మొత్తం కుట్రదారులు ఏడుగురిలో నాయకులు నాథూరామ్, ఆప్టేలు ఏ ఆయుధాలూ చేపట్టరు – కురుక్షేత్రంలో కృష్ణుడిలా! తక్కిన అయిదుగురు ఉపయోగించవలసినది – .38 రివాల్వరు (ఫైరింగు ప్రాక్టీసు చేయడానికి సమయం చాలనిది), .32 రివాల్వరు (సరైన సైజు తూటాలు లేనిది), ఏడు సెకెండ్ల ఫ్యూజ్ అమర్చిన 36 సైజు చేతి గ్రెనేడ్లు అయిదు, 90 సెకండ్ల ఫ్యూజ్ అమర్చిన పౌండు గన్ కాటన్లు రెండు, వీరిలో మదన్‌లాల్ ఒక్కడికే ఇటువంటి మారణాయుధాల గురించి కాస్త తెలుసు. కానీ అతను కూడా వీటిని ఉపయోగించి ఎరుగడు. మిగతా వారి సంగతి సరేసరి! వాళ్లుపయోగించే ఆయుధాల పరిమితులేమిటో వారెరుగరు. ఉదాహరణకి దిగంబర్ గాంధీజిని ముప్పయ్ అడుగుల దూరం నుండి కాల్చగలనని అనుకున్నాడు. నిజానికి చాలా నైపుణ్యం ఉన్న వారికే అది సాధ్యం!
ఇక బాంబుల విషయానికి వస్తే వారి ప్లాను ప్రకారం విసిరేసి ఉంటే బాంబులతో బాటు వారూ నాశనమయి వుండేవారు. కానీ వారలా అనుకోలేదు. వెళ్లిన టాక్సీ వాడ్ని వెయిటింగ్‌లో పెట్టి, రానూపోనూ ఛార్జీలు బేరమాడుకున్నారు. బాంబులు ఎడాపెడా విసిరేశాక, ఎవరి కంటా పడకుండా వచ్చి హోటల్లో రెండు రోజులు కాస్త అణిగి ఉండి, ఎవరి ఊళ్లకు వాళ్లు రైళ్లెక్కేయవచ్చనుకున్నారు. నాథూరామ్, ఆప్టేలు హోటల్లో చాకలికి బట్టలు వేసి 22వ తారీక్కు డెలివరీ ఇమ్మన్నారు కూడా!
మారు పేర్లు పెట్టుకొని మారువేషాలు వేసుకుని ఆ సాయంత్రం ఆప్టే, గోపాల్, దిగంబర్, శంకర్‌లు టాక్సీలో బిర్లా హౌస్‌కు చేరుకునేటప్పటికి మదన్‌లాల్ 'బాంబ్ ఏర్పాటు చేసి ఉన్నానని' చెప్పాడు. కర్కరే సర్వెంటు క్వార్టర్లు చూసే మనిషితో మాట్లాడి పెట్టానని చెప్పాడు. నాథూరామ్, ఆప్టేలు దిగంబర్‌ను వెంట బెట్టుకొని ఆ గది వైపుకి సాగుతుండగా ఆ గది గుమ్మం వద్ద మంచంపై ఒక ఒంటి కన్ను మనిషి కూర్చుని వుండడం దిగంబర్ కంటపడింది.
ఏదైనా పని ఆరంభించేటప్పుడు ఒంటి కన్ను మనిషి శకునం అశుభమని నమ్మే దిగంబర్ ఆ గదిలోకి అడుగు పెట్టేందుకు దడిసిపోయాడు. ఆ గదిలోకి వెళ్లక్కర్లేని విధంగా ప్లాను మార్చమని నాయకులిద్దరినీ బతిమాలాడు. కావాలంటే గాంధీని ఎదుటబడి కాల్చేస్తానన్నాడు (పది రోజుల తర్వాత నాథూరామ్ చేసిందదే). కానీ అప్పుడు నాథూరామ్, ఆప్టేలు వద్దన్నారు. తప్పించుకు పారిపోవడం కష్టమన్నారు. కానీ దిగంబర్ ససేమిరా గదిలోకి వెళ్లనన్నాడు.
