమైన ఎజెండాగా ప్రస్తావించి వుండొచ్చు. దీనికి ఈనాడు జగన్ తాళింపు అద్ది వుండొచ్చు. చంద్రబాబు కూడా ఇదే తీరుగా స్పందిస్తున్నారు. అంటే అధికారం అందితే వీరి భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా వుంటాయన్నది చూచాయిగా వెల్లడవుతోంది. దీంతో దాదాపు ఎన్డీఎ మినహా మిగిలిన రాజకీయ పక్షాలు, మోడీకి అధికారం అందకుండా చేయడానికి అవసరమైతే, మిగిలిన వారందరితో చేతులు కలపడానికి చూస్తున్నాయి.
మోడీ తిరుగులేని మెజార్డీ సాధిస్తారని సర్వేలు జోస్యం చెబుతున్నాయి. మీడియా కోడై కూస్తోంది. నిజానికి ఎన్నికల తీరం దగ్గరకు వచ్చేవరకు కూడా మోడీ చేసింది మేనేజ్ మెంట్ అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ రాజుగారి దేవతావస్త్రాలు కనపడలేదంటే ఏమనుకుంటారో అన్న రీతిలో మాట్లాడుతున్నారంతా. నిజంగా మోడీకి అంత చరిష్మా వుంటే, పవన్ కళ్యాణ్ లు, రజనీ కాంత్ ల వెంట పడాల్సిన పని లేదు. దక్షిణాది నాలుగు రాష్ట్రాలకు ఒక్క కర్ణాటక మినహా మిగిలిన చోట్ల అన్ని సీట్లు గెలుచుకునే సత్తా భాజపాకు లేదని మోడీకి తెలుసు.అయినా కూడా స్వంత బలం పెంచుకోవాలన్నది మోడీ నిర్ణయం. అందుకే ఇందుకు తగనది సినిమా గ్లామర్ అని అటు దృష్టిపెట్టారు.
అయితే భాజపాకు గరిష్టంగా ఎన్ని సీట్లు వస్తాయన్నది అసలు ప్రశ్న. ఇప్పటి వరకు జరిగిన అన్ని సర్వేలను చూసుకుంటే ఎన్టీఎ కు గరిష్టంగా వస్తాయని అంచనా వేసిన సీట్లు సంఖ్య 260 నుంచి 275. మిగిలిన సీట్ల సంఖ్య దగ్గర దగ్గర నూట యాభై. ఇలా కాకుండా భాజపా కూటమి గనుక 225 పాతిక సీట్లుకు పరిమితమైతే, పరిస్థితి వేరుగా వుంటుంది.
యూపీఏ, ఎన్‌డీఏ రెండింటికి దూరంగా ఉన్న పలు ప్రధాన పార్టీలు, వామపక్షాలకు వారి వారి ప్రాంతాల్లో కాస్త చెప్పుకోదగ్గ బలమే వుంది. మాయావతి, ములాయం, జయలలిత, మమత, నితీశ్, నవీన్ లను తక్కువ అంచనావేయడానికి వీలులేదు. మొత్తం సంఖ్య మ్యాజిక్ ఫిగర్ దాటిపోతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సరిగ్గా ఈ విషయంపైనే కాంగ్రెస్ ఇప్పుడు దృష్టి సారిస్తోంది. మూడో పక్షం నుంచి సరైన నాయకుడు వుంటే తాము మద్దతు ఇవ్వాలని చూస్తోంది,. కానీ ఇక్కడ ఓ అంశం ఎన్టీఎకు కలిసివస్తోంది. మూడో ఫ్రంట్ లో ఎవరికి వారే ప్రదాని కావాలనుకోవడం ఆ అంశం. ఆ పరిస్థితి వున్నన్నాళ్లు, తాము కొందరినైనా తమవైపు తిప్పుకోగలమని మోడీ ధీమాగా వున్నారు.
ఒక వేళ అన్నీ సహకరించి, అధికారం లేదా అధికార పంపకం వస్తే మాత్రం ఈ సారి చంద్రబాబు వ్యవహారాలు తేల్చేయాలని కాంగ్రెస్ పట్టుదలగా వున్నట్లు ఢిల్లీ వర్గాల బోగట్టా. కోర్డులను అడ్డు పెట్టుకుని చంద్రబాబు తప్పించుకుంటున్న వ్యవహారాలను ఏదో విధంగా తెరపైకి తీసుకురావాలని, రిలయన్స్ వ్యవహారం కూడా చూడాలని ఇప్పటికే నిర్ణయించినట్లు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అవసరమైతే కాంగ్రెస్ కు సహకరించే వైకాపా, తెరాసా లు కూడా ఈ విధమైన డిమాండ్ పెట్టాలని చూస్తున్నాయి. ఈ రెండు పార్టీలు తేదేపాకు పూర్తిస్థాయి శతృవులు అన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఈ పరిస్థితి ఊహించే కేంద్రంలోని కీలక స్థానాల్లో తన హితులైన కొందరని పురంధ్రీశ్వరి సాయంతో నియమించుకోగలిగారని అంటున్నారు. వారు తనకు ఆపత్కాలంలో సహకరిస్తారని బాబు భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఓ విషయం బాబు గుర్తెరగాలి. నిజంగా అటువంటి పరిస్థితి వచ్చినపుడు కేంద్రంలో అధికారంలో వుండేవారి వైపే వీరు కూడా మొగ్గే అవకాశం వుంది.
ఏదో జరిగితే గానీ ఎవరికో బుద్ధి రాదన్నది సామెత. ఇన్నాళ్లకు బాబు, రామోజీల వైఖరి కాంగ్రెస్ కు తెలిసి వచ్చింది. ఈసారి అక్కడ ఆదుకునేందుకు పురంధ్రీశ్వరి లేరు. రేణుకను పక్కన పెట్టారు. జైపాల్ ఏ మేరకు సహకరిస్తారో చూడాలి. మొత్తానికి ఇప్పుడు అధికారం అందినా, అందకున్నా, కాంగ్రెస్ టార్గెట్ చంద్రబాబు.
చాణక్య