విశాఖను వదలనంటున్న ఒరిస్సా

అవును నిజమే…విశాఖను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమంటున్నారు ఒరిస్సా ఎంపీలు. ఒరిస్సా ఏమిటి,.విశాఖ వదులు కోవడం ఏమిటి అన్న కన్ఫ్యూజన్  వద్దు..ఇదంతా రైల్వే డివిజన్ సంగతి. విశాఖ ను కేంద్రంగా వేరే జోన్ ఏర్పాటు…

అవును నిజమే…విశాఖను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమంటున్నారు ఒరిస్సా ఎంపీలు. ఒరిస్సా ఏమిటి,.విశాఖ వదులు కోవడం ఏమిటి అన్న కన్ఫ్యూజన్  వద్దు..ఇదంతా రైల్వే డివిజన్ సంగతి. విశాఖ ను కేంద్రంగా వేరే జోన్ ఏర్పాటు  చేయాలన్న డిమాండ్ ఇవాల్టినిన్నటిది కాదు. కానీ చిరకాలం బెంగాల్ వారి కౌగిలిలో నలిగిన విశాఖ రైల్వే డివిజన్ ను కొన్నాళ్ల క్రితం తెలివిగా తప్పించి, భువనేశ్వర్ కేంద్రంగా  మరో డివిజన్ ఏర్పాటు చేసేసారు. ఆ విధంగా మరీ పెద్ద జోన్ అనిపించుకోకుండా, మరోసారి విశాఖను వేరు చేయాలన్న డిమాండ్ మరోసారి రాకుండా తెలివిగా జాగ్రత్త పడ్డారు. అయితే విశాఖ వాసులు ఎప్పటి నుంచో తమ డిమాండ్ వినిపిస్తూనే వున్నారు. కానీ ఒరిస్సా ప్రజా ప్రతినిధుల స్టామినా ముందు మన ప్రజాప్రతినిధుల వాయిస్ వినిపించలేదు.

ఇదిలా వుంటే విభజన సందర్భంగా మరోసారి రైల్వేజోన్ వ్యవహారం తెరపైకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే తెలంగాణకు వుండిపోవడంతో విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేస్తామని విభజన నాడు కేంద్రంలోని పెద్ద మనుషులు మాట ఇచ్చారు. అయితే ఆ మాట మేరకు కమిటీ వేసారు. ఏడుగురు సభ్యులు. వీరిలో ఇధ్దరు సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి, ఇద్దరు తూర్పు కోసాత రైల్వే  జోన్ నుంచి,. నలుగురు రైల్వే బోర్డు నుంచి. దాంతో కథ మళ్లీ తెలంగాణ-ఆంధ్ర విభజన మాదిరిగానే తయారైంది. ఎస్ సి రైల్వే వారు ఓకె అని తూర్పు కోస్తా రైల్వేవాళ్లు నాట్ ఓకె అని బిగుసుకు కూర్చున్నారు. మరోపక్క ఎట్టి పరిస్థితుల్లోను విశాఖ డివిజన్ ను తమ జోన్ నుంచి వేరు చేయడానికి వీలు లేదని ఒరిస్సా ఎంపీలు పట్టుపడుతున్నారు. ఇప్పుడు అసలు కొత్త జోన్ ఏర్పాటు కావాలా వద్దా అన్నది సీల్డుకవర్ లో పెట్టేసారట. అది ఎప్పుడు తెరుస్తారో?

అసలు సమస్య

అసలు ఒరిస్సా ఎంపీలు, అధికారులు విశాఖపై ఇంత పట్టుపట్టడానికి కారణం ఇక్కడి ప్రయాణీకులపై ప్రేమ అనుకుంటే పొరపాటే. వారికి ఎప్పుడు ఇక్కడి ప్రయాణీకులకు సరిపడా రైళ్లు ఏర్పాటు పై సరైన దృష్టిలేదు. పైగా సౌత్ సెంట్రల్ రైల్వే ముందుకువచ్చి అడిగినా,. వారు సహకరించిన దాఖలాలు చాలా చాలా తక్కువ. అందుకే ఈ బాధ పడలేక, ద. మ. రైల్వే తన స్పెషల్ రైళ్ల కోసం ఆ రైల్వే జోన్ అధికారులను సంపద్రించడం తగ్గించేసింది. హైదరబాద్ నుంచి కాకినాడ వరకు తన రైళ్లు తాను నడిపేసుకుంటోంది. దీనికి ఎవరితోనూ సంప్రదింపులు అక్కరులేదు.

అయితే మరెందుకు ప్రేమ అంటే, ఇక్కడ రవాణా ఆదాయంపై. విశాఖ కేంద్రంగా రైల్వే ద్వారా సరకు రవాణా ఆధాయం చాలా ఎక్కువ. ముఖ్యంగా ఖనిజ రవాణా. ఆపై బొగ్గు, ఆయిల్ రవాణా. ఈ ఆదాయం అంతా ఇప్పుడు తూర్పుకోస్తా జోన్ కు వెళ్తోంది. ఇప్పుడు విశాఖను విడదీస్తే,దాని ఆదాయం ఢమేల్ అంటుంది. దాంతో అక్కడి స్టేషన్లు, అభివృద్ధి, ఖర్చలు అన్నీ ఆగిపోతాయి. అదీ అసలు బాధ.

సందట్లొ సడేమియా

ఈ సమస్య ఇలా వుండగానే, చుయ్,..అంటే విజయవాడ అన్నట్లు..ప్రవర్తిస్తున్న కొందరు రాజకీయ ప్రముఖలు విజయవాడ కేంద్రంగానే కొత్త జోన్ ఏర్పాటుకు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారని వినికిడి. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు మూడు డివిజన్లుకు విజయవాడ దగ్గరగా వుంటుంది. విశాఖ ఓ మూలగా వుంది. రాజధాని విషయంలో కూడా దానికి అదే మైనస్ పాయింట్ అయి కూర్చుంది. 

ఇప్పుడు ఈ మూడు డివిజన్ ల్లోని కొన్ని ప్రాంతాలు కలిపి కొత్త జోన్ కనుక చేస్తే, అది విజయవాడ కేంద్రంగా అయితే పక్కా సెంటర్ గా వుంటుందని, పైగా విజయవాడ దేశంలోని కీలక రైల్వే జంక్షన్ కనుక, ఇదీ అక్కడే అయితే మరింత సముచితంగా వుంటుందని తెరవెనకు పావులు కదుపుతున్నారట. బయటకు అంటే ఎక్కడ ఉత్తరాంధ్ర వాసులు బాధపడతారో అని, ఈ నిర్ణయం తమది కాదు, కేంద్రానిది అని అనిపించాలని యత్నిస్తున్నారట. విశాఖ ప్రజా ప్రతినిధుల్లొ విశాఖ స్థానికులను ఎలాగూ కాగడా పెట్టి వెదకాలి కాబట్టి, ఎవరూ పెద్దగా అభ్యతంరం చెప్పకపోవచ్చు. పైగా బుడిబుడి స్టేట్ మెంట్లు పడేయచ్చు. ఆ విధంగా ఉత్తరాంధ్ర వారికి వచ్చే ఉద్యోగావకాశాలు తగ్గినా తగ్గొచ్చు.

సరే ఈ సందడి అలా వుంటే ఒరిస్సా ఒత్తిడి అలా వుంది. మొత్తానికి మధ్యన నలుగుతున్నది విశాఖ.

చాణక్య

[email protected]