మతం కన్నా మానవత్వమే గొప్ప.. ఇదీ ఓ పన్నెండేళ్ళ బాలిక చెప్పిన మాట. అంతర్జాతీయ ఇస్కాన్ సంస్థ శ్రీమద్ భగవద్గీత ఛాంపియన్షిప్ పోటీల్ని నిర్వహించింది. ఈ పోటీల్లో సుమారు 4500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 195 స్కూళ్ళ నుంచి పోటీలకు హాజరయ్యారు విద్యార్థులు.
అయితే, ఓ బాలిక ఈ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకుంది. విశేషమేంటంటే ఆ బాలిక ముస్లిం కావడం. నెలరోజులపాటు కష్టపడి తన కుమార్తె భగవద్గీతను చదివి అర్థం చేసుకుందని విజేత అయిన మరియం ఆసిఫ్ సిద్ధికీ అనే బాలిక తండ్రి వ్యాఖ్యానించారు. టైటిల్ గెలుచుకున్న మరియం, మతం కన్నా మానవత్వం గొప్ప.. అని తాను విశ్వసిస్తాననీ, ఏ మతం అయినా మానవత్వాన్నే బోధిస్తుందనీ, ప్రపంచ శాంతి కోసం మతం ఉపయోగపడాలి తప్ప, మతాల పేరు చెప్పి మనుషుల మధ్య విభేదాలు రావడం సబబు కాదని మరియం అభిప్రాయపడింది.
‘మా మతం గొప్ప..’ అనుకోవడం తప్పు కాదు. ‘మా మతమే గొప్ప..’ అని ఎవరు అనుకున్నా అది తప్పిదమే. ప్రపంచంలోనే ‘భిన్నత్వంలో ఏకత్వం కలిగిన జాతి’గా భరతజాతి గురించి గొప్పగా చెప్పుకుంటుంటాం. దురదృష్టవశాత్తూ సర్వమత సమ్మేళనం అయిన భారతావని అనేక మత ఘర్షణల్ని చవిచూసింది.. అప్పుడప్పుడూ ఇంకా చూస్తూనే వుంది.