ఎమ్బీయస్‌ : ఎన్నికల బొమ్మల లాంతరు

మన దేశం అంటేనే వైవిధ్యభరితం. ఇక ఎన్నికలనగానే ఎన్నో వికారాలు బయటపడతాయి. చాదస్తాలు, మూఢనమ్మకాలు, చిట్కాలు – గెలుస్తామంటే చాలు, మనుషులు వింతవింతగా ప్రవర్తిస్తారు. వాటిలో కొన్ని – Advertisement జయలలితకు నమ్మకాలు జాస్తి.…

మన దేశం అంటేనే వైవిధ్యభరితం. ఇక ఎన్నికలనగానే ఎన్నో వికారాలు బయటపడతాయి. చాదస్తాలు, మూఢనమ్మకాలు, చిట్కాలు – గెలుస్తామంటే చాలు, మనుషులు వింతవింతగా ప్రవర్తిస్తారు. వాటిలో కొన్ని –

జయలలితకు నమ్మకాలు జాస్తి. ఆవిడ సినిమా రంగంలోకి 'వెణ్నీర ఆడై' (తెల్ల చీర) అనే సినిమాతో ప్రవేశించి ఖ్యాతి సంపాదించినా ముదురు రంగు ఆవిడకు కలిసి వస్తుందని ఎవరో చెప్పారు. అందుకే ముదురు రంగు చీరలే కడుతుంది. వాటిలో మెరూన్‌ రంగు ఎక్కువ. ఆవిడ హెలికాప్టర్‌ కూడా మెరూన్‌ రంగుదే. దానికి గంటకు 3 లక్షల రూ.ల అద్దె. తనకోసం దానిలో మార్పులు చేయించుకుంది. నాలుగో సీటు తీయించేసి కాళ్లు  చాపుకుని కూర్చునేట్టు విశాలంగా చేసుకుంది. 

ఎడిఎంకె పార్టీ తరఫున పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసేవారందరినీ ఏప్రిల్‌ 1 వ తేదీ మధ్యాహ్నం 1. 40 నుండి 3 గం||ల లోపునే నామినేషన్లు వేయమని పార్టీ హుకుం జారీ చేసింది. అంతమందికి ఒకే టైము ఎలా మంచిదయ్యిందా అని ఆశ్చర్యపడుతున్నారా? ఆ ముహూర్తం – వాళ్ల జాతకాల బట్టి కాదు, జయలలిత జాతకంబట్టి పెట్టింది.

హేమమాలిని మథురలో రాష్ట్రీయ లోక్‌ దళ్‌ అభ్యర్థి, అజిత్‌ సింగ్‌ కుమారుడు అయిన జయంత్‌ చౌధురిపై పోటీ చేస్తోంది. 2009 ఎన్నికలలో ఆ పార్టీకి, బిజెపికి పొత్తు వుండడం చేత అతనికి మద్దతుగా ప్రచారం చేసిందామె. ఇప్పుడు అతనిపై విమర్శలు గుప్పిస్తోంది.

పాతకాలపు హిందీ హీరో బిశ్వజిత్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఢిల్లీలో పోటీ చేస్తున్నాడు. జనాలు తనను మర్చిపోయి వుంటారని కరక్టుగానే వూహించి తను నటించిన హిందీ సినిమాల లిస్టుని ప్రచారంలో భాగంగా పంచుతున్నాడు. తమాషా ఏమిటంటే వాటిలో ''ఏప్రిల్‌ ఫూల్‌'' అనే సినిమా కూడా వుంది! అంతే కాదు, ''బీస్‌ సాల్‌ బాద్‌'' (ఇరవై ఏళ్ల తర్వాత అని అర్థం) అని 1962 నాటి సినిమా కూడా వుంది. లిస్టు చదివినవారు 'ఏభై ఏళ్ల తర్వాత కూడా యింకా ఏం గుర్తు పెట్టుకుంటాం సార్‌' అంటున్నారట.

మలయాళ నటుడు మోహన్‌లాల్‌ 'ఇన్నోసెంట్‌' అనే హాస్యనటుడి తరఫున ప్రచారం చేస్తున్నాడు. అతను లెఫ్ట్‌ ఫ్రంట్‌ అభ్యర్థి. ఇది యుపిఏకు కోపం కలిగిస్తోంది. ఎందుకంటే మోహన్‌లాల్‌కు లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా యిచ్చింది యుపిఏనే! ఇప్పుడు యిలా ప్రచారం చేయడాన్ని మిలటరీ క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తారేమో చూడాలి!

