సచిన్ ను ఆ సెంచరీ మిస్ ఇంకా బాధపెడుతోందా!

టెండూల్కర్ ఇండియన్ క్రికెట్ ఎవరెస్ట్. అయితే కొంతమంది మాత్రం సచిన్ ను కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తారు. సచిన్ సెంచరీల కోసమే ఆడతాడనేది ఒక ప్రధానమైన ఆరోపణ. సెంచరీ కి దగ్గరపడే సరికల్లా టెండూల్కర్ ఆటతీరు…

టెండూల్కర్ ఇండియన్ క్రికెట్ ఎవరెస్ట్. అయితే కొంతమంది మాత్రం సచిన్ ను కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తారు. సచిన్ సెంచరీల కోసమే ఆడతాడనేది ఒక ప్రధానమైన ఆరోపణ. సెంచరీ కి దగ్గరపడే సరికల్లా టెండూల్కర్ ఆటతీరు మారిపోవడం… చాలా ఆలోచించి ఆలోచించి ఆడటం… ఎలాగైనా వందను పూర్తి చేయడానికి పాట్లు పడటం… ఇవన్నీ టెండూల్కర్ ఆటతీరులో కనిపిస్తుంటాయి. ఇలాంటి గాభరాతోనే టెండూల్కర్ 90 కి 100 కి మధ్య అనేక సార్లు వికెట్ పారేసుకొని ఉంటాడు.

ఇండియన్ డ్యాషింగ్ ఓపెనర్ అయిన సెహ్వాగ్ లాంటి వాళ్లు సిక్స్ కొట్టి సెంచరీని పూర్తి చేసిన ఉదంతాలను పోల్చి చూసినప్పుడు సచిన్ తీరు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. క్రికెట్ లో ఏ ఆటగాడికి అయినా వంద చాలా ప్రత్యేకమైనదే.. సెంచరీ సాధించడం గొప్ప గిఫ్టే! కాబట్టి సచిన్ అభిమానులు ఈ విషయంలో సమర్థింవచ్చు. 

అయితే కొన్ని సెంచరీ మిస్ లను మాత్రం టెండూల్కర్ ఇప్పటికి మరిచిపోలేదు. తనంతకు తాను 90 పరుగులు తర్వాత అనేక సార్లు ఔట్ అని టెండూల్కర్ ఒకే ఒక్కసారి.. కెప్టెన్ వల్ల డబుల్ సెంచరీ మిస్ అయిన వ్యవహారాన్ని మాత్రం ఇప్పటికీ మరిచిపోలేదు. తన ఆత్మకథలో కూడా సచిన్ ఆ వ్యవహారాన్ని ప్రస్తావించాడు.

చాలా సంవత్సరాల తర్వాత ఇండియన్ టీమ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ముల్తాన్ టెస్టుకు గానూ కెప్టెన్ గంగూలీ విశ్రాంతి తీసుకొన్నాడు. ద్రావిడ్ చేతికి పగ్గాలు వచ్చాయి. ఆ టెస్టులో ఇండియన్ టీమ్ పాక్ పై పూర్తిగా పట్టు సాధించింది. ఇటువంటి నేపథ్యంలో టెండూల్కర్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు ద్రావిడ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు!

మరో ఆరు పరుగులు చేస్తే.. సచిన్ డబుల్ సెంచరీ పూర్తి చేస్తాడనంగా ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ద్రావిడ్. బహుశా ద్రావిడ్ దృష్టిలో ఆ డబుల్ సెంచరీ అనేది పెద్ద విషయం కాదేమో కానీ.. టెండూల్కర్ మాత్రం అప్పట్లో చాలా బాధపడ్డాడట!

ద్రావిడ్ అలా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి తమను మైదానం నుంచి వచ్చేయమనే సరికి తను షాక్ కు గురైనట్టుగా టెండూల్కర్ తన ఆత్మకథలో పేర్కొన్నాడు. ఆ తర్వాత కోచ్ జాన్ రైట్ వచ్చి తనకు సారీ చెప్పాడని.. ఒకవేళ తప్పులేదనుకొంటే కోచ్ సారీ ఎందుకు చెబుతాడు? అని టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. కానీ ద్రావిడ్ తో మాత్రం ఆ ఉందంతం తర్వాత యథావిధిగా సంబంధాలు కొనసాగాయని సచిన్ వివరించాడు. 

మరి తన కెరీర్ లో ఎన్నో సెంచరీలు చేసి.. వంద సెంచరీలతో ప్రపంచ రికార్డు సృష్టించిన సచిన్ ఆరు పరుగుల తేడాతో మిస్ అయిన డబుల్ మాత్రం మరిచిపోలేదనమాట. ఆ రోజు తను బాధపడ్డానని ఆత్మకథలో కూడా పేర్కొని… ఒక విధంగా ద్రావిడ్ నిర్ణయాన్ని తప్పుపట్టాడు! ఒకవేళ ఆ విషయాన్ని తేలికగా తీసిపడేసింటే.. ద్రావిడ్ నిర్ణయంలో తప్పేమీ లేదని ఉంటే… ఎన్నో సెంచరీలు చేసిన తనకు ముల్తాన్ లో మిస్ అయిన డబుల్ పెద్ద విషయం కాదని అని ఉంటే…!