రివ్యూ: ఎక్స్‌ప్రెస్ రాజా
రేటింగ్: 3/5
బ్యానర్: యు.వి. క్రియేషన్స్
తారాగణం: శర్వానంద్, సురభి, సప్తగిరి, ప్రభాస్ శ్రీను, హరీష్ ఉత్తమన్, ఊర్వశి, ధన్‌రాజ్, బ్రహ్మాజీ, షకలక శంకర్, సుప్రీత్, నాగినీడు, సూర్య తదితరులు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
కూర్పు: సత్య జి.
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: వి. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
విడుదల తేదీ: జనవరి 14, 2016
మూడు భారీ చిత్రాలు విడుదలవుతున్నాయని తెలిసినా, అన్నిట్లో చిన్న సినిమా కనుక దీనికి థియేటర్లు తగినన్ని ఉండవని ఊహించినా కాంపిటీషన్‌ని వెరవకుండా 'ఎక్స్‌ప్రెస్ రాజా'ని విడుదల చేస్తున్నారంటేనే దీంట్లో ఏదో ప్రత్యేకత ఉంటుందనే అంచనాలు ఏర్పడ్డాయి. శర్వానంద్‌కి ఎక్కువ హిట్లు లేవేమో కానీ అతనికి మంచి టేస్ట్ ఉందనేది చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడిప్పుడే రేంజ్ పెంచుకుంటోన్న శర్వానంద్ మరోసారి ఒక మంచి వినోదాత్మక చిత్రంతో మన ముందుకి వచ్చాడు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'లో బాగా నవ్వించిన దర్శకుడు మేర్లపాక గాంధీ రెండో సినిమాలోను తన టాలెంట్ చూపించాడు. 'రన్ రాజా రన్', 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' టైటిల్స్ మిక్స్ చేసిన 'ఎక్స్‌ప్రెస్ రాజా'లో ఆ రెండూ కలిస్తే ఉండేటంత ఫన్ అయితే లేదు కానీ ఖచ్చితంగా ఎంజాయ్ చేయతగ్గ చిత్రమే ఇది.
'వాంటేజ్ పాయింట్' అనే హాలీవుడ్ థ్రిల్లర్‌లో వాడిన స్క్రీన్‌ప్లే టెక్నిక్‌ని ఎడాప్ట్ చేసుకున్న మేర్లపాక గాంధీ ఒక సరికొత్త వినోదాత్మక చిత్రాన్ని అందించాడు. బేసిక్‌గా దర్శకుడికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కావడంతో చిన్న చిన్న విషయాలతో కూడా నవ్వించగలిగాడు. ప్రతి పాత్రనీ ఫన్నీగా తీర్చి దిద్దడం వల్ల కామెడీకి లోటు లేకుండా సాగిపోతుంది. 75 కోట్ల వజ్రం చుట్టూ తిరిగే ఈ కథలో అస్సలు డెప్త్ లేదు. అందుకే కథనంతో కనికట్టు చేసి, కామెడీతో కట్టి పడేసారు. కథ ముందుకు సాగడానికి ఇబ్బంది పడుతోన్న టైమ్‌లో కొత్త క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేసి గేరు మారుస్తారు. ఉన్న పాత్రలన్నిటినీ వాడుకుంటూ దర్శకుడు చాలా తెలివిగా కథనం రాసుకున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కూడా క్యారెక్టర్స్‌తో ప్లే చేసి ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ కాకుండా చూసిన మేర్లపాక గాంధీ ఈసారి కూడా అదే కిటుకు వాడాడు.
