మ్యాచ్ ఎక్కడ జరుగుతుందన్నది ముఖ్యం కాదు.. ఎవరి మధ్య జరుగుతుందనేదే ముఖ్యం. భారత్, పాక్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ.. కాదు కాదు ఇంకా ఎక్కువగానే ఉత్కంఠ చోటుచేసుకుంటుంది. వరల్డ్ కప్‌లో భాగంగా నేడు భారత్ – పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ధాటిగా ఆడుతోంది. రెండు వికెట్ల నష్టానికి 250 పరుగులు దాటేసింది.
పరుగు పరుగుకీ మైదానంలో క్రికెట్ అభిమానుల సందడే సందడి. ప్రతి బంతికీ ఓ రేంజ్ హడావిడి. పాక్ వికెట్ కీపర్ క్యాచ్ మిస్ చేసినప్పుడైతే పాక్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. రోహిత్‌శర్మ ఔటయినప్పుడు భారత అభిమానుల్లో ఆందోళన, పాక్ అభిమానుల్లో ఆనందం. శిఖర్ ధావన్ సిక్స్ కొడితే పాక్ అభిమానుల్లో అసహనం, భారత అభిమానుల్లో ఆనందోత్సాహాలు.. వెరసి అడిలైడ్ మైదానంలో మునుపెన్నడూ లేనంత సందడి నెలకొంది.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేయడం ఒక విశేషమైతే, అర్థ సెంచరీతో జట్టుకి మంచి ఊతాన్నిచ్చాడు శిఖర్ ధావన్. ధాటిగా బ్యాటింగ్ చేస్తూ రైనా తన సత్తా చాటాడు. కొంతమేర భారత బౌలర్లను నిలువరించేందుకు పాక్ బౌలర్లు ప్రయత్నించినా, భారత బ్యాట్స్‌మెన్ పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారనే చెప్పాలి. భారీ స్కోర్ దిశగా భారత్ పరుగులు పెడ్తోంది.