శ్రీలంక చేతులెత్తేసింది.. కివీస్ బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించింది.. వెరసి వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ని విజయం వరిస్తే.. శ్రీలంకకు మాత్రం పరాజయమే మిగిలింది. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ వైఫల్యం చెందిన లంక ఆటగాళ్ళు తగిన మూల్యం చెల్లించుకున్నారు.
వరల్డ్‌కప్ క్రికెట్ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆరు వికెట్లు కోల్పోయి 50 ఓవర్లలో 331 పరుగులు చేసింది. 332 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, తొలుత బాగానే బ్యాటింగ్ ప్రారంభించినా, కాస్సేపటికే లంక వికెట్ల పతనం ప్రారంభమైంది. ఏ దశలోనూ లంక బ్యాట్స్‌మన్, కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు.
46.1 ఓవర్లలోనే శ్రీలంక చాప చుట్టేసింది. విజయం కోసం 332 పరుగులు చేయాల్సిన శ్రీలంక, 233 పరుగలకు అలౌట్ అయ్యింది. దాంతో న్యూజిలాండ్‌కి ఘనవిజయం దక్కింది. రెండు వికెట్లు తీసి, 46 బంతుల్లో 75 పరుగులు చేసిన కివీస్ ఆటగాడు కోరె అండర్సన్‌ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
ఇదిలా వుంటే, వరల్డ్ కప్‌లో భాగంగా ఈ రోజు జరిగిన ఇంకో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కుదురుకుంది. 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను సెంచరీతో అరోన్ ఫించ్ ఆదుకున్నాడు. అతనికి బెయిలీ నుంచి మంచి సహాకారం అందింది. మొదట్లో తెగువ చూపిన ఇంగ్లాండ్ బౌలర్లు, ఫించ్ ధాటికి చేతులెత్తేయాల్సి వచ్చింది.