ఎమ్బీయస్‌ : ఏది సత్యం? ఏదసత్యం?

ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన వి.కె.సింగ్‌ రిటైరయ్యే సమయానికి తన వయసు ఏడాది ఎక్కువగా పడిందని యాగీ చేసి కోర్టుకి వెళ్లడం, ఓడిపోవడం, కసితో అప్పటి యుపిఏ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసి, వారి పరువు…

ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన వి.కె.సింగ్‌ రిటైరయ్యే సమయానికి తన వయసు ఏడాది ఎక్కువగా పడిందని యాగీ చేసి కోర్టుకి వెళ్లడం, ఓడిపోవడం, కసితో అప్పటి యుపిఏ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసి, వారి పరువు తీయడం చూశాం. అలాటి వ్యక్తి తమ అమ్ములపొదిలో వుంటే బాగుంటుందనుకుని బిజెపి పార్టీలో చేర్చుకుని కాబినెట్‌లో విదేశాంగ శాఖలో సహాయమంత్రిగా చేసింది. ఇప్పుడాయన ఎన్‌డిఏ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడుతున్నాడు. ''అవినీతిని అరికడతామన్న నినాదంపై అధికారంలోకి వచ్చి అవినీతి జరిగిందని బాహాటంగా కనబడుతున్న కేసులో కూడా అవినీతిపరులను సమర్థిస్తూ వుంటే వూరుకోవడం ఎలా?'' అంటూ. ''దీనిలో అవినీతి జరిగిందని మీకు కచ్చితంగా ఎలా తెలుసు?'' అంటే ''నేనే కదా కేసు మొత్తం డీల్‌ చేసినది…'' అంటున్నాడు.

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో సుఖ్నా అనే చోట మిలటరీ కంటోన్మెంట్‌ ప్రాంతం వుంది. దాన్ని ఆనుకుని 71 ఎకరాల ప్రయివేటు భూమి వుంది. అక్కడ ఏదైనా కట్టాలంటే మిలటరీవారు 'నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌' (నిరభ్యంతర పత్రం) రూపంలో అనుమతి యివ్వాలి – రక్షణ వ్యవహారం కాబట్టి! అక్కడ దిలీప్‌ అగర్వాల్‌ అనే బిల్డర్‌ భవంతులు కట్టి అమ్ముదామనుకున్నాడు. పత్రం యిచ్చేలా చేయమని మిలటరీ సెక్రటరీగా వున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ అవధేశ్‌ ప్రకాశ్‌ను కోరాడు. ఆయన 2008 జూన్‌ ప్రాంతంలో అధికార పర్యటన అంటూ సుఖ్నాకు వచ్చి అగర్వాల్‌ను కంటోన్మెంట్‌ వ్యవహారాలకు యిన్‌చార్జిగా వున్న 33 కార్ప్‌స్‌ కమాండర్‌ పి.కె. రథ్‌కు పరిచయం చేసి, పత్రం యిచ్చేలా చేయమని కోరాడు. అప్పట్లో ఆర్మీ ఈస్టర్న్‌ కమాండ్‌కు జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ – ఇన్‌ – చీఫ్‌గా వున్న వి కె సింగ్‌కు సైతం తెలియపరచకుండా రథ్‌ 2009 మార్చిలో 'దిలీప్‌ అగర్వాల్‌ ఆ ప్రాంతంలోకాలేజీ కట్టడానికై అడుగుతున్నాడన్న' కారణం చెప్పి నిరభ్యంతర పత్రం యిచ్చేశాడు. ఈ విషయం ఏడాది చివరలో తనకు తెలియగానే వికె సింగ్‌ దీనిపై విచారణ ప్రారంభించి, అవధేశ్‌, రథ్‌లపై కోర్టు మార్షల్‌ జరపాలని ఆదేశించాడు. మిలటరీ కోర్టు విచారణ జరిపి పై అధికారులకు తెలుపకుండా పత్రం యివ్వడం రథ్‌ చేసిన తప్పేనని, మిలటరీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లేనని భావిస్తూనే 'మిలటరీని మోసగించాలన్న దురుద్దేశం వున్నట్లు ఆధారాలు కనబడలేద'ని అంది. రథ్‌ను పురిగొల్పిన అవధేశ్‌కు మాత్రం దురుద్దేశం వుందని అభిప్రాయపడి అతన్ని మిలటరీ సర్వీస్‌లోంచి తీసేసింది. రథ్‌కు శిక్షగా తీవ్రమైన మందలింపుతో బాటు, 18 నెలల సర్వీసు తగ్గించింది, పెన్షన్‌ లెక్క వేసేటప్పుడు 15 సం||ల సర్వీసుని లెక్కలోకి తీసుకోకూడదంది.

