ఆమె ఏపీలో కొత్తగా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయ్యారు. మూడేళ్ళు తిరగకుండానే మంత్రి అయ్యారు. అది కూడా కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ ఆమెకు అప్పగించారు. అయిదు నెలల కాలంలో ఆమె తన పనితీరుని బాగానే మెరుగుపరచుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల హాజరు విషయంలో పర్టిక్యులర్ గా ఉంటున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో నాడు నేడు కార్యక్రమాలను పరిశీలిస్తూనే వైద్య ఆరోగ్యం అక్కడ ఎలా ఉందో ఆసుపత్రులకు ఆకస్మిక తనిఖీలు చేస్తూ తెలుసుకుంటున్నారు. సాయంత్రం అయిపోయింది ఇక ఎవరూ రారులే అనుకుంటున్న వేళ మాటమాత్రమైన కబురు తెలియనీయకుండా ఆమె విశాఖ పెద్దాసుపత్రిలో ప్రత్యక్షం అయ్యారు. ఆమె ప్రతీ వార్డులోనూ కలియతిరుగుతూ రోగులతోనే నేరుగా సంభాషించడంతో ఆసుపత్రి వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాయి.
ఆసుపత్రి సేవలు ఎలా ఉన్నాయి. సిబ్బంది సమయానికి హాజరవుతున్నారా లేదా అని ఆమె రోగులను వాకబు చేశారు. ఇక విశాఖలో తన పర్యటనలో వరసగా మరో నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులను ఆమె తనిఖీ చేసి అక్కడ సిబ్బందికి హడలెత్తించారు. వైద్య ఆరోగ్య శాఖలో మార్పులు అవసరమని వైద్య మంత్రి అంటున్నారు.
ఏపీలో మెరుగైన వైద్యం కార్పోరేట్ తరహాలో సామాన్యుడికి అందాలన్నదే ప్రభుత్వ విధానమని విడదల రజనీ పేర్కొంటున్నారు. పేదలకు వైద్యం అందే విషయంలో ఏ ఓక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా సహించేది లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు. అలా మహిళా మంత్రి హడలెత్తిస్తూ వైద్య సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు.