హీరో గాల్లోకి అంతెత్తున లేచి విలన్లను చావగొడతాడు..ఆయనేకేం భయం..అతను హీరో.
నిర్మాత సినిమాకు చులాగ్గా కోట్లు కుమ్మరించేస్తాడు..మూడు రూపాయిల వడ్డీకి కోట్లు ఫైనాన్స్ తెస్తాడు..ఆయనకేం భయం.
దర్శకుడు గాల్లో చేతులు తిప్పుతూ, రెండున్నర గంటల సినిమాను, కళ్ల ముందు మాటలతో చూపించేస్తాడు..వారికేం భయం..
బాగుందని టాక్ వస్తే చూస్తాడు..లేకుంటే టీవీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాడు ప్రేక్షకుడు..అతనికేం భయం..
మరి ఎవరికి భయం..టాలీవుడ్ లో?
అందరికీ భయమే..హీరో, దర్శకుడు, నిర్మాత, ప్రేక్షకుడు అందరికీ ఇప్పుడు భయమే. ఏటా వంద సినిమాలు తీస్తున్న టాలీవుడ్ లో అందరినీ ఇప్పుడు కనిపించని భయం పట్టిపీడిస్తోంది. అక్కడున్న ప్రతి ఒక్కరిదీ మేకపోతు గాంభీర్యమే. బొమ్మ స్క్రీన్ పై పడేవరకు చెప్పే కబుర్ల చాటున భయం భయమే..
ఇదీ ఇప్పుడు టాలీవుడ్ అసలు తీరు.
ఇదేదో కాకమ్మ కథలా వుండొచ్చు..పోచుకోలు కబురులా వుండొచ్చు కానీ నిజం. ఇప్పుడు అంత త్వరగా హీరోలు సినిమాలు అంగీకరించడం లేదు. దర్శకులకు అంత త్వరగా సినిమా అవకాశాలు రావడంలేదు. నిర్మాతలు భారీ సినిమాలు తీయడానికి మొగ్గు చూపడంలేదు. భారీహైప్ అన్నా రావాలి, లేదా సరైన టాక్ తెలియాలి.. లేకుంటే జనం థియేటర్లకు రావడం లేదు. ఇదో చిత్రమైన పరిస్థితి టాలీవుడ్ ఇంతకు ముందు చవి చూడని వైనం.
ఎన్టీఆర్ ఎఎన్నాఆర్, లేదా చిరంజీవి, బాలకృష్ణ కాలం కాదిది. రొడ్డకొట్టుడుగా సినిమాలు చేసుకుంటూ పోవడానికి. ఒకే డైరక్టర్..హీరో కాంబినేషన్ లేదా ఒకే హీరో, హీరోయిన్ కాంబినేషన్ లో పుంఖానుపుంఖాలుగా సినిమాలు రావడానికి. మాస్ కథ దొరికిందా..స్టోరీ డిస్కషన్..చకచకా షూటింగ్..రిలీజ్..ఒకేసారి రెండు మూడు సినిమాలు. ఏడాదికి అరడజను సినిమాలు. అందులో నాలుగైదు హిట్లు. ఇదంతా మొన్నటి వ్యవహారం. నిన్నటికి నిన్న కూడా అంత బ్యాడ్ గా లేదు.
కానీ ఇప్పుడు..ఈ రోజు అంతా మారిపోయింది. అన్నింటికన్నా పెద్ద ప్రశ్న అందరి ముందు నిలిచింది. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు..మిలియన్ డాలర్ల ప్రశ్న. కొత్తదనమా? వైవిధ్యమా? పక్కా మాస్ మసాలానా? ఏ ఒక్కటి అవునన్నా, మరో సందేహం అడ్డంగా వస్తుంది. ఏ ఒక్కదాన్ని కాదన్నా మరో సాక్ష్యం అడ్డంకొడుతుంది. ఏ సినిమా హిట్ అవుతుందో..హిట్ అయ్యే వరకు చెప్పే పరిస్థితి లేదు. ఏ సినిమా ఎందుకు చీదేసిందో, బొమ్మ పడ్డాక కానీ తెలియదు. అప్పుడు ప్రతి ఒక్కరు విశ్లేషించేవారే..ప్రతి ఒక్కరు సుద్దులు చెప్పేవారే.