ఈ తీర్పు 2011 జనవరి 1న వెలువడింది. అవధేశ్‌ వూరుకున్నాడు కానీ రథ్‌ దీన్ని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లాడు. 'నేనే తప్పూ చేయలేదు. ఇదంతా వికె సింగ్‌ అవధేశ్‌పై వ్యక్తిగతమైన కక్షతో చేసిన వ్యవహారం. నన్ను యిరికించారు.' అని వాదించాడు. సింగ్‌ తన పుట్టిన తేదీ తప్పుగా పడిందని, తన తండ్రి పొరపాటున ఒక ఏడాది ఎక్కువ వేశాడని కెరియర్‌ చివర్లో వివాదం లేవనెత్తగా మిలటరీ సెక్రటరీగా వున్న అవధేశ్‌ అంగీకరించలేదు. మిలటరీ అధికారిగా కూడా పని చేసిన వికె సింగ్‌ తండ్రి పొరపాటు చేస్తారంటే నమ్మగలమా? వయసు కారణంగానే ఎన్నో ప్రమోషన్స్‌ పొందిన వికె సింగ్‌ రిటైరయ్యే సమయంలో తన పదవీకాలం మరో ఏడాది పొడిగించుకోవడానికి వేసిన ఎత్తు యిది అని అవధేశ్‌ భావించాడు. వికె సింగ్‌ కోర్టుకి వెళ్లినా, డిఫెన్సు మంత్రిని కోరినా లాభం లేకపోయింది. ''ఆ కసితో సింగ్‌ అవధేశ్‌పై యీ కేసు బనాయించి నన్ను బలిచేశాడు. నా వద్ద జూనియర్లుగా పనిచేస్తున్న అధికారులను ఒత్తిడి చేసి వారి చేత నాకు వ్యతిరేకంగా సాక్ష్యం యిప్పించాడు. అలా చెప్పినందుకు వారికి ప్రమోషన్లు యిచ్చాడు. రికార్డు సరిగ్గా లేని కల్నల్‌ ర్యాంకు ఆఫీసర్ని బ్రిగేడియర్‌గా చేసి సింగ్‌ స్వయంగా అతనికి మెడల్‌ గుచ్చాడు. మేజర్‌ జనరల్‌ ర్యాంకులో వున్న మరో వ్యక్తిని లెఫ్టినెంట్‌ జనరల్‌ ర్యాంకుకు ప్రమోట్‌ చేసి డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా చేశాడు. అంతేకాదు, యీ విచారణ మొత్తం తన కనుసన్నల్లో జరిగేట్లు చూసుకున్నాడు. కోర్టు మార్షల్‌లో జడ్జి ఎడ్వకేట్‌గా ఎవరుండాలో తనే నిర్ణయించాడు. నాకు దురుద్దేశం లేదని జడ్జి అభిప్రాయపడ్డాక తీర్పును పునస్సమీక్షించవలసినదిగా ఆయన్ను కోరాడు. మిలటరీ కోర్టు విచారణ విషయంలో ఫిర్యాదిగా, విచారణాధికారిగా, ప్రాసిక్యూషన్‌ న్యాయవాదిగా, జడ్జిగా, తీర్పు ఆమోదించి అమలు చేసే అధికారిగా – యిన్ని పాత్రలు తనే పోషించాడు. ఇది సహజన్యాయానికి విరుద్ధం.'' అంటూ రథ్‌ వాదించాడు.