ఫస్ట్ హాఫ్ ఫుల్ సరదాగా సాగిపోతుంది. పోయిన కుక్క పిల్లని వెతికి పట్టుకోవడం, రోడ్ల మీద డిక్షనరీలు అమ్మే వాళ్ల నేపథ్యంలో రొమాంటిక్ ట్రాక్ నడపడం లాంటివి వినడానికి అదోలా అనిపిస్తాయి. కానీ దర్శకుడికి కామెడీ మీద ఉన్న కమాండ్ వల్ల ఇలాంటి సీన్లతోనే ఎక్స్‌ప్రెస్ రాజా ఎంటర్‌టైన్ చేయగలిగింది. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మాదిరిగా రోడ్ల మీద పరుగులు తీస్తుంది. అయితే చిన్న పాయింట్‌ని పట్టుకుని అదే పనిగా సాగదీయడం వల్ల ద్వితీయార్థంలో ఒకింత బోర్ కొడుతుంది. అవసరానికి మించి ఒక ఇరవై నిమిషాల నిడివి ఉన్నట్టనిపించింది. ఇలాంటి వెరైటీ కామెడీల రన్ టైమ్ రెండు గంటల లోపు ఉండేట్టు చూసుకుంటే మరింత ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సినిమా డల్ అవుతున్న ప్రతిసారీ ఏదో ఒక మంచి జోకు పేలడమో లేదా ఒక హిలేరియస్ కామెడీ సీన్ రావడమో జరుగుతుంది కనుక అపుడపుడూ 'ఎక్స్‌ప్రెస్' వేగం మందగించినా కానీ బండి ముందుకి కదిలిపోతుంటుంది.
రన్ రాజాకి ఎక్స్‌టెన్షన్‌లా ఉన్న క్యారెక్టర్‌లో శర్వానంద్ మళ్లీ ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో కంటే మాస్‌గా ఉన్న ఈ పాత్రలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫిట్ అయిపోయాడు. అటు సాఫ్ట్ క్యారెక్టర్లలో మెప్పిస్తూనే ఇటు ఇలాంటి స్పీడ్ పాత్రల్లోను రాణిస్తూ ఎలాంటి కథతో అయినా తన వద్దకి వెళ్లవచ్చుననే కాన్ఫిడెన్స్ దర్శకులకి ఇస్తున్నాడు. సురభి సోసోగా అనిపించింది. సప్తగిరికి చాన్నాళ్ల తర్వాత పెద్ద క్యారెక్టర్ దక్కింది. అక్కడక్కడా ఓవర్ అయినా కానీ కామెడీ డోస్‌ని ఫుల్‌గా అందించాడు. ఎప్పుడూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండిపోయే ప్రభాస్ శ్రీనుకి ఈసారి హీరోతో సమానమైన స్క్రీన్ టైమ్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది. తనదైన శైలిలో పంచ్‌లు వేసాడు. హరీష్ ఉత్తమన్ బాగా చేసాడు. ఊర్వశి కామెడీ ఒకింత ఇరిటేట్ చేస్తుంది. షకలక శంకర్, ధన్‌రాజ్, సుప్రీత్, బ్రహ్మాజీ ఇలా అందరూ తలా ఒక చెయ్యేసి నవ్వుల పంట పండించారు.
హూలాలా, కలర్‌ఫుల్ చిలకా పాటలు బాగున్నాయి. టెక్నికల్‌గా ఈ చిత్రం ఉన్నత విలువలతో రూపొందింది. ప్రొడక్షన్ డిజైన్ టీమ్‌ని అభినందించాలి. సింపుల్ సెట్స్‌తో రిచ్ లుక్ తెచ్చారు. సినిమాటోగ్రాఫర్ టాలెంట్ కూడా క్వాలిటీ ప్రోడక్ట్ కావడానికి ఉపయోగపడింది. చాలా క్యారెక్టర్లున్న ఈ సినిమాకి ఎడిటర్‌కి పెద్ద పనే పడింది. సెకండ్ హాఫ్‌లో ల్యాగ్ తప్పిస్తే మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు.
'రన్ రాజా రన్' రేంజ్‌లో సర్‌ప్రైజ్‌లు లేవు కానీ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మాదిరిగా ఇది కూడా మంచి ఎంటర్‌టైనరే. కాకపోతే ఈ తరహా కామెడీని అందరూ ఎంజాయ్ చేయలేకపోవచ్చు. మాస్ కంటే క్లాస్ ఆడియన్స్‌కి ఎక్కువ అప్పీల్ అయ్యేలా ఉన్న 'ఎక్స్‌ప్రెస్ రాజా' పండక్కి ఫ్యామిలీతో వెళ్లి సరదాగా టైమ్‌పాస్ చేయడానికి చక్కని ఆప్షన్. శర్వానంద్ ఛాయిస్ మీద, యువి క్రియేషన్స్ క్రెడిబులిటీపై నమ్మకముంచి వెళ్లిన వాళ్లకి శాటిస్‌ఫాక్షన్ గ్యారెంటీడ్.
బోటమ్ లైన్: ఫన్ ఎక్స్‌ప్రెస్!
– గణేష్ రావూరి