అధికారం బదిలీ చాలా క్లిష్టమైన పని. 562 సంస్థానాలు యూనియన్లో కలవాలి. సివిల్ సర్వీసెస్, మిలటరీ అన్నిటినీ ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య విభజించాలి. 1947 ఏప్రిల్‌లో బ్రిటీషు కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ ఆచిన్ లెక్ ఇండియన్ ఆర్మీని విడగొట్టడానికి 5 నుండి 10 సంవత్సరాలు పడుతుందన్నారు. బ్రిటిషువారు ఇండియన్ ఆర్మీని విడిచి వెళ్లిపోతే అది మతపరంగా చీలిపోయే ప్రమాదం ఉందని మౌంట్‌బాటెన్ జిన్నాను హెచ్చరించారు. అయినా బ్రిటిషువారు ఆర్మీని తక్షణం విడగొట్టి వెళ్లిపోవలసిదేనని జిన్నా పట్టుబట్టారు. విడగొట్టగానే అనుకున్నట్టే మతపరంగా చీలిపోయింది. నిష్పక్షపాతంగా రక్షించేవారే లేకపోయారు. పంజాబ్‌లో 55,000 సైన్యం ఉన్నా హింసను అణచలేకపోయింది. బెంగాల్ కంటె పంజాబ్ విభజన వివాదాస్పదం అయింది. దానికి కారణం అప్పటికప్పుడు సరిహద్దులు గీయబూనడం. దానికోసం సర్ రాడ్‌క్లిఫ్ అనే బ్రిటిషు న్యాయవాదిని తీసుకొచ్చారు. ఆయనకు ఇండియా గురించి ఏమీ తెలియదు. అదే ఆయన అర్హత అన్నారు. ఏ గ్రామం ఏ దేశంలో చేరాలన్న విషయంపై ఆయనకిచ్చిన సహాయకులు కూడా వేర్వేరుగా, రకరకాలుగా సలహాలివ్వసాగారు. బయట నిరసన ప్రదర్శనల సంగతి సరేసరి. ఇక ఇలా లాభం లేదని ఆయన మ్యాప్ దగ్గర పెట్టుకుని సగటున రోజుకి 48 కి.మీ. చొప్పున సరిహద్దు రేఖ గీసుకుంటూ పోయాడు. క్షేత్రస్థాయిలో పరిశీలన లేదు.
దేశసరిహద్దులనేవి ఎంతో ముఖ్యమైన విషయం. దాన్ని యింత హడావుడిగా, అశాస్త్రీయంగా తెమిల్చేస్తే విద్వేషాలు రగలడంలో ఆశ్చర్యం ఏముంది? గ్రామాలలోని ప్రజలు ఉగ్గబట్టుకుని రోజువారీ రాడ్‌క్లిఫ్ ప్రకటనలకై ఎదురుచూస్తూ వుండేవారు. ఇండియాకు ఎలాట్ చేశారనగానే ముస్లిములు భయపడి పారిపోయేవారు, పాకిస్తాన్‌కు ఎలాట్ చేశారనగానే హిందువులు పారిపోయేవారు. తాతల కాలం నాటి నుండి తామున్న ఊరు హఠాత్తుగా పరదేశం అయిపోతూండడం, అవతలివాళ్లు యిళ్ల మీద పడి 'ఇంకా యిక్కడున్నారేం? మీ దేశం పొండి' అని దాడి చేయడం చూసి వారికి మతులు పోయాయి. చేతికి అంకినంతవరకు చేతపట్టుకుని, పిల్లాపాపలతో భయభీతులై పారిపోసాగారు. పారిపోయేవారిపై దారి పొడుగునా అల్లర్లు, హత్యలు జరిగేవి. ''ట్రైన్ టు పాకిస్తాన్'' నవల యీ దృశ్యాలను యథాతథంగా వర్ణించింది.
అరవై లక్షల హిందువులు, సిక్కులు పశ్చిమ పంజాబ్, సింధు రాష్ట్రాల నుండి ఇండియాలోని తూర్పు పంజాబ్‌కు తరలివచ్చారు. అరవై లక్షల ముస్లిములు ఇటునుండి అటు వెళ్లారు. ఒక్కొక్క శరణార్థుల గుంపు వస్తున్నకొద్దీ వారి బాధలు తెలియడం, ఉద్రిక్తతలు పెరగడం జరిగింది. 1947 సెప్టెంబరులో గాంధీ ఢిల్లీ చేరేనాటికి ఆ నగరమంతా శరణార్థుల హాహాకారాలతో దద్దరిల్లుతోంది. జరిగినవి మర్చిపోయి క్షమించమని గాంధీ ఇచ్చిన సలహా వారిని మండించింది. వారాయనను అసహ్యించుకున్నారు. 'వాళ్ల హింస ముందు మీ అహింస బలాదూరయ్యింది' అంటూ మండిపడ్డారు. అనేక కారణాల చేత ఢిల్లీ భగ్గుమంటోంది. ఎటు చూసినా శరణార్థుల శిబిరాలే, హాహాకారాలే. ''బునియాద్'' టీవీ సీరియల్‌లో వీటిని కళ్లక్కట్టినట్లు చూపించారు. ఢిల్లీ పరిస్థితిని చల్లార్చే పనిలో పడి గాంధీ పంజాబ్ వెళ్లలేకపోయాడు. ఇలాటి శిబిరాల్లో తిరిగిన గోడ్సే ఆవేశానికి లోనయి తీవ్రచర్యకు పాల్పడ్డాడని మనం గ్రహించాలి.
