ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతానికి సంబంధించి చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు ఓనర్, బీసీసీఐ ఛైర్మన్ శ్రీనివాసన్‌కి సర్వోన్నత న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. దాంతో, బీసీసీఐ ఛైర్మన్ పదవిలో శ్రీనివాసన్ కొనసాగేందుకు ఆస్కారం ఏర్పడింది. అయితే చెన్నయ్ సూపర్ కింగ్స్ ఓనర్‌గా ఇకపై శ్రీనివాసన్ వ్యవహరించేందుకు అవకాశం లేదు. ఏదో ఒక పదవిలో మాత్రమే వుండాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పడంతో, శ్రీనివాసన్ బీసీసీఐ ఛైర్మన్ పదవి వైపే మొగ్గు చూపనున్నారు.
ఇక, శ్రీనివాసన్‌కి క్లీన్ చిట్ విషయమై అంతా ఊహించినట్లే జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తెరపైకొచ్చినప్పుడే క్రికెట్‌లో బెట్టింగ్ మాఫియా మరింత ముదిరిపోతుందన్న వాదనలు విన్పించాయి. ‘జాతీయ స్థాయిలో టాలెంట్ వున్న యంగ్ క్రికెటర్లను గుర్తించి, వారికి జాతీయ జట్టులో అవకాశం కల్పించేందుకు..’ అంటూ ఐపీఎల్‌ని తెరపైకి తెచ్చారు. ఉద్దేశ్యం ఏదైనా, ఐపీఎల్ మాటున జూదం విచ్చలవిడిగా జరిగింది.
ఈ నేపథ్యంలోనే ఆ జూదానికి బీసీసీఐలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్న విమర్శలు తెరపైకొచ్చాయి. బీసీసీఐ పెద్దల ప్రమేయం లేకుండా, ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగా? ఛాన్సే లేదు.. అంటూ వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఇవి సాదా సీదా విమర్శలు మాత్రమే అని కొట్టి పారేయడానికి లేదు. ఆటగాళ్ళు, ఆయా జట్ల యజమానులు స్పాట్ ఫిక్సింగ్‌లో ఇరుక్కుపోయారు.
ఎలాగూ ఆటగాళ్ళకూ, బీసీసీఐ పెద్దలకూ, ఫ్రాంఛైజీ ఓనర్లకూ సన్నిహిత సంబంధాలుంటాయి. ఆ లెక్కన ఫిక్సింగ్‌తో బీసీసీఐకి సంబంధం లేకుండా ఎలా వుంటుంది.? అలాంటప్పుడు బీసీసీఐ ఛైర్మన్ శ్రీనివాసన్‌కి క్లీన్ చిట్ రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. సర్వోన్నత న్యాయస్థాంన క్లీన్ చిట్ ఇచ్చిన దరిమిలా, స్పాట్ ఫిక్సింగ్ అనే వివాదం నుంచి కడిగిన ముత్యంలా శ్రీనివాసన్ బయటపడ్డారు.
ఇది చాలామంది ఊహించిందే. కానీ, ఆయనపై విమర్శలు, ఆరోపణలు, అనుమానాలూ.. జనబాహుళ్యంలో ఇంకా అలానే వున్నాయి.