ఇప్పుడు అన్ని విధాలా హ్యాపీ-బండ్ల గణేష్

టెంపర్ ..ఎన్టీఆర్ కు పెద్ద హిట్. 2015లో మంచి హిట్..పూరి స్టామినా తెలిపిన హిట్. ఓ మంచి సినిమా అనిపించుకునే లక్షణాలున్న హిట్.  సినిమా నిర్మాణ సమయంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు..ఇతర వ్యవహారలపై  నిర్మాత బండ్ల…

టెంపర్ ..ఎన్టీఆర్ కు పెద్ద హిట్. 2015లో మంచి హిట్..పూరి స్టామినా తెలిపిన హిట్. ఓ మంచి సినిమా అనిపించుకునే లక్షణాలున్న హిట్.  సినిమా నిర్మాణ సమయంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు..ఇతర వ్యవహారలపై  నిర్మాత బండ్ల గణేష్ మనసులోని మాటలు ఇవి.

టెంపర్ 2..రిజల్ట్ వచ్చేసింది..ఇప్పుడు ఎలా వుంది మీకు?

పిచ్చ హ్యాపీగా వుంది…అన్ని విధాలా..

మీ మిగిలిన సినిమాల కన్నా దీనికి ఎక్కువ టెన్షన్ పడ్డట్టున్నారు?

అవును..తప్పలేదు.

కారణలేమిటి? ఆర్థిక సమస్యలేనా?

ఆర్థిక సమస్యలేమీ లేవు. ఆ విధంగా వచ్చిన వార్తలన్నీ వాస్తవం కాదు. కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ లు రావడం వల్ల.

ఎవరితో?

హీరోగారితో..పూరిగారితో..

నిజంగానా..ఎలా?

అది మా వల్ల కాదు..మధ్యలో కొందరు పుట్టించారు..నేనేదో మెగా క్యాంప్ మనిషిని అని..ఇలా రకరకాలుగా. హీరోను, దర్శకుడిని నా నుంచి దూరం చేద్దామని చూసారు.

ఎందుకలా?

అది పుట్టించిన వారికే తెలియాలి

దీనివల్లే ఇబ్బంది వచ్చిందా..ఎంత వరకు?

నిజం చెబుతున్నా..ఒక దశలో ప్రాజెక్టు వదిలేద్దామనుకున్నా. నాకు హీరోలందరూ సమానమే.  నేను ఏ హీరోతో సినిమా చేస్తే, ఆ హీరో బాగుండాలని కోరుకుంటాను. ఎందుకంటే సినిమా నాకు వ్యాపారం కదా..నా వ్యాపారం బాగుండాలంటే, నా హీరో బాగుండాలి కదా. అయితే పవన్ కళ్యాణ్ ను మాత్రం దేవుడు అంటాను. ఎందుకంటే ఆయన నిర్మాతగా నాకు లైఫ్ ఇచ్చారు. ఓ ఫ్లాప్ వస్తే, పిలిచి  మరో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అందువల్ల మా అమ్మ, నాన్న తరువాత పవన్ అంటాను.

ఆఖరికి ఎలా సెటిలయ్యాయి?

నన్ను అర్థం చేసుకున్నారు. అంతా సాఫీగా సాగిపోయింది.

టెంపర్  సినిమా విడుదలకు ముందు ఎన్నిసార్లు చూసారు?

చాలా సార్లు. మీకో సంగతి చెప్పనా..నేను పోస్టు ప్రొడక్షన్ పనిలో ఇన్ వాల్వ్ అయిన తొలి సినిమా ఇది. ఇప్పటి దాకా నేను నా సినిమాల ప్రచారం, పెట్టుబడి తప్ప మరేవీ పట్టించుకోలేదు. అన్నీ దర్శకులకే వదిలేసాను. ఇలా కాదు అలా అని ఏ నాడూ చెప్పలేదు. నన్ను నేను వాళ్ల ముందు చిన్నవాడిగానే ఫీలయ్యాను.

మీరు చిన్న నటుడిగా చేయడం వల్ల వచ్చిన ఫీలింగ్ అంటారా అది?

కావచ్చు. కానీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నింటి దగ్గరా వున్నాను. ఎడిటింగ్ సూట్, రీరికార్డింగ్..ఇలా ప్రతి చోటా.

ఈ సినిమాకు పివిపి కి ఏ మాత్రం అనుబంధం?

పివిపి గారు నాకు ఓ అన్నదమ్ముడిలా అడుగడుగునా నిల్చున్నారు. సినిమాను బయ్యర్లు తక్కువరేటు కు అడుగుతున్నారు..నేరుగా విడుదల చేస్తే, ఇంత రిస్క్ వుంటుంది ఏం చేద్దాం అని ఆయననే అడిగా..నీకేం ఫరవాలేదు..నేనున్నా..గో ఎహెడ్ అన్నారు. నైజాం ఎనిమిది కోట్లకు అడిగారు. నేను ఇవ్వలా..ఇప్పుడు పదిహేను కోట్లకు పైగానే వసూలు చేస్తుంది.

ఎందువల్ల ఈ పరిస్థితి?

ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా అంత బాగా ఆడగపోవడం, పూరి-ఎన్టీఆర్ కాంబినేషన్ ఆంధ్రవాలా కూడా అలాంటి రిజల్టే ఇవ్వడం వల్ల కావచ్చు.

మరి అలాంటి కాంబినేషన్ ను మీరు ఎలా నమ్ముకున్నారు?

నాకు పూరి మీద నమ్మకం వుంది. ఎన్టీఆర్ క్రౌడ్ పుల్లింగ్ మీద నమ్మకం వుంది. అందుకే ధైర్యంగా ముందుకు వెళ్లాను.

ఈ సినిమా హిట్ ఫ్యాక్టర్లేమిటి?

ఎన్టీఆర్ నటన..విశ్వరూపం చూపించేసారు…పూరి డైలాగులు..ఎంత కసిగా రాసారో..వంశీ కథ…క్లయిమాక్స్ ట్విస్ట్..అద్భుతంగా మలిచారు.

సినిమా పివిపి చూసారని..ఏవో సలహాలు ఇచ్చారని..?

నిజమే. ఆయనకు చూపించాను. నేను, మా అన్నయ్య, పివిపి గారు చూసాం. పివిపి గారు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. మా దృష్టికి కొన్ని వచ్చాయి. ముగ్గురం చర్చించుకుని 15 పాయింట్లు రాసుకున్నాం.

వాటిని పూరి దృష్టికి తీసుకెళ్లారా?

నేనే తీసుకెళ్లాను..

ఏమన్నారు?

మంచి పాయింట్లు చెప్పావ్ గణేష్ అన్నారు. అమలు చేసారు కూడా.

ఏమేమిటి అవి?

టెంపర్ సాంగ్ తొలి సగంలో వుండేది. మలి సగంలోకి మార్చాం. తొలిసగంలో కొన్ని మార్పులు, ట్రిమ్మింగ్ చేసాం. మలి సగంలో కొంత ట్రిమ్ చేసాం.

కేవలం పివిపి చెప్పారనేనా..అవసరం అని పూరి కూడా భావించారా?

ఏ సినిమాకైనా ఇలాంటి మైనర్ రిపేర్లు తప్పవు. స్క్రిప్ట్ ప్రకారం కాస్త అటు ఇటుగా తీయడం జరుగుతుంది. తరువాత దిద్దుకోవడం జరుగుతుంది. అంత మాత్రం చేత ఎవరి తప్పూ కాదు..గొప్పా కాదు.

టెంపర్ కు ఎంత ఖర్చయింది?

అన్నీ కలపి నలభై దాటింది

అంత వసూళ్లు సాధిస్తుందన్న నమ్మకం వుందా?

తప్పకుండా. ఇది బ్లాక్ బస్టర్ సినిమా. మీకు ఓ సంగతి తెలుసా? ఎన్టీఆర్ కు రెండు హిట్ లు ఇచ్చిన బ్యానర్ మాది. మరే బ్యానర్ ఎన్టీఆర్ తో రెండో సినిమా హిట్ కొట్టలేదు.

నిర్మాతగా బండ్ల గణేష్ బతికేసినట్లేనా?

మరో అయిదేళ్ల దాకా ఢోకా లేదు.

తరువాతి ప్రాజెక్టులు?

చూడాలి..టెంపర్ 2 తీయాలని వుంది. ఎన్టీఆర్ – పూరి కూడా ఓకె అన్నారు. వంశీ కథ రెడీ చేస్తే, చేయడమే. ఈసారి పెద్ద సినిమాలతో పారలల్ గా చిన్న సినిమాలు, కొత్త దర్శకులతో కూడా చేయాలనుకుంటున్నాను. బ్యానర్ నుంచి విరివిగా  సినిమాలు చేయాలని భావిస్తున్నా.

టెంపర్ విషయంలో మీ కృతజ్ఞతలు ఎవరికి?

హీరో ఎన్టీఆర్ కు, డైరక్టర్ పూరికి, పివిపి గారికి, మా అన్నయ్యకు, సినిమా నిర్మాణ వ్యవహారాలు చూసిన వాకాడ అప్పారావు గారికి, ఇంత పెద్ద హిట్ చేసిన నందమూరి అభిమానులకు.

విఎస్ఎన్ మూర్తి.