చివరి సారి ఐసీసీ ఈవెంట్స్ లో కానీ, ఎక్కువ దేశాల జట్లు పాల్గొనే ట్రోఫీని టీమిండియా నెగ్గి చాలా కాలం అవుతోంది. ప్రపంచకప్ లు, టీ20 ప్రపంచకప్ లు ఒకదాని తర్వాత మరోటి వస్తూ ఉన్నాయి, పోతున్నాయి… వాటిల్లో ప్రతి సారీ టీమిండియా వాటిల్లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగడం, ఆ పై కీలక మ్యాచ్ లలో టీమిండియా చేతులెత్తేయడం కొనసాగుతూ వస్తోంది. ఇటీవలి ఆసియా కప్ ఆరంభంలో కూడా టీమిండియా హాట్ ఫేవరెట్ గా కనిపించింది.
టీమిండియా తప్ప మరే జట్టు ఇప్పుడు ఆసియా కప్ ను నెగ్గగలదు? అనేంత రేంజ్ లో వినిపించాయి విశ్లేషణలు. కట్ చేస్తే… టీమిండియా రెండే రెండు విజయాలతో ట్రోఫీ పోరు నుంచి నిష్క్రమించింది. పాకిస్తాన్ లో ఒక మ్యాచ్ లో ఏదో లక్కీగా నెగ్గి, రెండో మ్యాచ్ ను చేజార్చుకుంది. శ్రీలంక చేతిలో కూడా ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు శ్రీలంకను ఎవ్వరూ ఫేవరెట్ గా పరిగణించలేదు! ఆఖరికి అఫ్ఘానిస్తాన్ అయినా అద్భుతం చేస్తుందేమో అనుకున్న వారు ఉంటారేమో కానీ, శ్రీలంకను ఎవ్వరూ ఖాతరు చేయలేదు. అన్నింటికీ మించి టీమిండియాకు ఆసియా కప్ మరో భంగపాటుగా మిగిలింది.
మరి ఇంతలోనే టీ20 ప్రపంచకప్ కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. మరి ఈ సారైనా.. అనే సణుగుడు వినిపిస్తోందిప్పుడు. ఐపీఎల్ లో అరివీర భయంకరమైన హిట్టర్లు, ఫినిషర్లు, మ్యాచ్ విన్నర్లు.. అంతా టీమిండియాలోనే ఉన్నారు. ఐపీఎల్ వారు ఒంటి చేత్తో ఫలితాలను మార్చేసే తీరును చూశాకా.. అంతర్జాతీయ మ్యాచ్ ల విషయంలో కూడా భారీ అంచనాలు ఏర్పడతాయి. అయితే.. అవేవీ ఆచరణలో సాధ్యం కావడం లేదు. ప్రతి సారీ టీమిండియా టైటిల్ ఫేవరెట్ అనుకోవడం, ఆ తర్వాత అబ్బే.. అనుకోవడం రొటీన్ గా మారింది.
2015, 2019 లలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లు, టీ20 ప్రపంచకప్ లు అన్నింటా టీమిండియాకు నిరాశే మిగిలింది. సెమిస్ లెవల్ వరకూ వెళ్లి .. తిరుగుముఖం పట్టడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. టీమిండియా చివరిసారి థ్రిల్లింగ్ గా గెలిచింది.. బహుశా అప్పుడెప్పుడో జరిగిన టీ20 ఫార్మాట్ లో జరిగిన ఆసియాకప్ కావొచ్చు. ఆఖరి ఓవర్లో బంగ్లాదేశ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ దగ్గర నుంచి ప్రతిసారీ టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటూనే.. సాధించింది ఏమీ లేదు! ఇలాంటి క్రమంలో.. ఈ సారి టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు ప్రదర్శన ఏ స్థాయిలో ఉంటుందనేది ఆసక్తిదాయకమైన అంశంగా మారింది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో దాదాపు ఆసియా కప్ జట్టే టీ20 ప్రపంచకప్ లో పాల్గొననుంది. ఆరంభ టీ20 ప్రపంచకప్ లో ఆడిన దినేష్ కార్తీక్ ఈ సారి అవకాశం సంపాదించుకోవడం పెద్ద విశేషం.