రాజ్‌ బబ్బర్‌ ఘజియాబాద్‌ నుండి కాంగ్రెస్‌ తరఫున నిలబడుతున్నాడు. నామినేషన్‌ వేసేముందు హిందువులను తృప్తి పరచడానికి హవన్‌ నిర్వహించి, ఆ తర్వాత ముస్లిములకోసం మసీదుకి, సిక్కుల కోసం గురుద్వారాకు వెళ్లి ఆ పై నామినేషన్‌ వేయాలని ప్లాను. అయితే హవన్‌ పూర్తయేసరికి పుణ్యకాలం గడిచిపోతోంది. అందువలన పొగ వలన మండుతున్న కళ్లు నులుముకుంటూ కారెక్కాడు. అది కదలడానికి మొరాయించింది. ఎట్టకేలకు బయలుదేరదీసి, నామినేషన్‌ ముహూర్తం మించిపోతోందని మసీదుకి, గురుద్వారాకు కార్లోంచే దణ్ణం పెట్టుకుని ఎలక్షన్‌ ఆఫీసుకి ఉరుకులు పెట్టాడు. అక్కడ పెద్ద క్యూ వుంది. మన చిరంజీవి స్టయిల్లో క్యూ జంప్‌ చేద్దామని చూస్తే, అక్కడా కార్తిక్‌ స్టయిల్లో జనాలు అడ్డుకున్నారు. కళ్లు చికిలిస్తూ క్యూలో నిలబడ్డాడు.

రాఖీ సావంత్‌ రాష్ట్రీయ ఆమ్‌ పార్టీ అని పెట్టి వాయువ్య ముంబయి నుంచి పోటీ చేస్తోంది. ఆమె గుర్తు పచ్చిమిర్చి. పెద్దగా చదువుకోకపోయినా నెహ్రూ జాకెట్‌, గాంధీ టోపీ, కళ్లజోడు పెట్టుకుని నేతా స్టయిల్లో పోస్టర్లు వేయించుకుంది. ఆమెకు ప్రత్యర్థిగా నిలబడిన ఆప్‌ అభ్యర్థి మయాంక్‌ గాంధీ 'రాఖీకి ఓటేసేవారు వినోదం (ఫన్‌) కోసమే వేస్తారు' అనడంతో ఆమెపై కేసు పెట్టింది.

రామ్‌ సేవక్‌ ధోబి అనే కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే వున్నాడు. ఇందిరా గాంధీ కాలం నుండి ఆమె కుటుంబ సభ్యులకు నామినేషన్‌ వేసినపుడు యితను పక్కన వుంటే విజయం తథ్యం అని నమ్మకం. అందువలన యిప్పటికీ నామినేషన్‌ వేసేటప్పుడు యితన్ని పిలిపిస్తారు. ఇప్పుడు అతనికి 92 ఏళ్లు. అయినా పిలిపిస్తారు. ఇతను వెళ్లి వస్తూ వుంటాడు.

క్రైస్తవ ఫాదిరీలు కూడా ఎన్నికలలోకి దిగారు. తిరునల్వేలి జిల్లాలో కూడంకుళం న్యూక్లియార్‌ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి సారథ్యం వహించిన ఫాదర్‌ జేసురాజ్‌ ఆప్‌ టిక్కెట్టుపై నిలబడ్డాడు. తిరువనంతపురంలో ఫాదర్‌ స్టీఫెన్‌ ఇండిపెండెంట్‌గా నిలబడ్డాడు. క్రైస్తు, మార్క్‌స్‌ సిద్ధాంతాలను కలగలపి పాటలతో కేరళలో ప్రచారం చేసే 'కామ్రేడ్‌ ప్రీస్ట్‌' ఫాదర్‌ మేత్యూ వళక్కుణ్నం సేవలను సిపిఎం పార్టీ తమ పార్టీ ప్రచారానికి వినియోగించుకుంటోంది.  

2 జి స్కామ్‌ ధర్మమాని 'రాజా' అనగానే తమిళనాడులో అందరూ ఉలిక్కిపడుతున్నారు. డిఎంకె మంత్రి ఎ.రాజా జైలుకి వెళ్లినపుడు తమిళనాడు సిపిఐ నాయకుడు డి.రాజా యిబ్బంది పడేవారు. తెలిసీతెలియని వాళ్లు కొందరు ఏ ఎయిర్‌పోర్టులోనో తారసిల్లి 'జైలుకి వెళ్లింది మీరు కాదా?' అని అడిగేవారట. ఇప్పుడు శివగంగ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా నిలబడుతున్న ఎచ్‌. రాజా ప్రచారానికి వెళ్లినపుడు 'ఆ రాజా నువ్వేనా?' అని అడుగుతున్నారట. తను వేరే అని చూపించుకోవాలని, బిజెపి వారి నార్త్‌ యిండియన్‌ స్టయిల్లో 'రాజాజీ' అని చెప్పుకోసాగాడతను. కానీ తమిళ ప్రజలకు రాజాజీ అంటే 'సి.రాజగోపాలాచారి' మాత్రమే. ఇదీ లాభం లేదని తన పార్టీ గుర్తు కలుపుకుని 'లోటస్‌ రాజా' అని చెప్పుకుంటున్నాడు.

