కెసిఆర్ అండ్ కో బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నారా అనిపిస్తోంది..అసెంబ్లీలో హెరిటేజ్ దుమారం చూస్తుంటే. కరెంటు, రైతు సమస్యల నుంచి, బడ్జెట్ మీదకు వచ్చి, ఆపై కవిత సర్వే వివరాలకు చేరిన చర్చ..ఉన్నట్లుంది హెరిటేజ్ మీదకు మళ్లింది. ఎప్పడో కేరళలో జరిగిన వ్యవహారాన్నిఇప్పుడు ప్రస్తావించడం ద్వారా దానిపైకి మళ్లించారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే హెరిటేజ్ పాలు, కల్తీ అన్న విషయాలు డిస్కషన్ కు వస్తే, అది ఆ పాల అమ్మకాలపై కొంతయినా ప్రభావం చూపిస్తుంది.
పైగా తెలుగుదేశం పార్టీ సభ్యులను చంద్రబాబు తొత్తులుగా, ఆయన కంపెనీలకు గార్డులుగా, ఇంకా మాట్లడితే ఆంధ్ర కంపెనీలు, లేదా ఆంధ్ర పార్టీలకు వత్తాసు పలికే వారిగా చిత్రించే ప్రయత్నం స్పష్టమవుతోంది.
చిన్న అవకాశం దొరికినా రాజకీయ శతృవులను ఇరుకున పెట్టడానికి టీఆర్ఎస్ ఏ మాత్రం మొహమాటపడడం లేదు. ఎబిఎన్, టీవీ 9లు ఏ విధంగా ఇరుకున పడ్డాయో అందరికీ అర్థమైపోయింది. తెలుగుదేశాన్ని ముప్పేట దాడి చేయాలన్నది లక్ష్యంగా టీఆర్ఎస్ పెట్టుకుంది. ముందు కరెంటుకు కారణం చంద్రబాబు కక్షసాధింపు వైఖరి అన్నది ముందు ఓ ఏంగిల్ లో ప్రారంభించారు. ఆ తరువాత తెలంగాణ దేశం నాయకులు ఈ ప్రాంత ప్రయోజనం కన్నా, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే మిన్నగా వున్నాయన్న దానిపై ఫోకస్ పెట్టారు. దాని తరువాత ఇప్పుడు డైరక్ట్ గా చంద్రబాబు కంపెనీనే టార్గెట్ చేసారు.
ఇప్పుడు టీఆర్ఎస్ లేవనెత్తిన కేరళ వ్యవహారం కొత్తది కాదని, అది సమసిపోయిన వెనకటి వ్యవహారమని పత్రిలకను ఫాలో అయ్యే జనాలకు తెలియంది కాదు. కానీ ఓ శాసనసభ్యుడు తన అనుమానం కొత్తగా వ్యక్తం చేయడం విశేషం. నిజానికి ఇది సింపుల్ విషయం. కేరళలో బ్యాన్ చేసారు..ఇక్కడేం చేస్తారు అనగానే..నిజానిజాలు తెలుసుకుంటాం అని ప్రభుత్వం ఆన్సర్ ఇచ్చేస్తే అయిపోతుంది. కానీ అసలు హెరిటేజ్ అన్న పదం వినగానే దేశం సభ్యులు ఊరుకోరని తెరాసకు తెలియంది కాదు.
తెలుగుదేశం సభ్యులు ఊరుకుని వుంటే అధికారపక్షం నుంచి ఎటువంటి హడావుడి వుండేది కాదు, సభ్యుడు అడిగినా, సంబంధిత మంత్రి అసెంబ్లీలో తప్పుడు సమాధానం ఇవ్వడానికి సాహసించరు. హెరిటేజ్ కంపెనీని అడుగుతాం అంటారు. అడిగితే వాళ్లు అదంతా పాత వ్యవహారం, ముగిసిన వైనం అని చెబుతారు. అదంతా మామూలుగా జరిగిపోయేది. కానీ ఇప్పుడలా జరగలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం హెరిటేజ్ పై చర్యలు తీసుకునే వ్యవహారాలేమీ వుండవు. ఎందుకంటే అక్కడ ఆ అవకాశాలు లేవు.
కానీ అసెంబ్లీలో ఏదో విధంగా తెలుగుదేశం సభ్యులను ఈ రోజుకు పక్కదారి పట్టించడం, హెరిటే జ్ ను తెలంగాణలో బద్ నామ్ చేయడం ఈ రెండూ మాత్రం నెరవేరినట్లే. మళ్లీ రేపు ఇంకో రచ్చ..ఎల్లుండి మరో రచ్చ..ఇలాగే తోసుకుపోతారు సమావేశాలను. అందులో సందేహం లేదు. ఎందుకంటే హరీష్ రావు వల్ల కేసిఆర్ కు సమస్య అంటే, ఎన్టీఆర్ వల్ల లోకేష్ కు సమస్య అనడం ఇందుకో ఉదాహరణ.
వాదనలకు ఇరు పక్షాల సిద్దం..ఆఖరికి ముదిరితే సస్పెన్షన్..తీర్మానాల ఆమోదం.అసెంబ్లీ నిరవధిక వాయిదా..మళ్లీ తరువాత చూసుకోవచ్చు..అంతకు మించి టార్గెట్ హెరిటేజ్ వెనుక మరేమీ లేదు. చిత్రమేమిటంటే ఆ సంగతి దేశానికీ తెలుసు..వారు ఆంధ్రలో వాడేది కూడా ఇలాంటి రాజకీయమే కదా.