హిట్ ఇచ్చిన డైరక్టర్ కు వెంటనే అవకాశం వస్తుందా?
నో గ్యారంటీ..
హిట్ ఇచ్చిన హీరో వెంటనే సినిమా వదుల్తాడా..?
డౌటే..
నలభై నుంచి అరవై కోట్లు వసూళ్లు సాధించిన సినిమా నిర్మాత వెంటనే సినిమా తీస్తాడా..
చెప్పడం కష్టం..
ఫలానా జోనర్ సినిమా చూసిన ప్రేక్షకుడు, మళ్లీ అలాంటి జోనర్ అందిస్తే చూస్తాడా..ఆదరిస్తాడా?
అనుమానమే..
ఇలా తయారైంది టాలీవుడ్ పరిస్థితి. అందుకే హీరోలు ఆచి తూచి సినిమాలు అంగీకరిస్తున్నారు. కాస్త సత్తా వున్న ప్రతి డైరక్టర్ ను కబురుపెడుతున్నారు. ఏ పుట్టలో ఏ పాముందో అన్న చందంగా, ఏ డైరక్టర్ దగ్గర ఏ సబ్జెక్ట్ వుందో అని వాకబుచేస్తున్నారు. ప్రతి ఒక్కరిని రిజర్వ్ లో వుంచుతున్నారు. ఈ వెయిటింగ్ లిస్టు లో వున్నవారికి ఎప్పుడు బెర్త్ కన్ ఫర్మ్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. మాంచి హిట్ ఇచ్చాడు కదా అని అనుకుంటే, ఆ డైరక్టర్ కు మళ్లీ సినిమా వచ్చేసరికి ఏళ్లూ పూళ్లూపడుతోంది.
ఓపెనింగ్స్ కీలకం
సినిమాకు ఇప్పుడు ఓపెనింగ్స్ కీలకంగా మారాయి. నిజంగాచెప్పాలంటే చాలా సినిమాలు ఓపెనింగ్స్ మాత్రమే కీలకమైపోతున్నాయి. సినిమా విడుదలైన తరువాతి మూడురోజులు, మహా అయితే తొలివారం తోనే చాలా వాటికి ఆయుష్షు తీరిపోతోంది. పెద్ద సినిమాలు, మరీ హైప్ వచ్చినసినిమాలు మలివారాలను చూస్తున్నాయి. లేదంటే లేదు. అందుకే కొద్ది మంది హీరోల వైపే నిర్మాతలు చూస్తున్నారు. దర్శకుడు మంచి సబ్జెక్ట్ తెచ్చి, ఏదో హీరో పేరు చెబితే నిర్మాతలు పెదవి విరుస్తున్నారు. 'అబ్బే ఆ హీరోకి ఓపెనింగ్స్ వుండవండీ' అనేస్తున్నారు.
మంచి ఓపెనింగ్స్ సాధించగల హీరోలు తెలుగునాట ఆరు నుంచి ఎనిమిదికి మించి లేరు. మిగిలిన వారి సినిమాల వ్యవహారం వేరు. బొమ్మ పడాలి. జనం మౌత్ టాక్ స్ప్రెడ్ కావాలి. టీవీలో ప్రకటనలు కుమ్మాలి. అప్పుడు కాస్త జనం వస్తారు.అంతవరకు వచ్చే వసూళ్లు సినిమా ఆడించడానికే సరిపోతోంది. అందుకే నిర్మాతకు ముందు దక్కిన అడ్వాన్స్ లు తప్ప, తరువాత బకాయిలు వస్తాయన్న నమ్మకం ఏనాడో ఆవిరైపోయింది. దాంతో నిర్మాతలు అంతా ఈ ఆరేడు ఎనిమిది మందివైపే చూస్తున్నారు.
