ఒక్కసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే ఎలా ఉంటుందో ప్రభాస్ కు ఇప్పుడు తెలిసొచ్చింది. బాహుబలి-2తో క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో నేషనల్ మీడియాకు ఓ వార్తా వస్తువుగా మారాడు.
ప్రభాస్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని హైలెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఎలా వచ్చిందో, ఎక్కడ్నుంచి వచ్చిందో ప్రభాస్ కు సంబంధించిన ఆధార్ కార్డు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
ఆ ఆధార్ కార్డును పట్టుకొని బాలీవుడ్ సోషల్ మీడియా రచ్చ రచ్చ చేస్తోంది. బాహుబలికి ముందు ప్రభాస్ ఇలా ఉండేవాడంటూ ఆధార్ కార్డులోని చెత్త ఫొటోను ప్రముఖంగా చూపిస్తున్నాయి.
ఎంత అందమైన ఫొటో అయినా ఆధార్ కార్డులో చెత్తగా కనిపిస్తుందనే విషయం అందరికీ తెలుసు. పాపం ప్రభాస్ ఫొటో కూడా చెత్తగానే పడింది.
దాన్నే పట్టుకొని రకరకాల కథనాలు రాయడం ప్రారంభించింది బాలీవుడ్ మీడియా. బాహుబలికి ముందు ప్రభాస్ ముఖానికి సర్జరీ చేయించుకున్నాడని కొందరు, బాహుబలిలో ప్రభాస్ ను గ్రాఫిక్స్ లో చూపించారని మరికొందరు.. ఇలా ఇష్టమొచ్చినట్టు రాతలు రాసేస్తున్నారు.
ఈ వార్తలు అవాస్తవాలనే విషయం టాలీవుడ్ ప్రేక్షకులకు తెలుసు. కానీ బాలీవుడ్ జనాలు మాత్రం వీటిని నిజమని ఫీల్ అవ్వడం బాధాకరం. ఇలాంటి వార్తలపై రియాక్ట్ అయితే ఏమౌతుందో ప్రభాస్ కు బాగా తెలుసు. అందుకే ఓ నవ్వు నవ్వేసి ఊరుకుంటున్నాడు.