ట్రైబ్యునల్‌ యీ ఆరోపణలపై విచారించిన జస్టిస్‌ సునీల్‌ హాలీ, ఎయిర్‌ మార్షల్‌ జె.ఎన్‌.వర్మ రథ్‌ వాదన సరైనదన్న అభిప్రాయానికి వచ్చారు. రథ్‌పై వున్న అన్ని ఆరోపణలు కొట్టిపారేశారు. అతను నియమాలు ఉల్లంఘించాడనడానికి ఏ ఆధారాలూ లేవన్నారు. వికె సింగ్‌ అతనిపై కక్ష కట్టినట్లు స్పష్టంగా కనబడుతోందన్న అభిప్రాయంతో రథ్‌కు రావలసిన అన్ని సౌకర్యాలు 12% వడ్డీతో సహా తిరిగి యివ్వాలన్నారు. ''అతని పట్ల జరిగిన అన్యాయానికి పరిహారం ఎంతో కొంత యివ్వాల్సిందే. అందువలన ఆర్మీ అతనికి యీ తీర్పు వెలువడిన మూడు నెలల లోపున  లక్ష రూపాయలు యివ్వాలి.'' అన్నారు. ఈ తీర్పు 2014 సెప్టెంబరు 5 న వెలువడింది. ఇప్పుడు కాబినెట్‌లో మంత్రిగా వున్న సింగ్‌కు యిది చాలా యిబ్బందికరమైన పరిస్థితి. ఈ కేసును ఆర్మీ యింతటితో వదిలేయకూడదని, దీనిపై అప్పీలుకి వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాడు. అయితే ప్రభుత్వం అతని మాట పట్టించుకోకపోగా ఆ తీర్పును యథాతథంగా అమలు చేయాలంటూ సెప్టెంబరు 30న ఒక ఆదేశం జారీ చేసింది.  సింగ్‌ మండిపడుతున్నాడు. ''ఫ్రంట్‌లైన్‌'' పత్రికతో మాట్లాడుతూ ''ఇది సిల్లీ ఆర్డర్‌. ఇలాటి ఓపెన్‌ అండ్‌ షట్‌ కేసులో అవినీతిని సహించడం ద్వారా ప్రభుత్వం ఎలాటి సంకేతం యివ్వబోతోంది? ట్రైబ్యునల్‌ వికలాంగులైన సైనికులకు, చనిపోయిన సైనికుల భార్యలకు అదనంగా పరిహారం యివ్వమని తీర్పు యిచ్చిన కేసుల్లో  అప్పీలుకి వెళ్లే ప్రభుత్వం యీ కేసులో యిలా చేయడమేమిటి?'' అంటూ నిప్పులు చెరిగాడు. 

మామూలు పాఠకులం యిప్పుడు మనం ఎవర్ని నమ్మాలి? సుఖ్నా ల్యాండ్‌ స్కామ్‌ 2009-10లో వార్తాపత్రికలకు ఎక్కింది. యుపిఏ అవినీతిని ప్రోత్సహిస్తోందంటూ దాన్ని బయటపెట్టిన వికె సింగ్‌ను ఆనాడు అందరూ ప్రశంసించారు. యుపిఏను ముప్పుతిప్పలు పెట్టినందుకు బహుమతిగా బిజెపి అతన్ని పార్టీలోకి చేర్చుకుని, మంత్రిపదవితో సత్కరించింది. ఈనాడు అతని మాటలు పనికిరాకుండా పోయాయి. వికె సింగ్‌ వ్యక్తిగతమైన కక్షతోనే స్కాము బయటపెట్టాడనుకున్నా అసలు అవినీతి జరిగిందా లేదా? జరిగితే దానికి పాల్పడిన రథ్‌ను శిక్షించాలా? లేదా? సింగ్‌ చెప్పేది నిజమా? రథ్‌ చెప్పేది నిజమా? ఏది సత్యం? ఏదసత్యం?

– తెలుసుకోవాలని నేను నెట్‌లో పాత ఎంట్రీలకోసం వెతికాను. సుఖ్నా ల్యాండ్‌ స్కామ్‌లో మిలటరీ అధికారులు తప్పు చేశారని వికె సింగ్‌ తర్వాత పదవిలోకి వచ్చిన దీపక్‌ కపూర్‌ కూడా అన్నారు. అప్పటి రక్షణ మంత్రి, మిస్టర్‌ క్లీన్‌గా పేరుబడిన ఎకె ఆంటోనీ కూడా నిందితులపై చర్య తీసుకోవాలనే పట్టుదల ప్రదర్శించారు. మరి ఇప్పుడు రథ్‌ చేస్తున్న ఆరోపణల మాటేమిటి? 2010 ఫిబ్రవరి 1న యీ స్కాము గురించి లెఫ్టినెంట్‌ జనరల్‌ హర్వంత్‌ సింగ్‌ అనే ఆయన రాసిన వ్యాసం కనబడింది. ఆయన రాసినదాని సారాంశం యిది – ''…మిలటరీ యిన్‌స్టాలేషన్స్‌ వున్నచోటికి వెయ్యి మీటర్ల దూరంలో ఏ కట్టడాలు కట్టకూడదని చట్టం వుంది. కానీ చాలా చోట్ల అది పాటించడం లేదు. లూధియానా వద్ద వున్న బాడోవాల్‌లో ఆర్మీ ఎమ్యూనిషన్‌ డిపో వున్నచోట కళ్యాణమండపాలు కట్టారు. ఆర్మీ అధికారులు అభ్యంతరం తెలిపినా పట్టించుకున్నవాడు లేడు. కసౌలీలోని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పక్కన అనేక విల్లాలు పుట్టుకుని వచ్చాయి. ఎయిర్‌ఫోర్సు హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టుకి వెళ్లినా యిప్పటిదాకా ఏమీ ఫలితం కనబడలేదు. లాల్రూ ఎమ్యూనిషన్‌ డిపో పక్కన టోల్‌ గేటు వచ్చింది. ఆర్మీ అభ్యంతరం పెట్టినా లాభం లేకపోయింది. ఇలా ఎన్నో జరుగుతున్నాయి.

''సుఖ్నాలో బిల్డర్‌ ''కాలేజీ కడతాను, నిరభ్యంతరపత్రం యివ్వండి'' అంటూ వచ్చాడు. అలాటి పత్రాలు ఆర్మీ ఎన్నడూ యివ్వదు. ఆ పద్ధతే లేదు. అందుకే నిరాకరించారు. కొన్నాళ్లు పోయాక కాలేజీ బ్రోషరు ముద్రించి దానిపై మిలటరీ సెక్రటరీ అవధేశ్‌ ప్రకాశ్‌ ఫోటో వేసి కింద రాబోయే కాలేజీకి కాబోయే డైరక్టర్‌ అని వేసి, మళ్లీ పత్రం కోసం వచ్చాడు. అవధేశ్‌ కీలకమైన పదవిలో వున్నాడు కాబట్టి కింది అధికారులపై ఒత్తిడి తెచ్చాడు. ఈ అవధేశ్‌ రాణీఖేత్‌లో కూడా యిలాటి పనే చేశాడు. అంతేకాదు, రెజిమెంటుకు సంబంధించిన నిధుల దుర్వినియోగంలో కూడా యిరుక్కున్నాడు. ఇప్పుడు సుఖ్నా భూమి వ్యవహారం ఈస్టర్న్‌ కమాండ్‌ విచారిస్తోంది. రాణిఖేత్‌ వ్యవహారం సెంట్రల్‌ కమాండ్‌ విచారిస్తోంది…''

ఇదంతా చదివితే వికె సింగ్‌ విచారణ జరిపించడం న్యాయమనీ, అవధేశ్‌, రథ్‌లు దోషులని తేటతెల్లమౌతోంది. వికె సింగ్‌కు మనసులో కసి, కక్ష వున్నాయో లేదో స్కానింగ్‌లో కూడా తెలియవు. కానీ అతను చేసిన పని మాత్రం కరక్టే. ఇప్పుడీ ట్రైబ్యునల్‌ వికె సింగ్‌ చేసినది తప్పని తీర్పు యిస్తే ప్రభుత్వం దానిపై అప్పీలు చేసి వుండాల్సింది. ఎందుకు చేయలేదో వారికే తెలియాలి.

ఎమ్బీయస్‌ ప్రసాద్ 

[email protected]