ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వరల్డ్‌కప్ క్రికెట్ పండగ రానే వచ్చింది.. పండగ మొదలైంది. 44 రోజులు 49 మ్యాచ్‌లు.. 14 టీమ్‌లు.. హోరా హోరీగా మైదానంలో తలపడనున్నాయి. పసికూనలు, టైటిల్ ఫేవరెట్లు.. ఎవరి వ్యూహాలు వారివే. బౌన్సర్లు, కళ్ళు చెదిరే కవర్ డ్రైవ్‌లు.. యార్కర్లు.. హెలికాప్టర్ షాట్లు.. ఒకటేమిటి.. క్రికెట్‌లోని అన్ని అస్త్రాల్నీ ఆటగాళ్ళు ప్రయోగించనున్నారు.
తొలి రోజు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్, శ్రీలంక తలపడనున్నాయి. న్యూజిలాండ్, శ్రీలంక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ సెంచరీ కొట్టకపోయినా, 300 మార్క్ దాటించగలిగారు టీమ్ స్కోర్‌ని. లంక బ్యాటింగ్ చేస్తోంది. అంటే లంక బౌలర్ల ప్రభావం పెద్దగా ఏమీ లేనట్టే.
ఇక, ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మ్యాచ్ కాస్సేపటి క్రితమే ప్రారంభమైంది. క్రికెట్‌లో దాయాది దేశాలుగా పిలవబడ్తుంటాయి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్‌ని ఇరుదేశాల్లోని క్రికెట్ అభిమానులు నరాలు తెగే ఉత్కంఠతో చూస్తున్నారు. రేపు క్రికెట్‌లో అసలు సిసలు మజా వుండబోతోంది. ఆ మజాని ఇవ్వబోతోంది భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్.