తోటరాముడు-2

తోటలో పళ్లూ, కూరగాయలే కాదు రాజకీయాలు కూడా పండించవచ్చు. ఈ రహస్యాన్ని ముందెందరో చెప్పారు. ఈ యుగంలో మాత్రం తొలుత కేసీఆర్‌ నిరూపించారు. ఆ తర్వాత నిరూపించడానికి పవన్‌ కళ్యాణ్‌  సిద్ధమయ్యారు. పేరుకి ఎన్టీఆర్‌…

తోటలో పళ్లూ, కూరగాయలే కాదు రాజకీయాలు కూడా పండించవచ్చు. ఈ రహస్యాన్ని ముందెందరో చెప్పారు. ఈ యుగంలో మాత్రం తొలుత కేసీఆర్‌ నిరూపించారు. ఆ తర్వాత నిరూపించడానికి పవన్‌ కళ్యాణ్‌  సిద్ధమయ్యారు. పేరుకి ఎన్టీఆర్‌ సినిమాలో వేషం వేసి, ‘తోటరాముడ’య్యాడు కానీ అసలు తోటరాముళ్లు వీరే! నిజంగానే తోటల్లో నివాసం ఉంటారు. దాన్నే ముచ్చటగా ‘తోటబంగ్లా’ అనుకోవచ్చు, లేదా ‘ఫౌంహౌస్‌’ అనుకోవచ్చు. కేసీఆర్‌ ఉద్యమంలోనే కాదు ఉద్యానవనంలో కూడా రాజకీయాన్ని చూపగలరు. కానీ పవన్‌కు సాధ్యమా? జనసేనతో పోటీ చేయకుండా ప్రచారంలో పాల్గొని హల్‌చల్‌ సృష్టించి, మళ్లీ తోటలోకి వెళ్లిపోయారా? అయితే మాత్రం రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఒకరి ‘ఫ్యూజు’ ఒకరు  లాగేస్తున్నా, గురుకుల ట్రస్టు భూముల్లో ఆకాశహర్మ్యాలు వదలి, పేదల ఇళ్లు పీకేస్తున్నా తోట రాముడు-2 బయటకు రావడం లేదు. 

రాజకీయం తెలిసిన పార్టీ

జనసేన అచ్చమైన రాజకీయ పార్టీ. పుట్టకముందే రాజకీయం నేర్చిన పార్టీ. పవన్‌కు రాజకీయం తెలియదని అన్నది ఎవరు? ఆయనకు తెలిసినంతగా జగన్‌కు కూడా తెలియదు. ఎందుకంటే పార్టీ పెడుతున్న సంగతి తెలిసీ తెలియకుండా బయటకు తెలియచేసారు. ఆపైన కాస్లీ వేదికపై దాన్ని ఆవిష్కరించారు. ఆ సభ కోసమేమిటి? ఆ తరువాతి సభల నిర్వహణకు పి.వి.పి సంస్థ యజమానిని యథాశక్తి వాడేసుకున్నారు. ఎమ్మెల్సీ కూడా కాకుం డానే నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టిన చంద్రబాబు చేత, తన పార్టీకి ఫైనాన్షియర్‌, స్పాన్సరర్‌ అయిన పివిపికి ఏమీ చేయిం చలేదు పవను బాబు. మరి అదే రాజకీయం అంటే. ఎక్కి వచ్చి మెట్లను మరిచిపోకుంటే, మిగిలిన మెట్లను ఎక్కలేం కదా? 

