టెస్ట్ క్రికెట్లో మరీ ఇంత దారుణమైన జిడ్డు.. ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూడలేదు. ఆ స్థాయిలో సౌతాఫ్రికా మిస్టర్ డిపెండబుల్ హషీమ్ ఆమ్లా వికెట్ల దగ్గర పాతుకుపోయాడు. మ్యాచ్‌లో గెలిచే అవకాశాల్లేవని తెలిసి డిఫెన్స్‌లో పడిపోయిన సఫారీ బ్యాట్స్‌మన్, డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. బంతిని బ్యాట్‌తో టచ్ చేస్తే ఒట్టు.. అన్న చందాన సౌతాఫ్రికా బ్యాటింగ్ కొనసాగింది. నిన్న 72 ఓవర్లు ఆడి, కేవలం 72 పరుగులు చేసిన సౌతాఫ్రికా, నేడు కూడా అదే జిడ్డు కొనసాగించింది.
ఈ రోజు ఉదయం నుంచీ 13 ఓవర్లు బౌల్ అయితే, అందులోంచి సౌతాఫ్రికా రాబట్టిన పరుగులు కేవలం 4 మాత్రమే. ఎలాగైతేనేం, మిస్టర్ డిపెండబుల్, పరమ జిడ్డు హషీమ్ ఆమ్లాని భారత బౌలర్ రవీంద్ర జడేజా ఇంటికి పంపాడు. నేరుగా జడేజా విసిరిన బంతి, వికెట్లను తాకడంతో, ఆమ్లా వికెట్ చేజార్చుకోవాల్సి వచ్చింది. మొత్తంగా 244 బంతులు ఆడిన ఆమ్లా కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు.
మరోపక్క, వన్డేల్లో అయినా టీ20ల్లో అయినా టెస్టుల్లో అయినా ఒకేరకంగా చెలరేగిపోయే డివిలియర్స్ కూడా తానూ జిడ్డుకి కేరాఫ్ అడ్రస్ అన్నట్లే వికెట్ల దగ్గర పాతుకుపోయాడు. 85 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 134 బంతులు ఆడిన డివిలియర్స్ కేవలం 13 పరుగులతో సరిపెట్టాడు. సఫారీల రన్ రేట్ 72 ఓవర్లకి 1 కాగా, 85 ఓవర్లకి 0.90కి పడిపోయింది. రన్ రేట్‌తో సంబంధం లేదు, గెలుపుపై ఆశల్లేవు గనుక పరుగులతోనూ సంబంధం లేదు. మిగతా ఏడు వికెట్లను కాపాడుకోవడమే సౌతాఫ్రికా పని. అలాగే, ఆ ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకుంటే సౌతాఫ్రికాని క్లీన్ స్వీప్ చేసిన ఘనత టీమిండియాకి దక్కుతుంది.