సినిమా రివ్యూ: సోగ్గాడే చిన్నినాయనా

రివ్యూ: సోగ్గాడే చిన్నినాయనా రేటింగ్‌: 3/5 బ్యానర్‌: అన్నపూర్ణ స్టూడియోస్‌ తారాగణం: అక్కినేని నాగార్జున (ద్విపాత్రాభినయం), రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, నాగబాబు, బ్రహ్మానందం, సంపత్‌ రాజ్‌, వెన్నెల కిషోర్‌, ఝాన్సీ, అనసూయ, హంసనందిని,…

రివ్యూ: సోగ్గాడే చిన్నినాయనా
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: అన్నపూర్ణ స్టూడియోస్‌
తారాగణం: అక్కినేని నాగార్జున (ద్విపాత్రాభినయం), రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, నాగబాబు, బ్రహ్మానందం, సంపత్‌ రాజ్‌, వెన్నెల కిషోర్‌, ఝాన్సీ, అనసూయ, హంసనందిని, అనుష్క (ప్రత్యేక పాత్రలో) తదితరులు
కథనం: సత్యానంద్‌
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: ప్రవీణ్‌ పూడి
ఛాయాగ్రహణం: పి.ఎస్‌. వినోద్‌, సిద్ధార్థ్‌. ఆర్‌
నిర్మాత: నాగార్జున అక్కినేని
రచన, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల
విడుదల తేదీ: జనవరి 15, 2016

అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో, పూర్తిగా పల్లెటూరి పాత్రలతో తెలుగు సినిమా వచ్చి చాలా కాలమవుతోంది. ఆ లోటు 'సోగ్గాడే చిన్నినాయనా'తో తీరిపోతుంది. దీనికి సంక్రాంతి కంటే మంచి ముహూర్తం ఉండదేమో. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయిన దగ్గర్నుంచి ఈ చిత్రంపై ఒక విధమైన పాజిటివ్‌ ఫీల్‌ జనరేట్‌ అయింది. పంచెకట్టులా నాగార్జున గెటప్‌కి తోడు సినిమా ట్రెయిలర్లు కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తూ కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రమనే భావన కలిగించింది. అయితే ఈ చిత్రంలో నాగార్జున చేసిన ద్విపాత్రల్లో ఒకటి 'ఆత్మ' అనే సంగతి రివీల్‌ చేసి దీంట్లోని సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ ఏంటనేది కూడా చెప్పేసారు. 

పనిలో పడి భార్యని నిర్లక్ష్యం చేస్తున్న కొడుకుని (నాగార్జున) వదిలేస్తానని కోడలు (లావణ్య) అంటే, అతని తల్లి (రమ్యకృష్ణ) బెంగ పడిపోతుంది. ఎప్పుడూ ఆడవాళ్ల చుట్టూ తిరిగిన తన భర్తలా (నాగార్జున) కొడుకు కాకూడదని అతడిని ఆడపిల్లలకి దూరంగా పెంచిన ఆమె ఇప్పుడు కొడుకు జీవితం ఏమవుతుందోనని కంగారు పడుతుంది. చనిపోయిన భర్త ఫోటో ముందు చేరి తన గోడు చెప్పుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో నరకంలో ఆడ భటులతో సరసాలు ఆడుతోన్న ఆమె భర్తకి ఆమె పిలుపు వినిపిస్తుంది. ఇంట్లో చక్కబెట్టాల్సిన పనులున్నాయంటూ యముడే (నాగబాబు) స్వయంగా అతడిని కిందకి పంపిస్తాడు. కొడుకుని దారికి తేవడంతో పాటు తన కుటుంబానికి ఉన్న ప్రమాదాన్ని కూడా తప్పిస్తాడు. 

చెప్పుకోవడానికి చాలా సింపుల్‌గా అనిపించే కథ. ఆత్మగా ఒక పాత్ర వచ్చి కొడుకుని దార్లో పెట్టాలి కనుక ఫాంటసీ కూడా తోడయింది. ఫాంటసీ తోడవడంతో ఇక ఆ కోణంలో కూడా స్క్రీన్‌ప్లేని విస్తరించుకునే వీలు చిక్కింది. దాంతో పాము, దేవుడి నగలు, వాటి మీద కన్నేసే దుర్మార్గులు… ఇలా వివిధ విశేషాలు జోడించుకుని పక్కా కమర్షియల్‌ ప్యాకేజ్‌ సిద్ధమైంది. ఎప్పుడూ పని ధ్యాసలో పడి భార్యని లెక్క చేయని కొడుకుని అటు డైవర్ట్‌ చేయడానికి తండ్రి ఆత్మ పడే పాట్లు, అలాగే కనిపించిన ప్రతి అమ్మాయితో సరసాలాడే అతని స్వభావం వల్ల చిలిపి అల్లర్లు.. ఇలా ప్రథమార్ధం సరదాగా సాగిపోతుంది. తండ్రి చనిపోవడానికి వెనుక కుట్ర ఉందనేది రివీల్‌ చేయడం ద్వారా చిన్న సస్పెన్స్‌తో ఇంటర్వెల్‌ ఇచ్చి, కొడుకు కాపురం చక్కబడిన తర్వాత ఆ విలన్లెవరనే గుట్టు విప్పి కథ క్లయిమాక్స్‌కి చేరుతుంది. ఎక్కడా నేల విడిచి సాము చేయని కథనంలో వినోదం పెద్దలకు మాత్రమే అప్పీలింగ్‌గా అనిపిస్తుంది. ఫ్యామిలీ డ్రామానే అయినా కానీ చిన్న పిల్లలు మెచ్చే అంశాలేం లేవు. పైగా నాగార్జున 'బంగార్రాజు' పాత్ర మరీ రొమాంటిక్‌ కావడం, కొడుకు-కోడలు మధ్య ఉన్నది కూడా ప్రధానంగా పర్సనల్‌ ప్రాబ్లమ్‌ అవడం వల్ల డిస్కషన్‌ ఎక్కువగా బెడ్‌రూమ్‌ సంగతులు, రొమాంటిక్‌ ముద్దు ముచ్చట్ల గురించే ఉంటుంది. 

