ధనాధన్‌ ధోనీ కుంటి సాకులు

టీమిండియా బ్యాటింగ్‌లో అదుర్స్‌.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో తుస్సు తుస్సు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు వన్డేల్లోనూ టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఘోర పరాజయం.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే,…

టీమిండియా బ్యాటింగ్‌లో అదుర్స్‌.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో తుస్సు తుస్సు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు వన్డేల్లోనూ టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఘోర పరాజయం.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా 300 పై చిలుకు టార్గెట్‌నే ప్రత్యర్థి ముందుంచినా, ఓడిపోయింది మరి. 

ఇక్కడ టీమిండియా బౌలింగ్‌ చెత్తలా వుందన్నది కాదనలేని వాస్తవం. సొంత పిచ్‌ల మీద పులులు.. విదేశీ పిచ్‌ల మీద పిల్లులు.. అన్న విమర్శ టీమిండియా బౌలర్లపై ఈనాటిది కాదు. బ్యాట్స్‌మెన్‌ ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే ఈసారి బ్యాట్స్‌మెన్‌ సత్తా చాటుతున్నారు.. బౌలర్స్‌ మాత్రం అత్యంత పేలవంగా బౌలింగ్‌ చేస్తుండడం దురదృష్టకరం. ఫీల్డింగ్‌లోనూ వైఫల్యం టీమిండియాని వెంటాడుతోంది. 

'300 టార్గెట్‌ చిన్నదిలా వుంది.. 330 పైన పరుగులు చేసి వుంటే బావుండేదేమో..' అని టీమిండియా కెప్టెన్‌ ధోనీ సరదాగా అన్నాడో, సీరియస్‌గా అన్నాడోగానీ.. ఇది టీమిండియా దయనీయ స్థితికి నిదర్శనం. 200 పరుగులు చేసి కూడా, బౌలింగ్‌తో సత్తా చాటిన సందర్భాలు ఎన్నో వున్నాయి. ధోనీ మాటల్లో వెటకారం కన్పిస్తోంది.. అదే సమయంలో ధోనీ కుంటి సాకులు వెతుక్కుంటున్నాడనే కోణాన్నీ కాదనలేం. 

ధోనీలో మునుపటి 'కెప్టెన్‌' కన్పించడంలేదు.. కెప్టెన్‌గా ధోనీ వ్యూహాలు ఫెయిలవుతున్నాయి.. బౌలర్లూ చేతులెత్తేస్తున్నారు.. వెరసి ఆస్ట్రేలియాలో వరుస పరాజయాలు టీమిండియాకి తప్పడంలేదు. దారుణమైన విషయమేంటంటే, రెండు మ్యాచ్‌లలోనూ సెంచరీలతో సత్తా చాటిన రోహిత్‌ శర్మపై 'అతను సెంచరీ చేస్తే టీమిండియా ఓటమి ఖాయం..' అనే కామెంట్స్‌ వస్తుండడం.