మేరఠ్ రేప్ కేసులో కొత్త మలుపు

మేరఠ్ రేప్ కేసు గురించి ఇదే శీర్షికలో ఆగస్టులో రాయడం జరిగింది. గుర్తు చేయాలంటే – జులై నెలాఖరులో సరావా గ్రామానికి చెందిన ఒక నరేంద్ర త్యాగి అనే పెద్దమనిషి పోలీసు స్టేషన్‌కి వచ్చి…

మేరఠ్ రేప్ కేసు గురించి ఇదే శీర్షికలో ఆగస్టులో రాయడం జరిగింది. గుర్తు చేయాలంటే – జులై నెలాఖరులో సరావా గ్రామానికి చెందిన ఒక నరేంద్ర త్యాగి అనే పెద్దమనిషి పోలీసు స్టేషన్‌కి వచ్చి తన 20 ఏళ్ల కూతురుకి ఒక ముస్లిం స్నేహితురాలు వుందని, ఆమె ప్రోద్బలంతో ఒక మదరసా (ముస్లిం పాఠశాల)లో హిందీ టీచరుగా చేరిందని, కనబడటం లేదని ఫిర్యాదు చేశాడు. తర్వాత కొన్ని రోజులకు జులై 23న మదరసా నడిపే సలాలుల్లా, అతని భార్య, కూతురు, గ్రామ ప్రధాన్ నవాబ్‌ఖాన్ సాయంతో తన కూతుర్ని ఎత్తుకుపోయి మదరసాలోబంధించి, అత్యాచారం జరిపించారని, ఆతర్వాత మతం మార్చుకుంటున్నట్లు బలవంతంగా కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించాడు. తన కూతురు వారి నుండి ఎలాగోలా తప్పించుకుని జులై 30 న ఇంటికి వచ్చి, తమకు చెప్పిందని, వైద్యపరీక్షలు చేయిస్తే రేప్ జరి గిందని, పొట్టమీద కోతలు కనబడ్డాయని చెప్పారన్నారు. ఈ విషయం బయటకు రాగానే యధావిధిగా అరెస్టులు, ప్రతి పక్షాల ఆందోళనలు, ఖండనలు, పార్లమెంటులో బిజెపి-ఎస్పీసభ్యుల వాదోపవాదాలు, ముఖ్యమంత్రి విచారణకు ఆదేశిం చడాలు అన్నీ జరిగాయి. 

బదాయూ కేసులో ముఖ్యమంత్రి కులస్తులు దోషులైతే, ఈ కేసులో అతని పార్టీకి దన్నుగా నిలిచే ముస్లిములుదోషులు. మతాంతీకరణ కోణంకూడా వుండడంతో ఇది హిందూ-ముస్లిం గొడవలకు దారి తీసేట్లు తోచింది. దీనిపై చాలామంది సాధారణపౌరులు కూడాఆవేశపడ్డారు. పోలీసువిచారణ ప్రారంభమయ్యేసరికి మరోకోణం తొంగి చూసింది. జరిగినదేమిటంటే – ఈ అమ్మాయి కలీమ్ అనే ముస్లిం అబ్బాయితో ప్రేమలో పడి గర్భవతి అయింది. ఫాలోపియన్ ట్యూబుల్లో ఒకదానిలో పిండం చేరడంతో 45 రోజులయ్యేసరికి కడుపులో నెప్పి వస్తూంటే కలీమ్‌తో సహా గైనికాలజిస్టును కలిసి ఆమె సలహాతో ఆపరేషన్ చేయించుకుందామనుకుంది. జులై 23న ఇంట్లో చెప్పకుండా కలీమ్‌తో కలిసి మేరఠ్ వెళ్లి మెడికల్ కాలేజీ హాస్పటల్‌లో ఆపరేషన్ చేయించుకుంది. ‘భర్త’ హోదాలో కలీమ్ ఆపరేషన్‌కు అనుమతి పత్రం రాసిచ్చాడు. జులై 27 వరకు ఆమె ఆసుపత్రిలోనే వుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఏ కహానీ చెప్పిందో తెలియదు. 