అప్పటికే గాంధీజీ రావడం, రెండు వందల మంది దాకా జనం చేరడం, ప్రార్థన ఆరంభించడం జరిగాయి. కొద్దిసేపట్లోనే చీకట్లు ఆవరిస్తాయి. గత్యంతరం లేక వారు సరేనన్నారు. కానీ అప్పటికే దిగంబర్ ధైర్యం జావకారిపోయింది. ఈ మారిన ప్లాను శంకర్‌కి చెప్పి వస్తానని చెప్పి బయటపడి, టాక్సీ వద్దకు వచ్చి రెండు రివాల్వర్లూ తువ్వాల్లో చుట్టి టాక్సీ వెనుక సీట్లో పడేశాడు. శంకర్‌కి ఒక గ్రెనేడ్ ఇచ్చి తను చెప్పేదాకా తొందరపడవద్దని చెప్పి తన దగ్గర ఏ ఆయుధం లేకుండానే ఆప్టే వద్దకు వెళ్లి అంతా సిద్ధంగా వుందని చెప్పేసి గాంధీ వైపుకి సాగేడు.
ఆప్టే మదన్‌లాల్ భుజం తట్టి 'ఛలో' అన్నాడు. మదన్‌లాల్ బిర్లా హౌస్ వెనుక భాగానికి వెళ్లి బాంబు ముట్టించబోతుంటే సులోచన అనే ఆమె తన పిల్లవాడ్ని వెతుకుతూ వచ్చి అతడ్ని చూసింది. మదన్‌లాల్ తిరిగి వచ్చాక బాంబు పేలింది. కానీ గాంధీకి పక్కన చేరిన శంకర్‌గానీ, దిగంబర్ గానీ తుపాకీ పేల్చలేదు, బాంబూ విసరలేదు. ఇద్దరూ పరుగెత్తడం మొదలెట్టారు.
అది చూసి ఆప్టే మదన్‌లాల్‌తో 'ప్లాను దెబ్బతింద'ని చెప్పాడు. ఇక మదన్‌లాల్ కూడా పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఇంతకుముందెన్నడూ బిర్లా హౌస్‌కు రాని కారణంగా బయటకు ఎటు వెళ్లాలో తెలియక అటూ ఇటూ పరుగులు పెట్టి ఆ యింటి పోర్టికో దగ్గర తేలేడు. తప్పు గ్రహించి వెనక్కి తిరిగి తను బాంబు పెట్టిన చోటుకి తిరిగి వచ్చి దాటిపోబోయాడు. కానీ సులోచన అక్కడే ఉండి పోలీసులకి ఏదో చెప్తోంది. మదన్‌లాల్‌ని చూడగానే 'అదిగో, అతనే' అని అరిచింది. ఆ విధంగా అతను అరెస్టయ్యాడు.
దిగంబర్, శంకర్‌లు పారిపోవడం చూసిన గోపాల్ తనూ పారిపోదామనుకొని టాక్సీ వద్దకు వచ్చాడు. డ్రైవరు లేడు కానీ వెనుక సీటులో తువ్వాలు మాట చూసి అదేమిటో గ్రహించుకున్నాడు. గాంధీని మట్టుపెట్టడానికి ఈ అవకాశాన్ని చేజారనీయదలచుకోలేదు. ఆ మూట తన చేతి సంచిలో పెట్టుకుని బిర్లా హౌస్‌కి తిరిగి వచ్చాడు. ఆపాటికే జనం కకావికలై తిరుగుతున్నందువలన ఎవరూ అతడ్ని పట్టించుకోలేదు. సర్వెంటు క్వార్టర్స్ కూడా ఖాళీగా వున్నాయి. అతను ఆ గదిలోకి వెళ్లి లోపల గడియ వేసుకుని .38 రివాల్వర్ బయటకు తీశాడు.
అప్పుడే అతనికి తెలియవచ్చింది – ఆ జాలీ నేల నుండి చాలా ఎత్తుగా వుందని! రెండు చేతులూ కిటికీ అంచుపై వేసి బిగదీసుకొంటేనే గానీ గాంధీ ఉన్న చోటు కనబడదు. మరి రివాల్వర్ ఉపయోగించడం ఎలా? ఇక లాభం లేదనుకొని, గది తలుపు తీసుకొని బయటపడి టాక్సీ ఎక్కేశాడు. అప్పటికే దాంట్లో నాథూరామ్, ఆప్టే, కర్కరే ఉన్నారు. దిగంబర్, శంకర్‌లు వారి దారి వాళ్లు పట్టారు.
ఈ విధంగా ఆ హత్యా ప్రయత్నం విఫలమైంది. మదన్‌లాల్ బాంబు పేల్చిన విషయం తెలిసి కూడా గాంధీజీ చలించలేదు. ''పాపం చిన్నవాళ్లు అర్థం చేసుకోలేరు. నేను పోయిన తర్వాత ముసలాయన చెప్పింది నిజం సుమా అని అనుకొంటారు'' – అంటూ వ్యాఖ్యానించాడు జాతిపిత! (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)