వాళ్లు ఏడాదికి ఒకటి, తప్పితే రెండు సినిమాలకు మించి చేయలేకపోతున్నారు. టైమ్ సరిపోక కాదు..భయం..ఏ సినిమా ఎటెంప్ట్ చేస్తే, ఏమవుతుందో అని. తీరా బాక్సాఫీసు దగ్గర బకెట్ తన్నేస్తే, మార్కెట్ డౌన్ అయిపోతుందని. అందుకే ఆచి, తూచి, స్టోరీపై కసరత్తు చేసి, డైరక్టర్ ను ఏరి కోరి ఎంచుకుని సినిమా చేయాల్సి వస్తోంది. అంటే ఈ ఎనిమిది మంది కలిసి ఏడాదికి మహా అయితే డజను సినిమాలు చేస్తారు.మరి మిగిలిన ఎనబై పై చిలుకు సినిమాల సంగతి?
డైరక్టర్ల ఎదురు చూపులు
ఇలాంటి హీరోల కరుణా కటాక్షాల కోసం డైరక్టర్లు ఎదురు చూపులు తప్పడం లేదు. ఎంత పెద్ద హిట్ ఇచ్చినా వెంటనే సినిమా దొరుకుతుందన్న గ్యారంటీలేదు. లెజండ్ లాంటి హిట్ ఇచ్చిన బోయపాటి ఇంతవరకు సినిమా చేయలేదు. గబ్బర్ సింగ్ లాంటి కోట్లాది కోట్ల సినిమా చేసిన హరీష్ శంకర్ ఇప్పుడు అయిదారు కోట్ల సినిమా చేయాల్సివస్తోంది.
మినిమమ్ గ్యారంటీ వున్న డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి సినిమా చేసి ఎన్నాళ్లయింది? వివి వినాయక్ నాయక్ చేసిన ఏడాదిన్నరకు కానీ మళ్లీ సినిమా విడుదల కాలేదు. అదీ ఓ కొత్త నటుడితో. కొరటాల శివ మిర్చి సినిమా అందించి ఎన్నాళ్లయింది? బలుపు సినిమా చేసిన గోపీచంద్ మలినేని, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అందించిన మేర్లపాక గాంధీ, కార్తికేయ సినిమా చేసిన చందు మొండేటి..వీళ్లంతా మలిసినిమా ఎప్పుడు అందిస్తారు? ఎందుకు దర్శకులు కూడా ఏడాదికి, రెండేళ్లకు కానీ సినిమా అందివ్వలేకపోతున్నారు.
కారణం ఒక్కటే క్రౌడ్ పుల్లింగ్ హీరోల కొరత. వాళ్లతోనే సినిమాలు చేయాలి. వాళ్లతోనే సినిమాలు తీయాలి. వాళ్లకే డైరక్షన్ చేయాలి.దాంతో తమ వంతు వచ్చేవరకు వేచి వుండాలి. అది నిర్మాతయినా, డైరక్టర్ అయినా. పైగా హీరోలకన్నా హిట్ సమస్య నిర్మాతలకు, దర్శకులకే ఎక్కువ. పొరపాటున ఫ్లాప్ వస్తే, పాము నోట్లో పడ్డట్టే అడ్రస్ గల్లంతయిపోతుంది. శ్రీనివాసరెడ్డి, వీరభద్రమ్ చౌదరి, మెహర్ రమేష్, నాగేశ్వరరెడ్డి, నందినీ రెడ్డి ఇలా జాబితా పెద్దదే వుంది. వీళ్లంతా మరోచాన్స్ సంపాదించి మళ్లీ తమ సత్తా చూపించేందుకు కిందా మీదా పడుతున్నారు. అవకాశం రావాలి. దాన్ని ప్రూవ్ చేసుకోవాలి.
కానీ హీరోలకు కాస్త వెసులు బాటు వుంది. దాదాపు క్రౌడ్ పుల్లింగ్ హీరోలు అందరికీ స్వంత ప్రొడక్షన్ హవుస్ లు వున్నాయి. ఒక్క బాలయ్య బాబుకు, జూనియర్ ఎన్టీఆర్ కు తప్ప. మెగా క్యాంప్, అన్నపూర్ణ, సురేష్, మంచు ఫ్యామిలీ, నితిన్, ఇలా అందరికీ స్వంత సంస్థలు వున్నాయి. ఇది వాళ్లుక అడ్వాంటేజ్ గా మారింది. మంచి సబ్జెక్ట్ వున్న దర్శకుడిని వలేసి పట్టుకుని, సినిమా చేసుకోగలుగుతున్నారు. కానీ ఈ ప్రాసెస్ అంత సులువు కాదు. సినిమా హిట్ చేసిన దర్శకుడికి దాదాపు ఈ క్యాంప్ లన్నింటి నుంచి కబురు అందుతుంది. వీలైతే లక్ష, రెండు లక్షలు చెక్ కూడా చేతిలోకి వస్తుంది. కానీ సినిమా మాత్రం రాదు.
