పేరు : నరేంద్ర మోడీ
దరఖాస్తు చేయు ఉద్యోగం: రాజకీయ విద్యార్థి.( ఢిల్లీ మినహా దేశాన్ని పాలించుకోవాల్సిన ప్రధానినయ్యాను. కాబట్టి రాజకీయాలు మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సి వుంది.)
ముద్దు పేర్లు : ‘నై’ మోడీ( ఢిల్లీలో బీజేపీ పరాజయాన్ని నాకు అంటగట్టి, కొందరు ఇలా మాట్లాడుతున్నారు.) నరేంద్ర ‘మూడీ’ ( మొత్తం ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి వచ్చినవి ‘మూడు’ కదా. అందుకని అలాగంటున్నారు.
‘విద్యార్హతలు : ఎం.ఎ.( మాస్టర్ ఆఫ్ ‘ఎరోగెన్స్’). నా ‘అహంకారం’ (ఎరోగెన్స్) వల్లనే ఢిల్లీలో బీజేపీ తడుచి పెట్టుకుపోయిందని కేజ్రీవాల్ అంటున్నారు.
గుర్తింపు చిహ్నాలు:
- ఒకటి: ‘కట్టుకున్న’ వాటిని(మనుషుల్ని కాదండోయ్..!) వేగంగా వదలివేయటంలో నా రికార్డు నాకుంది. అందుకే కట్టుకున్న వస్త్రాలను మార్చుకోవటంలో మిషెల్లీ ఒబామాతో పోటీ పడ్డాను.
- రెండు: ‘అమిత’ విశ్వాసం. అర్థమయింది కదా! నా మీద కాదు ‘అమిత్’ షా మీదా, ఆయన వ్యూహం మీదా. ఢిల్లీ పోయినంత మాత్రాన మన విశ్వాసాలు మార్చుకుంటామా ఏమి?
సిధ్ధాంతం : ‘పాస్’ యిజం.( మీరు అనుకున్నట్టు హిట్లర్ లాంటి నియంతల ‘ఫాసిజం’ కాదు. బట్టీ పట్టో, కాపీలు కొట్టో, పుస్తకాలు పెట్టో… ఏదో రకంగా పాస్ కావటం ముఖ్యం. అదే నా సిధ్ధాంతం)
వృత్తి : ‘నోరు’ చేసుకోవటం. (అందుకే నన్ను ‘నోరే’ంద్ర మోడీ కూడా అంటారు) ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, బీజేపీలో నాది ‘కూత’బడి, అమిత్ షాది ‘చేత’బడి. అరవింద్ కేజ్రీవాల్‌ను ‘నక్సలైట్’ అన్నాను. నేను పెట్టిన పేరును సార్థకం చేశాడు. ఢిల్లీ పీఠం కింద మందుపాతర బదులు ‘మంది’ పాతర పెట్టాడు.
హాబీలు :
- ‘చీపురు’ పట్టటం( అదే నాకొంప ముంచింది. స్వఛ్చభారత్ పేరు మీద ‘చీపురు’కు నేనే విపరీతమయిన ప్రచారం కల్పించాను. ‘చీపురు’ పట్టండీ అని నేను చెబితే, ఢిల్లీ ప్రజలు నా మాటను మరోలా విన్నారు: ‘చీపురు’కు కొట్టండీ అన్నట్లు భ్రమించారు. అంతే ‘చీపురు’ గుర్తుకు కొట్టారు. కేజ్రీవాల్‌ను గెలిపించారు.
- ‘చాయా’ గ్రహణం( పొరపాటున ఫోటోగ్రఫీ అనుకునేరు! తేనీటిని అనగా చాయ్‌ను తాగటం. ఒకప్పుడు అమ్మే వాణ్ణి లెండి. అంతే కాదు. ‘చాయ్’ వాలానుంచి మించిన ‘కామన్ మేన్’ వుండడని నమ్మే వాణ్ణి. కానీ ‘మఫ్లర్’ వాలా వచ్చి నన్ను మింగేశాడు.)
అనుభవం : మెరిసేదంతా బంగారం కాదు. ఇత్తడి ఎప్పటికీ పుత్తడి కాలేదు. ఎంత మేకప్ చేస్తే మాత్రం ‘బేడీ’ ‘మోడీ’ అవుతుందా? అందుకే ఢిల్లీ ప్రజలు ముఖ్యమంత్రిగా ‘బేడీ’ని నిలబెడితే తిప్పికొట్టారు.
మిత్రులు : వాళ్ళ కన్నా శత్రువులే నయంగా వున్నారు. ఢిల్లీలో మా పార్టీ పరాజయాన్ని, నా పరాజయంగా చూస్తున్నారు. నాది(మోడీ) ‘వేవ్’( ప్రభంజనం) మాత్రమేననీ, కేజ్రీవాల్‌ది ‘సునామీ’ అనీ ప్రచారం చేస్తున్నారు. ఎవరో కాదు ‘శివసేనాధిపతి’ ఉధ్ధవ్ థాకరే.
శత్రువులు : వారే ఇప్పుడు నా మేలు కోరుతున్నారు. నా తప్పులు నాకు చూపి నన్ను సరిదిద్దుతున్నారు.
మిత్రశత్రువులు : రహస్యంగా ఆనందిస్తున్న మా పార్టీలోని ‘వృధ్ధ నేతలు’ . వారిని ‘తన్ని’ వచ్చి ప్రధాని నయ్యానని కడుపు మంట కదా! ఇప్పుడు చల్లార్చుకుంటున్నారు.
వేదాంతం : ‘గృహ వాప్సీ’ ఇతర మతాల్లో వున్న హిందువులను ఇంటికి రమ్మన్నాం. కానీ ‘ఢిల్లీ’లో మమ్మల్ని ఇంటికి పంపారు. అప్పుడర్థమయింది మేమే ‘హిందూత్వ’ వెలుపల వున్నామని.
జీవిత ధ్యేయం : ఎప్పటికయినా ఢిల్లీని ‘తుడవాలని’.(కేజ్రీవాల్ తుడిచినట్టు గానే.)
సతీష్ చందర్