రాజకీయం అంటే మరో క్వాలిఫికేషన్‌ కూడా వుండాలి. మన మనసులో ఏముందో మనకు తప్ప వేరేవరికి తెలియకుండా మాట్లాడగలగాలి. పవన్‌కు ఆ క్వాలిఫికేషన్‌ కాస్త ఎక్కువే వుంది. ఆయన మనసులో ఏముందో కాదు, మాటల్లో ఏముందో కూడా ఎవరికీ అర్థం కాదు. అర్థంపర్థం లేని సినిమా పాటల్లా వుంటాయి అవి. రిథమ్‌ బాగుంటుంది. వేడి వేడి పకోడీల్లా అప్పటికప్పుడు భలేగా వుంటాయి. తరువాత ఆలోచిస్తే, అవును ఏముందీ అనిపి స్తుంది. అదే రాజకీయం అంటే. ముందు పవన్‌ బాబు పార్టీ పెడుతున్నా అన్నారు. ప్రాణానికి తెగిస్తున్నా అన్నారు. (అందుకే తోట బంగ్లాలో దాక్కున్నారని జనం అపార్థం చేసుకోరాదు సుమా,.). టైమ్‌ లేకున్నా ఎన్నికల రంగంలోకి ధభాలున దూకేస్తున్నా అన్నారు. అంతలో రెండో మీటింగ్‌ వేళకు మాట మారింది. అబ్బే..తూచ్‌..రాష్ట్రం గొడ్డు పోయింది. మంచి అభ్యరులే దొరకడంలేదు. దొరికినపుడు పోటీ అన్నారు. మంచిదే. మంచి ఆశయమే. కానీ ఇక్కడా రాజకీయం వుంది. మీకు మంచి అభ్యర్థులు దొరకలేదు. మరి భాజపా, తేదేపా అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు కదా. అంటే మీ దృష్టిలో వారంతా మంచి అభ్యర్థులేనా? అంటే ఆ పాటి కేండిడేట్‌లు మీకు దొరకలేదా? ఇదే రాజకీయం అంటే, పోటీ చేయనందుకు సరైన సాకు వెతికి జనం ముందు పెట్టడం.

రెండో మీటింగ్‌ నాటికి కేవలం మద్దతు మాత్రమే..ఎవరికి అన్న ది తరువాత. ఆ తరువాత సమయానికి మోడీకి మాత్రమే మద్దతు. అంతలోనే మళ్లీ మారింది. తెలుగుదేశం పార్టీకి కూడా మద్దతు. అలా అలా ఆఖరికి అసలు జనసేన ఆశయం బయటపడింది. 

ప్లీజ్‌…చూపించరూ

అయితే అక్కడా మళ్లీ రాజకీయం. జనం అపార్థం చేసుకోవద్దు. ఈ ఎన్నికల వరకే ఈ మద్దతు. 2019కి మళ్లీ ఎన్నికల గెటప్‌తో మీ ముందుకు వస్తా. ఈలోగా అవసరమైతే ప్రశ్నిస్తా..అన్నట్లు.. జనసేన కేడర్‌ తయారవుతోంది. కంప్యూటీకరణ జరుగుతోంది. సభ్యత్వ నమోదు ప్రారంభమైంది..శిక్షణకు ఏర్పాట్లు జరగుతు న్నాయి.
ఏదీ ఎక్కడ? ప్లీజ్‌..చూపించరూ..జనమేమో..అప్పుడేప్పుడో కామన్‌ మాన్‌ ప్రొటక్షన్‌ ఫోర్స్‌ అన్నది పెద్ద ఫార్సయిందని దెప్పి పోడుస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అదే బాపతు వ్యవహారం ఇది అని అంటున్నారు. 

కానీ పవన్‌ బాబుకు ఇదేమీ పట్టదే..తాను, తన తోట. తోటలో పళ్లు..వాటి వితరణ కార్యక్రమం. మొక్కలకు కలుపు తీయడం ఎలా? తోటను ఏపుగా పెంచడం ఎలా? మరి జనసేన ను ఎవరు పట్టించుకుంటారు. దాన్ని ఏపుగా ఎవరు పెంచుతారు. ఇదేమన్నా డ్రామా డ్రెస్‌ కంపెనీనా..నాటకం అయిపోగానే డ్రెస్‌ తీసి దాచి, మళ్లీ ఎన్నికల నాటికి తీసి వేసుకోవడానికి. స్వంత డ్రెస్‌ కదా..దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. 