మాట ఇచ్చిన హీరోలకు నచ్చే సబ్జెక్ట్ వండివార్చడం కోసం ఈ దర్శకులు రాత్రింబవళ్లు కసరత్తు చేస్తూనే వుంటారు. అదృష్టం బావుండి మంచి పాయింట్ తడితే, సినిమా ఓకె అవుతుంది. కానీ అప్పుడు కూడా వెంటనే పట్టాలు ఎక్కదు. ఎందుకంటే అప్పటికే హీరో చేస్తున్న సినిమా, కమిట్ అయిన సినిమా రెడీగా వుంటాయి. దాని తరువాత వంతు. అంటే కనీసం రెండేళ్లు. పోనీ అలా కాకుండా ఏదో ఒక హీరోతో కాంప్రమైజ్ అయిపోదాం అంటే సినిమా ఆడుతుందో ఆడదో? ఓపెనింగ్స్ వస్తాయో రావో..అనుమానం..భయం..
ఇదీ పరిస్థితి. అంతవరకు డైరక్టర్లు వేచి వుండాల్సిందే. నిర్మాతల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. కాస్త మంచి సినిమా ఇచ్చిన ప్రతి దర్శకుడికి లక్ష, అయిదులక్షలు అడ్వాన్స్ ఇచ్చి వుంచడం. ఎందుకంటే, ఏ హీరో, ఏ డైరక్టర్ కావాలంటాడో. తీరా చేసి హీరో డేట్లు వుండి, డైరక్టర్ డేట్లు లేకుంటే పరిస్థితి కష్టమైపోతుంది. అందుకే అడ్వాన్సులు జల్లేసి వుంచడం.
హీరోలను, డైరక్టర్లను కలుపుతూ వుండడం, కథలు చెప్పిస్తూ వుండడం. ఎప్పటికో ఈక్వేషన్ కుదరాలి. అప్పుడు సినిమా ప్రారంభం కావాలి. అంతవరకు వడ్డీలు కట్టుకోవాలి. అందుకే ఇప్పుడు నిర్మాతలు పెద్ద సినిమాలు అంటే భయపడుతున్నారు. కాస్తలో కాస్త తమ ఇమేజ్ వాడుకుని, చిన్న సినిమా తీసి, కనీసం కోట్లు కాకున్నా ఆపీసు ఖర్చులు పోను లక్షో రెండు లక్షలోమిగిలితే చాలు అనుకునే పరిస్థితికి వచ్చేసారు. కేఎస్ రామారావు, లగడపాటిశ్రీధర్, సాయి కొర్రపాటి, బన్నీ వాసు, అల్లు అరవింద్, దిల్ రాజు, ఇలా అందరికీ చిన్న సినిమాల బాటే.
ఇలా రాసుకుంటూ పోతే, కెమిస్ట్రీ ఈక్వేషన్లలా సినిమా రంగంలో ఎన్ని ఈక్వేషన్లో. అదే నిజం అనుకుంటే, కాదనేది మరోటి,..కాదు ఇదే నిజం అనుకుంటే, అలా కాదు వేరేది అనేది ఇంకోటి. ఒకదానికి మరోదానికి పొంతనలేని ఈక్వేషన్లు.
అన్నింటి వెనుక మాత్రం ఒకటే..భయం..భయం..భయం.
సినిమా హిట్ కాదేమో అన్న భయం
పెట్టుబడి పైసలు వెనక్కు రావేమో అన్న భయం
సినిమా పోతే మరో సినిమా రాదేమో అన్న భయం..
అందుకే ఇప్పుడు పైకి ఎన్ని షోకులు చేసినా, పైకి ఎన్ని జిగజికలు కనిపిస్తున్నా, టాలీవుడ్ లో అందరివీ ఇప్పుడు భయం భయం బతుకులు.
చాణక్య