మనం భారతీయులం, అధికశాతం మంది హిందువులం. ఇక్కడి పత్రికలే, యిక్కడి పుస్తకాలే చదువుతాం. అందువలన హిందూ శరణార్థుల కడగండ్లే మనకు తెలుసు, అవే గుర్తుంటాయి. కానీ గ్రహించవలసినదేమిటంటే విభజనబాధిత శరణార్థుల్లో ముస్లిములు కూడా వున్నారు. వారి వ్యథాగాథలు మన చెవులకు తాకవు. ఏడాదిగా ముస్లిములు చెలరేగి తమను చంపుతూ వుంటే హిందువులు పౌరుషహీనులై చేతులు ముడుచుకుని కూర్చున్నారని అనుకోవడం అసహజం. హింసాప్రవృత్తి హిందువుల్లోనూ వుందని చరిత్ర చెపుతూనే వుంది. బౌద్ధులతో, జైనులతో ఘర్షణలు, కులఘర్షణలు, సజీవదహనాలు, బలాత్కారాలూ ముందూ జరిగాయి, వెనకా జరిగాయి. కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్‌లో యిళ్లూ, ఆస్తులూ, పోగొట్టుకుని ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయి వచ్చిన హిందూ, శిఖ్కు శరణార్థులు ప్రతీకారేచ్ఛతో ఎలా రగులుతూ వుంటారో సులభంగా వూహించవచ్చు. ముస్లిములు అక్కడ తమను తరిమివేశారు కాబట్టి, యిక్కడి ముస్లిములను అక్కడికి తరిమివేసి తమకు ఆశ్రయం కల్పించాలని వారి డిమాండ్. ఎవరు చెప్పినా వినే స్థితిలో వారు లేరు. వారి డిమాండ్‌కు తల వొగ్గి ముస్లిము వ్యాపారస్తుల నుండి దుకాణాలు, యిళ్లు లాక్కుని వారికి ఇస్తారని పుకార్లు చెలరేగాయి. దాంతో ముస్లిములు భయపడి బయట తిరగడం మానేశారు. పాకిస్తాన్‌కు కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయిన ముస్లిములది ఒక అవస్థ అయితే, యిక్కడే వుండిపోదామని నిశ్చయించుకున్న ముస్లిముల అవస్థ మరొక లాటిది. విభజన ప్రభావం దక్షిణాదిపై ఏమీ లేదు కాబట్టి యివన్నీ మన వూహకు అందవు, మన పెద్దలు కూడా ఎవరూ చెప్పరు. కానీ ఉత్తరాదిన, సరిహద్దు రాష్ట్రాలలో యిది పెద్ద సమస్య. స్వాతంత్య్రం వచ్చిన చాలా రోజులకు కూడా 'ఉండడమా? వెళ్లడమా?' అనే సమస్య కొన్ని ముస్లిము కుటుంబాలను బాధించింది. ''గరమ్ హవా'' సినిమా ఆ ఘర్షణను చాలా బాగా చిత్రీకరించింది.
భారతప్రభుత్వం ఏర్పడగానే 'ఇది సెక్యులర్ ప్రభుత్వం. ఏ మతం వారైనా యిక్కడ సమానస్వేచ్ఛతో వుండవచ్చు. పాకిస్తాన్ వెళ్లమని ఎవరినీ బలవంతం చేయం' అని నెహ్రూ ప్రకటించారు. అది నమ్మి ముస్లిములు యిక్కడే వుండడానికి నిశ్చయించుకున్నారు. అయితే పంజాబ్, సింధు శరణార్థులు వచ్చి పడుతున్నకొద్దీ పరిస్థితి ఉద్రిక్తమైంది. ముస్లిములకు ధైర్యం చెదిరింది. సొంత యింట్లో వుండడానికి కూడా భయం వేసింది. ఆ పరిస్థితిలో వారికి కనబడిన ఏకైక ఆశాదీపం – గాంధీ. అదే గోడ్సేకు కోపకారణమైంది. 1948 జనవరి నాటికి ఢిల్లీ పరిస్థితి, ముస్లిముల పట్ల గాంధీ దృక్పథం ఎలా వుందో తెలుసుకుంటే మనకు స్పష్టమైన చిత్రం గోచరిస్తుంది. జస్టిస్ జి.డి.ఖోస్లా రాసిన 'ద మర్డర్ ఆఫ్ ద మహాత్మా' అండ్ అదర్ కేసెస్ ఫ్రమ్ ఏ జడ్జెస్ నోట్‌బుక్ అనే పుస్తకంలోంచి సంబంధిత సమాచారం తీసుకుంటున్నాను. దీన్ని 1965లో జైకో పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు. ఖోస్లాగారి తండ్రి బ్రిటిషు హయాంలో ఐసియస్ ఆఫీసరు. ఈయన 1925లో మేజిస్ట్రేటుగా చేరి చివరకు పంజాబ్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ అయ్యారు. బహుభాషావేత్త. మంచి రచయిత. 1947 శరణార్థుల పునరావాస విషయంలో కీలకపాత్ర పోషించారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)