ఈ కమర్షియల్‌ ప్యాకేజ్‌లో అన్ని అంశాలు ఉండేట్టు చూసుకున్నారు కానీ ఎమోషనల్‌ డెప్త్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టలేదు. ఫ్యామిలీ డ్రామాలో టచింగ్‌ మూమెంట్స్‌ లేకపోవడం ఒకింత లోటే మరి. రాము, సీత (నాగ్‌, లావణ్య) సమస్యని పరిష్కరించడానికి ఎక్కువ సమయం కేటాయించినట్టనిపించింది. సీతకి భర్త పట్ల ఇన్‌సెక్యూరిటీ పుట్టించడానికని అనసూయ, హంసనందిని పాత్రలని ఇంట్రడ్యూస్‌ చేసినా కానీ అది మరీ డ్రామాని తలపించింది. పెళ్లయిన బావ కోసం అందరు మరదళ్లు ఎగబడిపోతూ ఉండడం, ఏదో పాట కోసం సందర్భాన్ని సృష్టించినట్టు ఉంటుంది. దాని తర్వాత వచ్చే సన్నివేశాలు సైతం అలాగే అనిపిస్తాయి. సెకండ్‌ హాఫ్‌లో కాస్త జోరు తగ్గినా కానీ కమర్షియల్‌ మీటర్‌ని ఫాలో అయిపోయారు. ప్రీ క్లయిమాక్స్‌ ముందు చిన్న సమస్య, సంఘర్షణ, దానికి పరిష్కారం వగైరా అన్నీ కూడా ఫార్ములాకి తగ్గట్టు కమర్షియల్‌ స్క్రీన్‌ప్లే ఫార్మాట్‌లో వెళ్లిపోతాయి. ఓవరాల్‌గా 'సోగ్గాడే చిన్నినాయనా'లో కదిలించే సన్నివేశాలు కానీ, గుర్తుండిపోయే అనుభూతులు కానీ లేకపోయినా చూస్తున్నంతసేపు కాలక్షేపమైపోతుంది.

ఈ చిత్రానికి మాగ్జిమం క్రెడిట్‌ నాగార్జునకే దక్కుతుంది. ముఖ్యంగా బంగార్రాజు పాత్రలో ఆయనని చూడ్డానికి హాయిగా అనిపిస్తుంది. నాగార్జున ఈ పాత్రని ఎంతో ఎంజాయ్‌ చేస్తూ చేసారనేది ఆయన బాడీలాంగ్వేజ్‌లోనే తెలిసిపోతుంది. ఈ పాత్రని ఎక్కడా ఆడియన్స్‌ మిస్‌ అవకుండా దాదాపుగా సినిమా అంతా ఉండేట్టు చూసుకోవడంలో స్క్రీన్‌ప్లే రచయిత సక్సెస్‌ అయ్యాడు. నాగార్జున కెరీర్‌లో బంగార్రాజు ఒక గుర్తుండిపోయే పాత్రగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అమాయకుడైన రాము పాత్రలోను నాగార్జున చాలా బాగా చేసారు. ఏది అడిగినా 'ఐ విల్‌ గూగుల్‌ ఇట్‌' అంటూ ఆ పాత్రతో కూడా నవ్వించారు. రమ్యకృష్ణ కంటే సత్యభామ పాత్రకి మరింకెవరూ సూట్‌ కారు. లావణ్య కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. నాగబాబు, నాజర్‌ తదితర పాత్రధారులంతా తమవంతు సహకారం అందించారు. 

అనూప్‌ పాటల్లో 'మనం' ఛాయలు వినిపించినా కానీ దాదాపుగా పాటలన్నీ ఎంజాయ్‌ చేసేలానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. గ్రాఫిక్స్‌ మీద శ్రద్ధ తీసుకోవాల్సింది. కొత్త దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఎక్కడా తడబడకుండా ఈ కమర్షియల్‌ చిత్రాన్ని బ్యాలెన్స్‌డ్‌గా నడిపించాడు. ఎక్కడా నేటివిటీ మిస్‌ కాకుండా ఒక చక్కని రూరల్‌ ఫాంటసీ డ్రామాని అందించాడు. ప్రధానంగా బంగార్రాజు పాత్రని అంత వినోదాత్మకంగా మలిచిన తీరుకి మాత్రం దర్శకుడు అభినందనీయుడు. 

ఈ సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు ఒక్కోటీ ఒక్కో రకంగా ఉన్నాయి. అయితే అన్నిట్లోకి కమర్షియల్‌ సూత్రాలని సరిగ్గా ఫాలో అయిందీ, ప్రయోగాల జోలికి పోకుండా సింప్లిసిటీ పాటిస్తూ అన్ని వర్గాలని అలరించేలా ముస్తాబయిందీ మాత్రం సోగ్గాడే అనడంలో సందేహాలు అక్కర్లేదు. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా లేకపోయినా, గుర్తుండిపోయే అంశాలేవీ లేకపోయినా కానీ పండక్కి ఎలాంటి కాంప్లికేషన్స్‌ లేని ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడంలో సోగ్గాడు సక్సెస్‌ అయ్యాడు. 

బోటమ్‌ లైన్‌: నాగార్జునకే క్రెడిటంతా!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri