మెగా ఫ్యామిలీ ఇమేజ్ దన్ను చూసుకుని, కొత్త కుర్రాడని చూడకుండా, రామ్ తో చేసిన దేవదాస్ మాంచి లాభాలు ఇచ్చిందని, బ్లెండ్ గా రేయ్ ప్రాజెక్టులోకి దూకేసాడు వైవిఎస్ చౌదరి. అయితే అక్కడున్న స్క్రిప్ట్ బలం ఇక్కడ లేకపోవడం, సినిమాకు సవాలక్ష కష్టాలు రావడంతో రేయ్ సినిమా జనాలకు చేరువ కాలేకపోయింది.
దీంతో సుమారు ఇరవై కోట్లకు పైగానే నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. సినిమాకు ముఫై కోట్ల వరకు ఖర్చు కావడం, వడ్డీలు తడిసి మోపెడు కావడం తప్పలేదు. ఎంత ఫైనాన్షియర్లు కాస్తో, కూస్తో సడలించినా, ఎన్నివిధాల ఎవరు ఆదుకున్నా, చౌదరికి నష్టాలు కాస్త భారీగానే చుట్టుముట్టాయని వినికిడి. పెద్ద డైరక్టర్లు ఎవరు స్లంప్ లోకి వెళ్లి స్వంత సినిమాలు తీసినా, కాస్త బడ్జెట్ చూసుకుని, చిన్న, మీడియం సినిమాలే తీస్తారు. కానీ చౌదరి స్టయిల్ వేరు.
మొదట్నించీ ఆయన దర్శక నిర్మాత. భారీ సినిమాలు చేయడం తప్ప చిన్న సినిమాలు అలవాటు లేదు. ఆ అలవాటుతోనే, ఆ ధీమాతోనే ముందుకు వెళ్లిపోయారు. కానీ అన్ని రోజులు ఒకలా వుండవు..అన్ని సినిమాలు ఒకలా ఆడవు. రేయ్ ఫలితంతో, మరి ఇప్పట్లో వైవిఎస్ చౌదరి నుంచి సినిమా రావడం అంటే కష్టమే. ఎవరైనా నిర్మాత దొరికితే తప్ప.