డ్రాతో గట్టెక్కిన టీమిండియా

నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ని 2-0 తేడాతో ఓడిపోయింది టీమిండియా. చివరి రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగియడం, కెప్టెన్‌ కోహ్లీ ఈ సిరీస్‌లో రాణించడం మినహా టీమిండియాకి ప్లస్‌ పాయింట్స్‌ దాదాపుగా లేనట్టే. ఓ…

నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ని 2-0 తేడాతో ఓడిపోయింది టీమిండియా. చివరి రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగియడం, కెప్టెన్‌ కోహ్లీ ఈ సిరీస్‌లో రాణించడం మినహా టీమిండియాకి ప్లస్‌ పాయింట్స్‌ దాదాపుగా లేనట్టే. ఓ మ్యాచ్‌లో మురళీ విజయ్‌, ఓ మ్యాచ్‌లో పుజారా, ఓ మ్యాచ్‌లో రాహుల్‌.. ఇలా బ్యాట్స్‌మన్‌ ఎక్కువ మైనస్‌లు, తక్కువ ప్లస్‌లతో సరిపెట్టారు. ఈ సిరీస్‌తో టీమిండియాకి ఓటమికన్నా పెద్ద దెబ్బ ఏంటంటే, కెప్టెన్‌ ధోనీ టెస్ట్‌ క్రికెట్‌కి రిటైర్‌మెంట్‌ ప్రకటించడం.

మొదటి రెండు మ్యాచ్‌లనూ టీమిండియా చేజేతులా కోల్పోయింది. సిరీస్‌ని ఆస్ట్రేలియా 2-0 తేడాతో గెలిచిందంటే, ఆ గెలుపుని టీమిండియా పువ్వుల్లో పెట్టి ఆస్ట్రేలియాకి ఇవ్వడంగానే అభివర్ణించడం సబబేమో. టీమిండియా బౌలర్లు ఈ టెస్ట్‌ సిరీస్‌ని ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. అదే సమయంలో టీమిండియాకి సరైన ఫాస్ట్‌ బౌలర్స్‌, ఆల్‌రౌండర్స్‌ని టెస్టులకోసం వెతికే పనిలో బీసీసీఐ ఇప్పటికైనా దృష్టిపెట్టాల్సి వుంది.

ఓవరాల్‌గా టీమిండియా ఆస్ట్రేలియా సిరీస్‌లో ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. సిరీస్‌కి ముందు తమ ఆటగాడు హ్యూస్‌ మైదానంలో బౌన్సర్‌ దెబ్బకు ప్రాణాలు కోల్పోగా, అది ఆసీస్‌ ఆటగాళ్ళలో ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తుందని అంతా ఊహించారు. అయితే టీమిండియాపై ఘనవిజయం సాధించి, సిరీస్‌ని హ్యూస్‌కి అంకితం చేసింది ఆస్ట్రేలియా.

చివరి మ్యాచ్‌లోనైనా టీమిండియా నెగ్గి, ఆ విజయాన్ని టెస్ట్‌కి క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పిన ధోనీకి అంకితం చేసి వుంటే బావుండేది. అంతకన్నా ముందు, చివరి మ్యాచ్‌కి నాయకత్వం వహించి, టీమ్‌ని గెలిపించి.. టెస్ట్‌ క్రికెట్‌కి ధోనీ ఘనంగా వీడ్కోలు పలికి వుంటే ఇంకా బాగుండేదేమో.! ప్చ్‌.. ఇప్పుడు అనుకుని ఏంలాభం.? జరగాల్సిన నష్టం జరిగిపోయింది.