జగ్మోహన్ దాల్మియాకు అత్యంత ఇష్టుడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. టీమిండియాకు గంగూలీ సారధిగా ఉన్న రోజుల్లో జగ్మోహన్ దాల్మియా బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉండేవాడు. ప్రతి విషయంలోనూ దాదా కు పూర్తి సహకారాన్ని అందించాడు. బీసీసీఐని లాభాల బాట పట్టించి.. ప్రపంచ క్రికెట్ లో గొప్ప శక్తిగా ఎదిగేందుకు పాటుపడ్డ వ్యక్తిగా దాల్మియాకు… ఆట విషయంలో టీమిండియాను ఆగ్రెసివ్ గా తీర్చిదిద్దిన కెప్టెన్ గా గంగూలీకి తిరుగులేని ఇమేజ్ ఉంది. 2003 సమయం ఈ ఇద్దరి కాంబినేషన్ కూ పీక్ స్టేజ్.
ఆ తర్వాత బెంగాలీ బాబు దాల్మియా స్థానంలో బీసీసీఐకి కొత్త అధ్యక్షులు రావడంతోనే గంగూలీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. కెప్టెన్సీ నుంచి తప్పించారు.. జట్టులో స్థానం లేకుండా చేశారు. ఆ తర్వాత మళ్లీ దాదా ఆటగాడిగా జట్టు స్థానం సంపాదించుకొని.. సగౌరవంగా వైదొలిగాడు.
మరి ఇప్పుడు మళ్లీ దాల్మియా బీసీసీఐ ప్రెసిడెంట్ గా రావడంతో బెంగాల్ టైగర్ కు కాలం కలిసొస్తున్నట్టుగానే ఉంది. ఐపీఎల్ పాలకమండలిలో సౌరవ్ కు స్థానం కల్పించనున్నాడట దాల్మియా. మాజీ ఆటగాడిగా.. ఇండియన్ క్రికెట్ కు కొత్త దారి చూపిన కెప్టెన్ గా పేరున్న గంగూలీ స్థాయికి ఇది తగిన సత్కారమే. అయితే ఇది ఇంతటితో ఆగకపోవచ్చు. దాల్మియా బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నంతలోనే గంగూలీకి భారత క్రికెట్ మరిన్ని కీలక బాధ్యతలు దక్కే అవకాశాలున్నాయి. అవి ఏ స్థాయిలో ఉంటాయో చూడాలంతే.