వరల్డ్ కప్ క్రికెట్‌లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. నాలుగు మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. పైగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లన్నీ 300, ఆ పై పరుగులు చేయడం గమనార్హం. ఓడిన జట్లన్నీ 200 దాటి, 300 పరుగుల లోపే చేశాయి.
ఇప్పుడంతా వీరబాదుడు క్రికెట్ కావడంతో 400 పరుగులు టార్గెట్ వున్నా, అలవోకగా కొన్ని జట్లు వాటిని ఛేదించేస్తున్నాయి. అయినా విచిత్రంగా వరల్డ్ కప్‌లో 300 పరుగుల టార్గెట్‌ని ఛేదించలేకపోవడమేంటోగానీ.. 300 కొడితే గెలిచినట్లే.. అన్న వాదనకు అనే జట్లు ఫిక్స్ అయిపోతున్నాయి. టాస్ గెలిస్తే బ్యాటింగే.. 300 దాటించేయగలిగితే.. ప్రత్యర్థిని కట్టడి చేయొచ్చు.. అని క్రికెట్ విశ్లేషకులూ అభిప్రాయపడ్తున్నారు.
న్యూజిలాండ్ – శ్రీలంక, ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్, సౌతాఫ్రికా – జింబాబ్వే, భారత్ – పాకిస్తాన్.. ఇలా నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. న్యూజిలాండ్ 332 కొడితే, శ్రీలంక 233 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా 300 దాటిస్తే, శ్రీలంక 300 దాటలేక చతికిలపడింది. సౌతాఫ్రికా 300పైగా పరుగులు చేస్తే, పసికూన జింబాబ్వే, కాస్త కంగారు పెట్టినా సౌతాఫ్రికానే విజయతీరాలకు చేరింది. భారత్ – పాక్ సంగతి సరే సరి. భారత్ సరిగ్గా 300 పరుగులు చేస్తే, విజయానికి 301 పరుగులు చేయాల్సిన పాకిస్తాన్ 224 పరుగలకు ఆలౌట్ అయ్యింది.
ఇప్పటికైతే పరిస్థితి ఇది. ముందు ముందు చాలా మ్యాచ్‌లు జరగనున్నాయి.. నరాలు తెగే ఉత్కంఠ ప్రతి మ్యాచ్‌లోనూ వుంటుంది. అనేక రికార్డులూ బద్దలవుతాయి.. 300 కాదు కదా, 400 దాటేయడమూ జరగొచ్చు.. ఏమో.. 500 పరుగులు ఏదన్నా జట్టు టచ్ చేసినా చెయ్యొచ్చు. క్రికెట్ అంటేనే అంచనాలకు అందని రికార్డులకు వేదిక. చూద్దాం.. ఏం జరుగుతుందో.!