కేసుల్లో యిరుక్కోని నిష్కళంకులనే నిలబెడతామనే హామీతో ఆప్‌ పార్టీ రాజకీయాల్లోకి వచ్చింది. కానీ ఒడిశాలో వాళ్ల అభ్యర్థి నరేంద్ర మహంతీపై 28 క్రిమినల్‌ కేసులున్నాయి. అదేమిటి అంటే 'గిరిజన ప్రాంతాల్లో వారి అభ్యున్నతి కోసం పని చేస్తున్న అతనిపై ప్రభుత్వం అన్యాయంగా మోపిన కేసులవి' అని ఆప్‌ అంటోంది. 

అహ్మదాబాద్‌ (తూర్పు) నుండి పోటీ చేస్తున్న థరథ్‌ దేవ్‌డా ఎన్నికల హామీ ఒక్కటే – గృహహింస నుండి మగవాళ్లను రక్షించడం!

దక్షిణ ముంబయి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవ్‌ శర్మ అనే యువకుడు స్పైడర్‌ మ్యాన్‌ సూటు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నాడు. ఒక్క తాడు వుంటే పెద్ద పెద్ద బిల్డింగులు కూడా ఎక్కేయగల శర్మ పదో అంతస్తు అపార్ట్‌మెంట్‌ వంటింటి కిటికీల్లోంచి గృహిణులకు హలో చెప్పి ఓట్లడగగలడు. 

ఓటర్లను చేరుకోవడం ప్రచారంలో ఒక పెద్ద సమస్య. ఇరుకుసందుల్లోకి వెళ్లడం కష్టం కాబట్టి తమిళనాడులోని మయిలాడుదురై నియోజకవర్గంలో  మనిదనీయ మక్కల్‌ కచ్చి తరఫున పోటీ చేస్తున్న హైదర్‌ అలీ తన ఫ్రెండు స్కూటర్‌ వెనకసీట్లో కూర్చుని సందుల్లోకి వెళ్లిపోతున్నాడు.

పర్వతప్రాంతాల్లో ప్రయాణం మరో రకమైన కష్టం కాబట్టి ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ పార్టీ మేఘాలయా పారాగ్లయిడింగ్‌ అసోసియేషన్‌ సహాయం కోరింది. వాళ్లు గ్లయిడర్లపై అభ్యర్థులను తోడుగా తీసుకుని వెళ్లి ఓటర్ల వద్దకు ఎగురుకుంటూ వెళుతున్నారు. భూమికి 15 అడుగుల ఎత్తులో వేళ్లాడుతూ ఓట్లు అడుగుతున్న అభ్యర్థులను చూసి ఓటర్లు ముచ్చటపడుతున్నారు.

తమిళనాడులోని ఎండిఎంకె నాయకుడు వైకో ఓటర్లకు ఏ సేవ చేయడానికైనా రెడీయే కానీ షేక్‌హ్యాండ్‌ యివ్వడానికి మాత్రం ఒప్పుకోడు. అంతేకాదు, తన కార్యకర్తలెవరూ గోళ్లు పెంచుకోకూడదని ఆదేశాలు జారీ చేశాడు. 

డార్జిలింగ్‌లో తృణమూల్‌ తరఫున పోటీ చేస్తున్న బైచుంగ్‌ భూటియా ఫుట్‌బాల్‌ ఆటగాడు. ఫుట్‌బాల్‌ స్టేడియంలో అయితే ఓటర్లు ఎక్కువమంది ఒకేసారి దొరుకుతారు కదాని వెళితే 'ఓట్ల సంగతి తర్వాత, ఓ ఆట ఆడదాం రమ్మ'న్నారు. ఓట్లకోసం వంటలు చేస్తున్నవారుండగా యిదో లెక్కా అనుకుని కాస్సేపు ఆడి వచ్చాడు. బెంగాల్‌లోనే రాయ్‌గంజ్‌లో సిపిఎం అభ్యర్థిగా నిలబడిన మొహమ్మద్‌ సలీం క్విజ్‌ మాస్టర్‌. నియోజకవర్గంలో తిరుగుతూ భారత రాజకీయాలపై క్విజ్‌లు నిర్వహిస్తూ జనాలను పోగేస్తున్నాడు, ఆపై ఓట్లు అడుగుతున్నాడు.

కార్యకర్తలకు టీ యిచ్చినా ఎన్నికల ఖర్చులో రాసేస్తామని ఎన్నికల కమిషన్‌ అంటోంది. దానికి మస్కా కొట్టడం ఎలాగో అభ్యర్థులకు తెలుసు. చిక్కబళ్లాపూర్‌లో కాంగ్రెస్‌ ఒక పెద్ద సభ నిర్వహించింది. సభ అయిపోయాక కార్యకర్తలకు భోజనం పెట్టాలి. ఎలా? అందుకని పక్కనే వున్న కమ్యూనిటీ హాల్లో కుశాల అనే పిల్లవాడి బారసాల జరుగుతోంది మీరందరూ రండి అని పిలిచారు. వెళ్లినవాళ్లకు బిర్యానీలతో సహా సుష్టుగా భోజనం పెట్టారు. వెళ్లేముందు పిల్లవాణ్ని ఆశీర్వదించి వెళ్లాలేమో అని చూస్తే పిల్లాడూ లేడు, వాడి తలిదండ్రులూ లేరు!

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2014)

[email protected]