బ్యాట్స్‌మెన్ రాణించారు. టీమిండియా వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో 300 పరుగులు చేసింది. పాకిస్తాన్ 301 పరుగులు చేస్తే విజయాన్ని ముద్దాడినట్లే. అయితే ఇప్పటిదాకా భారత్‌పై పాకిస్తాన్ విజయం సాధించిన దాఖలాల్లేవు వరల్డ్ కప్ మ్యాచ్‌లలో. దాంతో బౌలర్లు కాస్త జాగ్రత్తగా బౌలింగ్ చేస్తే భారత్ విజయం దాదాపు ఖాయమే.
ఇక, 11 పరుగుల వద్ద తొలి వికెట్‌ని కోల్పోయింది పాకిస్తాన్. షమీ బౌలింగ్‌లో యూనిస్‌ఖాన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి క్యాచ్ ఇచ్చాడు. మరోపక్క, షమీ పొదుపుగా బౌలింగ్ చేస్తోంటే, ఉమేష్ యాదవ్ మాత్రం ధారాలంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు.
ఇదిలా వుంటే, 320 పరుగులకు పైనే టీమిండియా సాధిస్తుందని అంతా అంచనా వేసినా, చివరి ఓవర్లలో భారత బ్యాట్స్‌మన్ ఎడా పెడా వికెట్లు పారేసుకున్నారు. కోహ్లీ ఔట్ అయ్యాక.. క్రీజ్‌లోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. భారీ సిక్సర్ బాదిన ధోనీ 18 పరుగులకే ఔట్ కాగా, రవీంద్రజడేజా 3 పరుగులకే వికెట్ పారేసుకున్నాడు. ఆజింక్య రెహానే వస్తూనే తొలి బంతికే ఔట్ అయ్యాడు.