పశ్నించేదెప్పుడు?

రాజకీయ పార్టీ అన్నాక మంచికో, చెడ్డకో తన అభిప్రాయాలు చెప్పాలి. ఖండిస్తే, ఖండిచాలి. సమర్థిస్తే సమర్థించాలి. మరి దేని పైనా స్పందించని పార్టీని పార్టీ అని ఎలా అంటాం? అంటే జన సేనకు అభిప్రాయాలు అనేవి వుండవా? 

సామాన్యుడికి తినడానికి లేదు..నాకు అనిపిస్తోంది. అసలు మనం ఎలా బతుకుతున్నామా..అని. ఇలాంటి పడికట్టు స్పీచులు చాలా ఇచ్చిన పవన్‌ ఎప్పుడు వచ్చి ప్రశ్నించడం ప్రారంభిస్తారా అని చూస్తున్నారు జనం. ఒక్క ఉదుటున రైల్వే చార్జీలు పెంచినప్పుడు జనసేన తన అభిప్రాయం చెప్పాలి కదా? గ్యాస్‌ ధరలు పెంచబోయి, అందరూ వద్దు బాబోయ్‌ అనడంతో మూడు నెలలు వెనక్కు తోసిన వైనంపై మాట్లాడాలి కదా? 

లేదూ..ఆంధ్ర పిల్లగాళ్లకి తెలంగాణలో ఫీజుకట్టం అని అక్కడి ప్రభుత్వం అంటే, తన మాట తాను చెప్పాలి కదా. గురుకుల్‌ ట్రస్ట్‌ భూముల్లో పెద్దోళ్ల ఇళ్లు వదిలేసి చిన్నోళ్లవి పడగొడుతుంటే అడగాలి కదా?

రుణమాఫీ…..అవును..అసలు మాఫీ అన్న పదం సరైనదేనా? మాఫీ చేసే హక్కు కేవలం రుణం ఇచ్చిన వారికే వుంటుంది. ఎవడో ఇచ్చిన అప్పును..ఇంకెవరో ఎలా మాఫీ చేస్తారు. కావాలంటే రుణ తీర్మానం చేస్తాం..రుణం తీరుస్తాం.. అనొచ్చు. సరే మాఫీ అన్నారు. ఇప్పుడు వాయిదాల పొడిగింపు, ఇంకేదో..అంటున్నారు. మరి దానిపై కనీసం ఏం జరుగుతోంది అని కనుక్కోవాలి కదా? 

ఎవర్ని సంప్రదించి విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని అని డిసైడ్‌ అయిపోయారు. ఇద్దరు నాయకులూ…మరి ఆ ముక్క అడగాలి కదా పవన్‌ బాబూ..

ఇలా ఒకటేమిటి చాలా వున్నాయి. జగన్‌ బాబు అడిగితే.. రాజకీయం అని తిడతారు..అసలు అతగాడికి ఆ హక్కేలేదంటారు. పైగా మాట్లాడితే జైలు,,బెయిలు..స్కాము అంటారు. అవన్నీ కోర్టు వ్యవహారాలు. ఇప్పుడు అతగాడిని జనం ప్రతిపక్షనేత చేసారు అందుకైనా బదులిద్దాం అనుకోరు. 

అందువల్ల పోనీ ఇక మిగిలిన మీరయినా ప్రశ్నించకుంటే ఎలా? 

అందుకే పవన్‌ బాబూ..ప్రశ్నించు. లేదేంటే, మిమ్మల్నీ తోటరాముడి కింద జనం జమేస్తారు. మళ్లీ మాట్లాడితే తోటరాముడు 2 అంటారు జాగ్రత్త బాబూ..

-చాణక్య

[email protected]