చిన్నదైనా పెద్దదైనా విజయం విజయమే. కెన్యా మీద గెలుపూ లెక్కే.. ఆస్ట్రేలియా మీద గెలుపూ లెక్కే. అయితే గెలుపులో స్పెషల్ కిక్ ఇచ్చేది మాత్రం పాకిస్తాన్ మీద గెలిచినప్పుడే లభిస్తుంది భారత క్రికెట్ అభిమానులకి. ఆ మాటకొస్తే, ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. నలభై ఐదు వేల మంది ప్రత్యక్షంగా.. కోట్లాది మంది టీవీ సెట్లలో ఇండియా – పాకిస్తాన్ వరల్డ్ కప్‌లో తలపడ్డ మ్యాచ్‌ని తిలకించారు.
బంతి బంతికీ మైదానం మార్మోగిపోయింది. పరుగు పరుగుకీ దిక్కులు పిక్కటిల్లేలా భారత్, పాక్ అభిమానులు నినదించారు. అబ్బో.. ఆ మజా గురించి ఏం చెప్పగలం.? ఎంతని చెప్పగలం.? ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది ఆ సంబరం. పాకిస్తాన్ మీద టీమిండియా గెలుపు కష్టమేమీ కాదని భారత క్రికెట్ అభిమానులంతా నమ్ముతారు. వరల్డ్ కప్ పోటీల్లో టీమిండియాకి వున్న రికార్డ్ కారణంగానే ఆ నమ్మకం. కానీ, ఎక్కడో ఏదో ఒక మూల, తేడా కొడ్తుందేమోనన్న ఆందోళనా లేకపోలేదు.
ఈక్వేషన్స్ మారలేదు.. సెంటిమెంట్ మారలేదు.. పాకిస్తాన్‌పై టీమిండియా గెలుపూ ఆగలేదు. కొత్తగా వచ్చిన రికార్డ్స్ ఏంటంటే.. పాకిస్తాన్‌పై వరల్డ్ కప్‌లో భారత్‌కి 300 పరుగుల స్కోర్ అత్యధికం. దాంతోపాటుగా కోహ్లీ సెంచరీ. కొత్త రికార్డులొచ్చాయి తప్ప, ఇంకేదీ తేడాగా జరగలేదు. వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్‌పై గెలిచిందీ.. అనగానే ఒక్కసారిగా భారతదేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. గల్లీ గల్లీల్లో క్రికెట్ అభిమానులు మువ్వన్నెల జెండా పట్టుకుని తిరిగారు. బాణా సంచా పేల్చారు.
భారత క్రికెట్ అభిమానుల హంగామా చూస్తోంటే, ఫైనల్ మ్యాచ్ గెలిచి, కప్‌ని టీమిండియా మళ్ళీ తీసుకొచ్చేసిందన్నంత సందడీ కన్పించిందనే చెప్పాలి. పాక్‌పై టీమిండియా ఎప్పుడు గెలిచినా అది ప్రత్యేకమే. ఇరు దేశాల మధ్య జరిగే సిరీస్ కావొచ్చు.. ట్రై సిరీస్ కావొచ్చు.. అండర్ 19 పోటీలు కావొచ్చు.. ట్వంటీ ట్వంటీ మ్యాచ్ కావొచ్చు.. టెస్ట్ మ్యాచ్ కావొచ్చు.. అదే స్పెషల్. అదే టెన్షన్. అదే సందడి. ఇక వరల్డ్ కప్ ఇంకెలా వుంటుంది.? ఎలా వుండాలో అలాగే వుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే టీమిండియా వరల్డ్ కప్ సాధించినంతటి గెలుపు సందడి పాకిస్తాన్‌పై ఈ రోజు టీమిండియా గెలవడంతో నెలకొంది. ఘనవిజయంతో వరల్డ్ కప్ పోటీల్లోకి అడుగు పెట్టిన టీమిండియా, లీగ్ దశని దాటేయడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగని, ఏ మ్యాచ్‌నీ లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఇదే కాన్ఫిడెన్స్‌తో.. సక్సెస్ ఇచ్చిన ఎనర్జీతో.. టీమిండియా ఈసారీ వరల్డ్ కప్‌ని సొంతం చేసుకోవాలని ఆకాంక్షిద్దాం.