అబ్బాయ్ పాలిట బాబాయ్ డిక్టేటర్ అయ్యాడు. నియంతలా మారి ఎన్టీఆర్ సినిమాను థియేటర్ల నుంచి మాయం చేశాడు బాలకృష్ణ. ప్రత్యేకించి రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. చాలా మండల కేంద్రాల్లో “నాన్నకు ప్రేమతో'' జాడే లేకుండా పోయింది. తొలి రోజు ఆడింది మాత్రమే ఆట.. రెండో రోజున చాలా థియేటర్లలో “నాన్నకు ప్రేమతో'' కనపడటం లేదు. దీంతో బాబాయ్ దెబ్బకు “నాన్నకు ప్రేమతో' విలవిలలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
వందల కొద్దీ థియేటర్లు.. ఉన్న నగరాలను పక్కన పెట్టి, రెండు మూడు థియేటర్లు ఉన్న మండలకేంద్రాల, ఆరేడు థియేటర్లున్న చిన్న చిన్న పట్టణాల పరిధిలో పరిస్థితి గురించి పరిశీలిస్తే… అలాంటి చోట్ల “నాన్నకు ప్రేమతో'' చూడటం కష్టం అయిపోయింది. తొలి రోజు విడుదల థియేటర్లలో.. రెండో రోజు ఆ సినిమా కనపడలేదు. “నాన్నకు ప్రేమతో'' విడుదల అయిన థియేటర్లోకి డిక్టేటర్ వచ్చేసి పలకరిస్తున్నాడు.
రెండు థియేటర్లు ఉన్న చోట.. ఒక దాంట్లో డిక్టేటర్ ఆడుతుండగా రెండో దాంట్లో “ఎక్స్ ప్రెస్ రాజా'' లేకపోతే “సోగ్గాడే చిన్నినాయన'' వంటి సినిమాలు కనిపిస్తున్నాయి. ఎట్టొచ్చీ నాన్నకు ప్రేమతో అడ్రస్ గల్లంతయిపోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి.. సుకుమార్ కోసమైనా ఆ సినిమాను చూడాలని తపిస్తున్న వారికి నిరాశ మిగులుతోంది.
నాగార్జున సినిమాకో.. శర్వానంద్ సినిమాకో అవకాశం ఇచ్చినా పర్వాలేదు.. ఎన్టీఆర్ సినిమాకు మాత్రం ఛాన్సివ్వకూడదన్నట్టుగా సాగించి సీమ లో ఈ సినిమాల పంచాయతీ. ఏడెనిమిది థియేటర్లు ఉన్న పట్టణాల్లో కూడా వీలైనన్ని ఎక్కువ థియేటర్లను ఆక్రమించింది డిక్టేటర్. మామూలుగా బాలయ్య సినిమాలు అన్ని థియేటర్లను విడుదల చేయరు.
కానీ ఈ సారి తెలుగుదేశం వారు.. దగ్గరుండి ఎన్టీఆర్ సినిమాను దెబ్బతీయడానికి.. బాలయ్య సినిమా థియేటర్ల సంఖ్యను అమాంతం పెంచించారు. ఆంధ్రా సంగతేమో కానీ రాయలసీమలో మాత్రం ఎన్టీఆర్ సినిమాకు దిక్కూదివాణం లేకుండా పోయింది. ఎన్టీఆర్ సినిమాకు థియేటర్లు లేకుండా చేయడంలో కష్టపడ్డ తెలుగుదేశం నేతలతు విజయవంతం అయ్యారు.