తెలంగాణ సర్కార్ విద్యుత్ షాక్ లు ఇప్పటిలో తప్పేలా లేవు. ఎందుకంటే ఆ రాష్ట్రం ఎదుర్కోంటున్న కరెంట్ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేకపోవడమే దీనికి కారణం. ప్రతిపక్షాలు విద్యుత్ కోతలనే బ్రహ్మాస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. తెలంగాణ ఏర్పడితే రైతుల ఆత్మహత్యలుండవని కేసిఆర్ కాకి లెక్కలెన్నో చెప్పి ఉద్యమంలో వారి మద్దతు కూడ గట్టారు. ఇప్పుడు తెలంగాణ రావడం, ఆయనే సర్కార్ ఏర్పాటు చేయడం జరిగిపోయింది. కాని సీన్ మాత్రం రివర్స్ అయింది. కరెంట్ కష్టాలు పెరిగాయి. ఈ అయిదునెలల్లోనే 354 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిపై అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడం మాటెలా ఉన్నా… ప్రజల్లో ఇప్పటికే టి సర్కార్ తీరుపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. అదృష్టం బాగుండి ప్రతిపక్షాలు దీనిని సరిగా ఉపయోగించుకోలేక ప్రజాక్షేత్రంలో ఎండగట్టలేకపోవడంతో కేసిఆర్ ప్రభుత్వం కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ. జనాల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహానికి మాత్రం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితులను గమనించే కేసిఆర్ చత్తీస్ ఘడ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్థుతానికి విపక్షాలను ఎదుర్కునేందుకు దీనిని కేసిఆర్ సర్కార్ ఉపయోగించుకున్నా… ఫలితం మాత్రం ఉండే పరిస్తితులు లేవు.
ఇదిలా వుంటే వెయ్యి మెగావాట్ల విద్యుత్ చత్తీస్ గడ్ నుంచి తెలంగాణకు రావడానికి ఎన్నో అవరోధాలు ఉన్నాయి. యుద్దప్రాతిపదికన అవరోదాలను తొలగించుకునేందుకు చర్యలు తీసుకున్నా… కనీసం 15 నుంచి 24 నెలలు పడుతుందంటున్నారు. అంటే ఈ రబీనే కాదు, మరో రెండు ఖరీఫ్ లు, రెండు రబీ పంటలకు కూడా కరెంట్ కష్టాలు తీరవు సరికదా మరింత పెరిగి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతాయి.
చత్తీస్ గడ్ నుంచి తెలంగాణ కు కరెంట్ రావాలంటే పలు అనుమతులు, ఒప్పందాలు అవసరం అని తెలుస్తోంది. వీటికే కనీసం అయిదారు నెలలు పడుతుంది. అవన్నీ అయ్యాకా చత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణకు విద్యుత్ లైన్ వేయాలి. దీని నిర్మాణానికి కనీసం రెండేళ్లు పట్టిందంటే… కేసిఆర్ ప్రభుత్వపు పుణ్యకాలం కాస్తా దగ్గర పడుతుంది. అఫ్పటి వరకు సమస్య తీవ్రమై అనర్థాలు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే తెలంగాణలో రబీహాలీడే ప్రకటించుకోవాలని స్వయంగా ప్రభుత్వమే రైతులకు విజ్ఞప్తి చేసిందంటే పరిస్థితి ఇప్పుడే రివర్స్ అయ్యేలా ఉంది.ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ తీసుకురావాలన్నా… సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కారణం ఇంకా కరెంట్ ఒప్పందమయితే అయింది కాని సాంకేతికంగా స్పష్టత రావాల్సి ఉంది. ధర విషయంలో ఇంకా చర్చలు జరగలేదు. ధర కుదరకపోతే చత్తీస్ ఘడ్ కరెంట్ ఇస్తుందా అన్నది కూడా అనుమానమే. యూనిట్ కు 20 రూపాయలు ఇచ్చైనా కొంటామని కేసిఆర్ చెబుతున్నా.. అది ఆచరణలో అంతగా సాధ్యమయ్యే విషయం కాదు.
ఖరీఫ్ లో పంటలు పోయి, రుణమాఫీ జరగక, కొత్త రుణాలు అందక నిండా మునిగిన రైతులు ఇప్పటికే ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతున్నారు. ఈ దశలో వారి ఆశలన్నీ రబీపైనే ఉన్నాయి. రబీలో పంటలు పండాలంటే పూర్తిగా భూగర్భజలాలపైనే ఆదారపడి ఉంటుంది. అంటే కరెంట్ తప్పనిసరి. వద్దన్నా ఇప్పుడు ఆలస్యంగా పడిన వర్షాలకు నిండిన జలాశయాలు, చెరువులు, కుంటల నీళ్లను ఉపయోగించుకుని పంటలు వేసుకునేందుకు రైతులు అప్పుడే సిద్ధమయ్యారు. అవి ఏపుగా పెరిగి చేతికి వచ్చే సమయానికి భూగర్భజలాల అవసరం ఏర్పడుతుంది. అప్పుడు కరెంట్ ఇవ్వలేకపోతే రైతుల్లో తీవ్రమైన నిరసన పెల్లుబుకడం ఖాయం . అందువల్ల అధికారం అందుకున్న కేసిఆర్ కు ఆ అధికారం పొడవునా కరెంటు షాక్ లు తప్పవు,