అయితే ఆపరేషన్ తర్వాత ఇన్‌ఫెక్షన్ రావడంతో ఆమె జులై 29న మళ్లీ ఇంట్లోంచి బయటకు వెళ్లి చికిత్స చేయించుకుని మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఈ సారి మళ్లీ కూతురు కనబడకపోవడంతో తండ్రి కనబడటం లేదని ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత మదరసాలో అత్యాచారం జరిగిందని ఆరోపించడం జరిగాయి. ఈ అమ్మాయిని పోలీసులు విచారించినపుడు మొదట్లో తనను నలుగురు రేప్ చేసి ఒక వ్యాన్‌లో పడేసి ముజఫర్ నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లి హడావుడిగా ఆపరేషన్ చేయించేశారని చెప్పింది. (రేప్ చేస్తే ఆపరేషన్ చేయించడం దేనికిట? అని పోలీసులకు అనుమానం వచ్చింది) సెల్‌ఫోన్‌లో అనేక సార్లు సంభాషించిన కలీమ్ పేరు అస్సలు చెప్పలేదు. ఆపరేషన్ చేసినది మేరఠ్ ఆసుపత్రిలో అని తెలియగానే అనుమానం కలిగింది. తీగలాగి డొంక కదిల్చారు. అక్టోబరు రెండో వారంలో ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి పత్రికల వాళ్లను పిల్చి ‘‘నేను కలీమ్‌ను ప్రేమిస్తున్నాను. మా ఇంట్లో వాళ్లకు ఇది ఇష్టం లేక నన్ను కొట్టి, చంపుతామని బెదిరించి నా చేత తప్పుడు ఆరోపణలు చేయించారు. అంతా అబద్ధం.’’ అని చెప్పేసింది. అలా బెదిరించినందుకు తల్లిదండ్రులపై పోలీసులు కేసు పెట్టించారు. అది పట్టుకుని మీడియా ఆమె తండ్రిని నిలదీసింది. 

ఇక తట్టుకోలేక అతను ‘‘తన నిర్ణయాలు తను తీసుకునే వయసు ఆమెకుంది. తన కిష్టం లేని పని చేయించడానికి మేమెవరం? ఇది మరో ‘లవ్ జిహాద్’ కేస్ అయినా ఏం చేయగలం? కలీమ్‌ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే చేసుకోమను. తను ఇక్కడకు రావలసిన పని లేదు. మాకూ, తనకూ సంబంధం తెగిపోయింది. ఎక్కడో అక్కడ హాయిగా వుంటే అంతే చాలు.’’ అన్నాడు. ‘‘మరి మీరు ఒత్తిడి చేసి తప్పుడు కేసులు పెట్టించారట, దాని సంగతేమిటి?’’ అంటే ‘‘తను మా బిడ్డ, తన వ్యక్తిగత జీవితాన్ని బజార్లోకి లాగాలని చూడం. అయితే కొన్ని రాజకీయపార్టీలు పని గట్టుకుని మా దగ్గరకు వచ్చి దీనిలోంచి లాభం పొందుదామని చూశాయి. పరిస్థితి అర్థం చేసుకుని మా అమ్మాయి మాపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి.’’ అని చెప్పాడు.  అయితే మేరఠ్ బహన్ బేటీ బచావో ఆందోళన్ వంటి హిందూత్వ సంస్థలు త్యాగిని వదిలిపెట్ట దలచుకోలేదు. అతని ఇంటికి వెళ్లి ‘‘నువ్విలా మధ్యలో జారిపోతే ఎలా? ఒక లవ్ జిహాదీ చేతికి నీ కూతుర్ని అప్పగించేస్తావా? ఇలా అయితే ఊళ్లో తక్కిన హిందూ బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. త్యాగి కూతురు ఆయనేక కాదు, మా వూరికే కూతురు. ఆమె గౌరవమే మా గౌరవం. ఇది యావత్తు హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం.’’ అంటూ వాదిస్తున్నారు. ఆత్మగౌరవం కాపాడుకోవడానికి వేరే మార్గాలు వెతుక్కోవాలి కానీ ఇలా అబద్ధపు కేసులు పెడితే వున్న గౌరవం పోతుంది కదా!

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]