ధర్మంగా మాట్లాడే మంత్రి ధర్మాన ప్రసాదరావు ధర్మాగ్రహం ఏంటో చూపించారు. చంద్రబాబూ మేము మీకెలా కనిపిస్తున్నామని ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్రా వాళ్ళంటే మీరు ఏం చేస్తే చూస్తూ నోరుమూసుకుని కూర్చోవాలా అంటూ రైజ్ అయ్యారు. గడచిన టీడీపీ పాలనలో కేంద్రం 23 కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇస్తే వాటిలో ఒక్కటైనా శ్రీకాకుళంలో పెట్టావా చంద్రబాబూ అని ధర్మాన నిలదీశారు.
ఉత్తరాంధ్రా ప్రాంత్రం వారికి ఏ అవసరాలూ లేవని, వారు అలాగే మౌనంగా ఉండాలని చెప్పడమే బాబు ఉద్దేశ్యమా అని ధర్మాన కడిగిపారేశారు. విశాఖ క్యాపిటల్ గా పనికిరాదు అని బాబు భావిస్తే తాను సీఎం అయ్యాక తొలి క్యాబినేట్ మీటింగ్ విశాఖలోనే ఎందుకు పెట్టారో చెప్పాలని కూడా ధర్మాన ప్రశ్నించారు. విశాఖ అన్ని రకాలుగా అర్హత కలిగిన సిటీ అని ధర్మాన పేర్కొన్నారు.
రైతులను రెచ్చగొట్టి ఉత్తరాంధ్రా మీదకు పంపిస్తున్నది చంద్రబాబే అని ధర్మాన ఆరోపించారు. తమకు కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ రైతుల పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదని, ఆ 29 గ్రామాలకు న్యాయం చేయలన్నదే తమ విధానం అని ఆయన అన్నారు. అందుకే అమరావతిలో శాసనరాజధాని ఉంచామని, విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూల్ కి న్యాయ రాజధాని ఇస్తూ అన్ని ప్రాంతాలకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తోంది అని ఆయన చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగ స్పూర్తితో కూడుకున్నదని, కేంద్రం నియమించిన శివరామక్రిష్ణన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ఉందని, అలాగే మూడు ప్రాంతలా ప్రజలు మెచ్చుకునేలా ఉందని ఆయన అంటున్నారు. హైదరాబాద్ మోడల్ తో ఒకే చోట అభివృద్ధిని కుప్పపోసి ఒకసారి మోసపోయామని, మరో అరవై ఏళ్ల పాటు అమరావతిని మోసి అక్కడ వారు మీరు మాకొద్దు అంటే ఉత్తరాంధ్రా, రాయలసీమ ఏమవ్వాలని ధర్మాన సూటిగా ప్రశ్నించారు.
అలా జరగదని ఎవరైనా హామీ ఇవ్వగలరా అని ఆయన నిలదీశారు. అమరావతి రైతుల పాదయాత్ర స్టార్ట్ అయిన నేపధ్యాన ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతతో కూడుకున్నవే.