భారత్‌ వర్సెస్‌ పాక్‌: ఆటే కాదు అంతకుమించి

1947 ఆగస్ట్‌ 15కి సరిగ్గా కొద్ది గంటల ముందు పాకిస్తాన్‌, భారతదేశం నుంచి విడిపోయింది. ఆ లెక్కన, పాకిస్తాన్‌కి భారతదేశం తండ్రిలాంటిది. ఈ రోజు ఫాదర్స్‌ డే.. ఇదే రోజున భారత్‌ – పాక్‌…

1947 ఆగస్ట్‌ 15కి సరిగ్గా కొద్ది గంటల ముందు పాకిస్తాన్‌, భారతదేశం నుంచి విడిపోయింది. ఆ లెక్కన, పాకిస్తాన్‌కి భారతదేశం తండ్రిలాంటిది. ఈ రోజు ఫాదర్స్‌ డే.. ఇదే రోజున భారత్‌ – పాక్‌ మధ్య 'ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌' మ్యాచ్‌ జరగబోతోంది. సోషల్‌ మీడియాలో దీని చుట్టూ జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.! 

ఛాంపియన్స్‌ ట్రోపీ ఫైనల్‌ మ్యాచ్‌ అనే కాదు, టీమిండియా – పాకిస్తాన్‌ ఎక్కడ తలబడినా అక్కడ ఒకే రకమైన ఉద్వేగభరిత వాతావరణం చోటుచేసుకుంటుంది. అది లీగ్‌ మ్యాచ్‌ కావొచ్చు, నాకౌట్‌ మ్యాచ్‌ కావొచ్చు.. టైటిల్‌ కోసం తలపడే మ్యాచ్‌ కావొచ్చు.

ఏదైనాసరే సేమ్‌ సీన్‌. ఇరు దేశాల క్రికెట్‌ అభిమానుల్లోనే కాదు, సాధారణ ప్రజానీకంలోనూ ఒకటే ఉత్కంఠ. ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్‌పై భారత్‌కి తిరుగులేని రికార్డ్‌ వుంది. ఆ లెక్కన, గెలుపు నల్లేరు మీద నడకేనన్నది క్రికెట్‌ విశ్లేషకుల వాదన. ఇంత ఒత్తిడిలో పాక్‌, భారత్‌పై విజయం సాధించడం కాదు కదా, కనీసం పోటీ ఇచ్చేందుకూ పోరాడదు. 'ఒత్తిడి'ని తట్టుకోవడం పాకిస్తాన్‌కి కష్టమే మరి. అలాగని, పాకిస్తాన్‌ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 

కాస్సేపట్లో మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో భారత్‌ పూర్తిస్థాయిలో పరిపుష్టంగా వుంది. పాకిస్తాన్‌ విషయానికొస్తే, నిలకడలేమి ఆ జట్టు ఆటగాళ్ళకు పెద్ద మైనస్‌. ఫీల్డింగ్‌లో చాలా లోపాలున్నాయి. లీగ్‌ దశలో భారత్‌ – పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ విషయం స్పష్టంగా కన్పించింది. దాన్ని పాక్‌ ఎంతవరకు 'కవర్‌' చేసుకుంటుంది.? అన్నదీ వేచి చూడాల్సిందే. 

ఒక్కటి మాత్రం నిజం. ఆట అన్నాక గెలుపోటములు సహజం. ఇరుదేశాల మధ్యా ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్‌ ఓడిపోతే, అక్కడి క్రికెటర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం మామూలే. అదే సమయంలో, భారత్‌కి వ్యతిరేకంగా ఫలితాలొస్తే, ఇండియాలోనూ కొన్ని చోట్ల దేశ వ్యతిరేక శక్తులు సంబరాలు చేసుకోవడం చూస్తున్నాం.

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ని ఇరు పట్ల మధ్య పోరులా కాకుండా, ఇరు దేశాల మధ్య క్రికెట్‌ యుద్ధంలా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అందుకే ఇది ఆట మాత్రమే కాదు.. అంతకు మించి.. అని చెప్పుకోవాలేమో. 

సోషల్‌ మీడియాలో జరుగుతున్న 'వార్‌', మీడియాలో జరుగుతున్న ప్రచారం.. వెరసి కనీ వినీ ఎరుగని స్థాయిలో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.