బంతిని టచ్ చేయడానికే సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఒకటికి పదిసార్లు ఆలోచించారు. వికెట్ల మీదకు వస్తే డిఫెన్స్ ఆడటం.. లేదంటే బంతిని వదిలేయడం.. అస్సలేమాత్రం ప్రతిఘటన లేదు. ప్రతిఘటించే పరిస్థితే లేదని తెలిశాక, సౌతాఫ్రికా మ్యాచ్‌ని డ్రా చేసుకోవడానికే ప్రయత్నించింది. ఎంతగా ప్రయత్నించిందంటే, ఇంతటి డిఫెన్స్ ఇటీవలి కాలంలో టెస్ట్ క్రికెట్‌లో ఇంకే జట్టూ ఆడలేదేమో.. అన్నంతలా.!
ఏం లాభం.? టీమిండియా విక్టరీ సాధించింది. హషీమ్ ఆమ్లా ఔట్ అవడంతోనే సౌతాఫ్రికా పరాజయం పక్కా అయిపోయింది. ఇక మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే లేవని అంతా ఫిక్సయిపోయారు. కాస్సేపు డివిలియర్స్ క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఫలితం టీమిండియా వైపే మొగ్గు చూపింది. స్పిన్నర్లకు తోడు చివర్లో ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు తీయడంతో, సౌతాఫ్రికా కేవలం 143 పరుగులకే కుప్ప కూలింది.
రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా మొత్తం 143 ఓవర్లు బ్యాటింగ్ చేసింది, కేవలం 143 పరుగులు మాత్రమే సాధించింది. నిన్న 72 ఓవర్లలో 72 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా ఈ రోజు 71 ఓవర్లు ఆడి 71 పరుగులు చేయగలిగింది. పరుగుల సంగతి పక్కన పెడితే డుప్లెసిస్ 97 బంతులు ఎదుర్కోవడం, డేన్ విలాస్ 50 బంతులు ఎదుర్కోవడం గమనార్హం. డివిలియర్స్ అత్యధికంగా 297 బంతులు ఎదుర్కొని 43 పరుగులు చేస్తే, 244 పరుగులు చేసిన ఆమ్లా 25 పరుగులతో సరిపెట్టాడు.
మొత్తం నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మిగిలిన మూడు మ్యాచ్‌లలోనూ టీమిండియా ఘనవిజయం సాధించి, 3-0 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమిండియా స్పిన్నర్ అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని గెలుచుకున్నాడు. నాలుగో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు సాధించిన అజింక్యా రెహానేకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యాల గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రోహిత్ శర్మ ఫెయిలవడం, మిగతా బ్యాట్స్‌మెన్ కూడా ఆశించిన రీతిలో రాణించకపోవడం, టీమిండియా వైఫల్యాలుగా భావించాల్సిందే.
ఏదిఏమైనా టీమిండియా ఢిల్లీ టెస్ట్‌లో సౌతాఫ్రికాని జస్ట్ ఆడించిందంతే.. అనుకోవాలి. ఎందుకంటే, ఇన్నింగ్స్ విక్టరీ దక్కించుకోవాల్సిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికాని ఫాలో ఆన్ ఆడించకుండా, తాను బరిలోకి దిగింది మరి.!