భద్రాచలం దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలో వుందిప్పుడు. ఇంతకుముందువరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సంబంధించి) శ్రీరామనవమి ఉత్సవాల్ని భద్రాచలంలో అధికారికంగా నిర్వహించేది. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలూ గట్రా ఆ ఆలయానికి సమర్పించేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పని చేస్తుంది. మరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలి.? ఈ ప్రశ్నకు సమాధానంగా ఒంటిమిట్టను చూపిస్తున్నారు కడప జిల్లా ప్రజానీకం.
కడప జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒంటిమిట్ట ఒకటి. పురాతన కోదండరామాలయం ఒంటిమిట్టకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని అభివృద్ధి చేయాలని కడప జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఈ మేరకు ఉద్యమించడానికైనా వెనుకాడేది లేదని కడప జిల్లా ప్రజానీకానికి మద్దతుగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన వివిధ జిల్లాల ప్రజానీకం.
విచిత్రమైన పరిస్థితే ఇది. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగమైన భద్రాచలం, కొన్ని రాజకీయ కారణాలతో ఇప్పుడు తెలంగాణలోనే వుండిపోవాల్సి వచ్చింది. అలాగని, దేవుడికి ప్రాంతాల్ని అంటగట్టగలమా.? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి ఉత్సవాల విషయంలో ఏం చేస్తుందోగానీ, భద్రాచలంకి పోటీగా కాకపోయినా, ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని అభివృద్ధి చేస్తే అంతకన్నా కావాల్సిందేముంది.?